బెంగళూరు: గోవధ నిరోధక చట్టాన్ని సమీక్షించాలంటూ కర్ణాటక మంత్రి చేసిన ప్రకటనపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఈ అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చిస్తామంటూ ప్రకటన ఇవ్వడంతో.. నిరసనలను ఉధృతం చేసేందుకు ప్రతిపక్ష బీజేపీ సిద్ధమైంది.
గత బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో స్పష్టత లేదని, రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో చర్చిస్తుందని సిద్ధరామయ్య పేర్కొన్నారు. అయితే.. ఈ చట్టాన్ని ఎత్తేసే అంశంపై ఏదైనా అడుగుపడిందా? అని మీడియా అడగ్గా.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. ‘‘కేబినెట్‌లో ఈ అంశంపై చర్చించాల్సి ఉంది. ఇంకా ఏదీ నిర్ణయించుకోలేదు’’ అని చెప్పారాయన.
అంతకు ముందు కర్ణాటక పశుసంవర్థక శాఖ మంత్రి కే వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. దున్నపోతుల్ని వధించినప్పుడు.. గోవుల్ని ఎందుకు వధించకూడదు? అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. గత బీజేపీ ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. అందులో దున్నపోతుల్ని వధించొచ్చని చెప్పింది. కానీ, గోవుల్ని మాత్రం వధించడానికి వీల్లేదని చెప్పింది. ఈ అంశంపై మేం చర్చించి.. నిర్ణయిస్తాంఅని పేర్కొన్నారాయన. అలాగే.. వయసుపైబడిన ఆవుల్ని వధించడం వల్ల రైతులకు ఉపశనమే తప్పా నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారాయన.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగింది. మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ట్విటర్‌లో మండిపడగా.. మరికొందరు ఎమ్మెల్యేలు సైతం సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
1964 చట్టం ప్రకారం(రద్దైన చట్టం).. 12 ఏళ్లు పైబడిన గోవులను, వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడని గోవులను వధించేందుకు వీలుంది. మంత్రి వెంకటేష్ చెప్పాలనుకుంది కూడా అదే. కానీ, ఆయన సరిగా వివరించలేకపోయారు అని సీఎం సిద్ధరామయ్య తన కేబినెట్ మినిస్టర్‌ను సమర్థించారు.
కర్ణాటక ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ కాటిల్ యాక్ట్‌ను 2020లో తీసుకొచ్చింది కర్ణాటక బీజేపీ సర్కార్. ఆ మరుసటి ఏడాది నుంచి అది అమలు అవుతోంది. దీని ప్రకారం.. కర్ణాటకలో పశువుల్ని వధించడం నిషేధం. ఆవుల్ని, లేగల్ని, ఎదుల్ని పశువుల జాబితాలో చేర్చారు. అయితే.. జబ్బు బారినపడిన పశువుల్ని, 13 ఏళ్ల వయసు పైబడిన గేదెలను(అదీ అధికారుల నుంచి సర్టిఫికెట్ తీసుకున్న తర్వాతే) మాత్రమే వధించడానికి అనుమతి ఇస్తారు. వాటిని వధించేందుకు మాత్రమే కాదు.. ఇతర రాష్ట్రాలు, దేశాలకు తరలించడం కూడా నేరంగా పరిగణిస్తారు. కాదని గోవ వధకు పూనుకుంటే మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష తప్పదు. అలాగే, రూ. 50 వేల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఇప్పటి వరకు గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో ఈ చట్టం అమల్లో ఉండగా.. కర్ణాటక ఆ జాబితాలో మూడో రాష్ట్రంగా చేరింది.
ఇదీ చదవండి: అవసరమైతే మ్యాజిక్కులు చేసుకుని బతుకుతా!
Comments
Please login to add a commentAdd a comment