బదిలీలకు రంగం సిద్ధం | According to the the election commission ready to transfers | Sakshi
Sakshi News home page

బదిలీలకు రంగం సిద్ధం

Published Wed, Jan 22 2014 4:14 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

According to the the election commission ready to transfers

 కలెక్టరేట్, న్యూస్‌లైన్ : 2014 సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం జిల్లాలో అధికారుల బదిలీకి రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి బదిలీలకు సంబంధించి నియమ నిబంధనలు రావడంతో ఆ ప్రకారం.. జిల్లాలో ఉన్న అధికారుల జాబితాను సిద్ధం చేశారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో మొదలైన బదిలీల ప్రక్రియ ఇతర శాఖల్లోనూ కొనసాగనుంది. రెవెన్యూ శాఖ విషయాన్ని పరిశీలిస్తే.. జిల్లాలో మూడు సంవత్సరాలు తహసీల్దార్లుగా పదవీ కాలం పూర్తిచేసుకున్న వారు, జిల్లా స్థానికులు పొరుగు జిల్లాకు బదిలీ కావాల్సి ఉంటుంది.

 ప్రస్తుతం తహసీల్దార్ కేడర్‌లో జిల్లాలో 64మంది ఉన్నారు. వీరిలో 51మంది మండలాల్లో త హసిల్దార్లుగా పనిచేస్తుండగా మిగతా వారు సూపరింటెండెంట్‌లు, ఏవోలుగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 51మంది తహసిల్దార్లలో పాలకుర్తి, పరకాల, వరంగల్ తహసిల్దార్లు మినహా మిగతా 48మంది జిల్లా విడిచి వెళ్లాల్సి ఉంటుంది. అఫిషియేటింగ్‌పై పనిచేస్తున్న 13మందికి కూడా బదిలీ తప్పనిసరి. వీరితో పాటు ఈ సారి సూపరింటెండెంట్ హోదాలో పనిచేస్తున్న వారికి కూడా బదిలీలు తప్పకపోవచ్చునని తెలుస్తోంది.

గతంలో కలెక్టరేట్‌లోని ‘హెచ్’ విభాగం సూపరింటెండెంట్ పోస్టు మాత్రమే నోటిఫైడ్ పోస్ట్ అయినందున బదిలీ ఉండేది. కానీ, ఈ సారి కలెక్టరేట్‌తో పాటు ఆర్డీవో కార్యాలయాల్లో పనిచేస్తున్న సూపరింటెండెంట్‌లకు బదిలీలు తప్పకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లా అధికారులు అందరి వివరాలు సేకరిస్తున్నారు. ఎన్నికల సంఘం తదుపరి ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా బదిలీలు ఉంటాయి.
 
 రిటర్నింగ్ అధికారులు వీరే...
 రిటర్నింగ్ అధికారులుగా స్టేషన్ ఘన్‌పూర్‌కు డ్వామా పీడీ, పాలకుర్తికి జడ్పీ సీఈవో, డోర్నకల్‌కు అర్బన్ ల్యాండ్ సీలింగ్ అధికారి, మహబుబాబాద్, నర్సంపేట, జనగామ, ములుగుకు అక్కడి ఆర్డీవోలు, పరకాలకు ఐటీడీఏ పీవో, వరంగల్ పశ్చిమకు వరంగల్ ఆర్డీవో, వరంగల్ తూర్పుకు మున్సిపల్ కమిషనర్, వర్ధన్నపేటకు ఎస్సారెస్పీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, భూపాలపల్లికి అడిషనల్ జారుుంట్ కలెక్టర్ పోస్టుల్లో ఉన్న వారు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు.

అరుుతే ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్న కారణంగా జడ్పీ సీఈవో ఆంజనేయులుకు ఎన్నికల విధులు కేటాయించరు. ఆయన స్థానంలో వచ్చే కొత్త అధికారి ఎన్నికల విధులు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఏజేసీగా ఉన్న సంజీవయ్య జిల్లాలో మూడేళ్ల విధులు పూర్తయినందున బదిలీ అవుతారు. ఎస్సార్‌ఎస్పీలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న నూత మధుసూదన్ సొంత జిల్లా కారణంగా బదిలీ అవుతారు. వీరితో పాటు ఐటీడీఏ పీవో పోస్టు ప్రస్తుతం ఖాళీగా ఉంది. దీంతో ఈ ప్రాంతాలకు కొత్తగా వచ్చే వారు రిటర్నింగ్ అధికారులుగా ఎన్నికల సమయంలో విధులు నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement