సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. 21 కొత్త జిల్లాల్లో వరంగల్ మినహా మిగతా 20 జిల్లాల్లోని ఏరియా ఆస్పత్రులను జిల్లా ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్ చేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. కొన్ని చోట్ల డిప్యూటీ డీఎంహెచ్‌వోలకు పదోన్నతులు కల్పించి డీఎంహెచ్‌వోలుగా నియమించనున్నారు. మరికొన్ని చోట్ల సీనియర్ సివిల్ సర్జన్లకు డీఎంహెచ్‌వో బాధ్యతలు అప్పగిస్తారు. అలాగే వైద్య విధాన పరిషత్‌లోని ఏరియా ఆస్పత్రులను ఇప్పటివరకు పర్యవేక్షించిన జిల్లా వైద్య సేవల పర్యవేక్షణాధికారి (డీసీహెచ్‌ఎస్) వ్యవస్థను రద్దు చేయనున్నారు.
ఆ పోస్టుల్లో ఉన్న అధికారులను వైద్య కార్యక్రమాల పర్యవేక్షణ అధికారులుగా నియమిస్తారు. దీంతో ఇప్పటివరకు డీసీహెచ్‌ఎస్ పరిధిలో ఉన్న ఆస్పత్రులు ఇక నుంచి వాటి సూపరింటెండెంట్ల పర్యవేక్షణలో కొనసాగుతాయి. ఇక నాలుగైదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలిపి ఏర్పాటు చేసిన క్లస్టర్లు ప్రస్తుతం 137 ఉన్నాయి. వాటిని 63కు తగ్గించి.. బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా డిప్యూటీ డీఎంహెచ్‌వోల పర్యవేక్షణలోకి తీసుకొస్తారు.
ఏరియా ఆస్పత్రులే ఇక జిల్లా ఆస్పత్రులు
Published Sat, Oct 8 2016 4:00 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
Advertisement
Advertisement