
నిమ్స్‌లో రెండు కొత్త ఓపీ టవర్లు
⇒ కిడ్నీ టవర్‌కూ రంగం సిద్ధం
⇒ రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: నిమ్స్‌లో రెండు కొత్త ఔట్ పేషంట్(ఓపీ) టవర్లు, కిడ్నీ టవర్ నిర్మాణం చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఉద్యోగులు, జర్నలిస్టుల ఉచిత ఆరోగ్య పథకం అమలులోకి రావడం.. చాలా మంది ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లలేక.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షలు చెల్లించలేక నిమ్స్ వైపు చూస్తున్నారు. దీంతో నిమ్స్‌కు వస్తున్న రోగుల సంఖ్య పెరిగింది. గతంలో ప్రతి రోజూ ఓపీ 1,500 కాగా.. ఇప్పుడు 2,500కు పెరిగింది. ఆరోగ్యశ్రీ ఓపీ గతేడాది 1.11 లక్షలు, ఇన్‌పేషెంట్(ఐపీ) రోగులకు 13,422 చికిత్సలు చేశారు. దీంతో నిమ్స్‌పై ఒత్తిడి పెరిగింది. ఆ ఒత్తిడిని తట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే ఉద్యోగుల కొత్త పేయింగ్ రూమ్స్ బ్లాక్‌లో 90 స్పెషల్ రూములను రూ.10 కోట్లతో ఆధునీకరించారు. రాబోయే రోజుల్లో పాత వాటి స్థానంలో 700 పడకలను ఆధునీకరించాలని కూడా వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. రూ.52 కోట్లతో అపెక్స్ డయాగ్నసిస్ పరీక్షా కేంద్రాలను మిలీనియం బ్లాక్ ఏడో అంతస్తులో ఏర్పాటు చేయనున్నారు. త్వరలో అవి రోగులకు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు.
రూ.2.5 కోట్ల కేంద్ర నిధులతో జీరియాట్రిక్(వయోవృద్ధుల) మెడిసిన్ విభాగాన్ని త్వరలో అందుబాటులోకి తేనున్నారు. రూ.150 కోట్లతో నెఫ్రో యూరో టవర్స్ నిర్మాణం చేపట్టే ఆలోచన కూడా ఉంది. ప్రస్తుతమున్న సీట్లకు అదనంగా మరో 10 సూపర్ స్పెషాలిటీ పీజీ సీట్ల కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అలాగే వచ్చే ఏడాది నుంచి మరో 8 కొత్త కోర్సుల కోసం ప్రణాళికలు రూపొందించింది.
పెరుగుతున్న పనిభారం..
నిమ్స్‌లో ఇప్పటివరకు ఉన్న 1,140 పడకల సంఖ్యను 1,500కు పెంచారు. అయితే దానికి తగ్గట్లుగా వైద్య సిబ్బంది, నర్సుల నియమకాలు జరపలేదన్న విమర్శలున్నాయి. పడకలు పెరిగి సిబ్బంది సంఖ్య ఆ స్థాయిలో లేకపోవడంతో ఉన్నవారిపై భారం పడుతోంది. ఈ క్రమంలో పలు నియామకాలు జరపాలని నిమ్స్ వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.