
సాక్షి, అమరావతి/మంగళగిరి రూరల్: ఏదైనా ప్రమాదం సంభవిస్తే ‘108’కు ఫోన్ చేయగానే పరుగెత్తుకు రావాల్సిన అంబులెన్స్ సేవలు బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిలిచిపోయాయి. ఈ అంబులెన్స్‌లలో పనిచేస్తున్న సిబ్బందికి, ‘108’నిర్వహణా సంస్థ బీవీజీ యాజమాన్యానికి మధ్య చర్చలు విఫలం కావడమే ఇందుకు కారణం. తమ డిమాండ్ల పరిష్కారానికి బీవీజీ సంస్థ అంగీకరించకపోవడంతో సిబ్బంది నాలుగు గంటలపాటు అంబులెన్స్‌లను నిలిపి వేసి నిరసన తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ‘108’సిబ్బందిని చర్చలకు ఆహ్వానించారు. గురువారం ఉదయం 11 గంటలకు చర్చలు జరగనున్నాయి. ముఖ్య కార్యదర్శితో జరిగే చర్చల్లో సిబ్బందికి న్యాయం జరగకపోతే ఇకపై రోజూ 8 గంటలపాటు అంబులెన్స్ సేవలను నిలిపివేస్తామని ‘108’కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ‘108’కార్యాలయంలో 13 జిల్లాల రాష్ట్ర కమిటీ సభ్యులు.. బీవీజీ సంస్థ ప్రతినిధులతో బుధవారం చర్చలు జరిపారు.
నిబంధనల ప్రకారం తాము రోజుకు 8 గంటలే పనిచేయాల్సి ఉండగా 12 గంటలకుపైగా పని చేయాల్సి వస్తోందని వాపోయారు. 12 గంటల పనివేళలను 8 గంటలకు కుదించాలని, వేతనాలను 50 శాతం జీతాలు పెంచాలని ‘108’కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. ఉద్యోగుల డిమాండ్లను బీవీజీ సంస్థ ఎండీ దేశ్‌పాండే తిరస్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment