వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం
* త్వరలోనే నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: నిమ్స్‌లో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలు సిద్ధం చేయాల్సిందిగా నిమ్స్ అధికారులను వైద్యారోగ్య శాఖ అధికారులు ఆదేశించారు. అలాగే ఖాళీల జాబితా తయారుచేయాలని సూచించారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా, నిమ్స్ డెరైక్టర్ నరేంద్రనాథ్ తదితరులతో సమావేశం జరిపారు.
కాంట్రాక్టు పద్ధతిలో నియమించే వీటిలో నర్సులు, ఇతర పారామెడికల్, సాంకేతిక సిబ్బందిని నియమిస్తారు. మరోవైపు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ నియామకాల భర్తీ, ప్రమోషన్లకు సంబంధించిన కసరత్తు మొదలైంది. ఈ విషయంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఇదిలావుండగా నిమ్స్‌లో ఏపీకి చెందిన వారు ఎక్కువగా ఉన్నందున వారికి చెక్‌పెట్టాలని భావిస్తున్నట్లు వైద్యారోగ్య మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
శాశ్వత ప్రాతిపదికన స్థానికులకు అవకాశం కల్పించవచ్చు, కాని ప్రమోషన్లలో మాత్రం అలా కుదరదు. అందుకే 50 శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని, మిగిలిన 50 శాతం ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రమోషన్లలో ఏపీకి చెందిన వారిని ఎలా అడ్డుకోవాలన్న విషయంపైనా తీవ్రస్థాయిలో చర్చ జరిగినట్లు సమాచారం. అవసరమైతే న్యాయపోరాటానికి దిగాలని సర్కారు యోచిస్తోది.
అరకొర వైద్యులే దిక్కు...
కొంతకాలంగా అరకొర వైద్యులతోనే నిమ్స్ నెట్టుకొస్తుంది. హెమటాలజీ, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఎమర్జెన్సీ మెడిసిన్, మెడికల్ జనటిక్స్, ట్రామకాలజీ సర్జరీ తదితర విభాగాల్లో ఒక్క సూపర్ స్పెషలిస్టు వైద్యుడూ లేరు. సీనియర్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు, అడిషనల్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు, మెడికల్ అధికారులు మొత్తం కలిపి 350 పోస్టులు ఉండాల్సి ఉండగా... ఇందులో 150 పోస్టులు భర్తీకి నోచుకోలేదు.
ఇందులో అత్యధికంగా 72 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులుండగా, 36 లెక్చరర్, 21 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నియామక ప్రక్రియపై గత ఏడాది నవంబర్‌లో కదలిక మొదలైంది. అయితే నియామకాలను ఏ ప్రాతిపదికన నిర్వహించాలనే సందేహంతో ఇన్నాళ్లుగా ఫైలు నిలిచిపోయింది.
పీజీ పూర్తయిన వారి సేవలు...
పీజీ వైద్య విద్య పూర్తయిన విద్యార్థుల సేవలు వినియోగించుకోవడంలో నిమ్స్ యంత్రాంగం విఫలమవుతోందన్న అంశం సర్కారు దృష్టికొచ్చింది. దీనిపై తాజాగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. పీజీ వైద్య విద్య పూర్తయిన విద్యార్థుల సేవలను ఎందుకు ఉపయోగించుకోవడంలేదని నిమ్స్ అధికారులను నిలదీసినట్లు సమాచారం. వారి సేవలు వినియోగించుకుంటే రోగులకు మెరుగైన చికిత్స అందించవచ్చని సూచించినట్లు తెలిసింది. వారి సేవలను వినియోగించుకోవాలని ఆయన ఆదేశించారు.
నిమ్స్‌లో ఉద్యోగ నియామకాలకు పచ్చజెండా
Published Sat, Jul 11 2015 1:20 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
Advertisement
Advertisement