సాక్షి, హైదరాబాద్: పేదల ఆరోగ్య రక్షణ, ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి కోసం గతంలో ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయాన్ని మార్చేలా ఆరోగ్యశ్రీ ట్రస్టు బోర్డు ప్రతిపాదనలు చేసింది. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వ ఆస్పత్రులలో మాత్రమే వైద్యం అందించే 133 రకాల చికిత్సలను రాష్ట్రంలోని మొత్తం 15 ప్రైవేటు వైద్య కాలేజీలకూ వర్తింపజేయాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తే ప్రభుత్వ ఆస్పత్రులకు మళ్లీ పాత పరిస్థితి వస్తుందని వైద్యశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పేదలకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే అత్యున్నత ప్రమాణాలతో వైద్యం అందించాలనే లక్ష్యంతో 2008లో ఆరోగ్యశ్రీ పథకం మొదలైంది. ఈ పథకం కింద ప్రస్తుతం 942 రకాల చికిత్సలు అందిస్తున్నారు. మొదట్లో అన్ని చికిత్సలను అందించేలా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు అవకాశం ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసం కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా శస్త్రచికిత్సలు చేశాయి. అవసరం లేకున్నా గర్భాశయాలను తొలగించడంతోపాటు థైరాయిడ్, అపెండిక్స్, మొర్రి, ఫిస్టులా, హెర్నియా వంటి సమస్యల పేరుతో భారీగా శస్త్రచికిత్సలు నిర్వహించాయి. దీనివల్ల చికిత్సల కోసం వచ్చిన పేదల ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు ప్రభుత్వానికి ఆర్థికంగా అనవసర భారం పడింది. ఈ అంశాలపై అధ్యయనం చేసిన ప్రభుత్వం 133 రకాల చికిత్సలను ప్రైవేటు ఆస్పత్రుల నుంచి తొలగిస్తూ 2012లో నిర్ణయం తీసుకుంది. ఈ చికిత్సలను ప్రభుత్వ ఆస్పత్రులలో మాత్రమే చేయాలని స్పష్టం చేసింది. దీంతో అవసరమైన వారికి మాత్రమే శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ఈ 133 చికిత్సలు నిర్వహణతో ఆరోగ్యశ్రీ నిధులు వచ్చి ప్రభుత్వ ఆస్పత్రులు బలోపేతం అవుతున్నాయి. మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతోంది.
మళ్లీ అదే తీరు...
ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం తమకు రద్దు చేసిన 133 రకాల చికిత్సలను ఎలాగైనా పొందేందుకు ప్రైవేటు ఆస్పత్రులు కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చాయి. వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు చికిత్సల నిర్వహణ బోధించాలనే కారణంతో ప్రైవేటు వైద్య కాలేజీలకు రద్దు చేసిన 133 చికిత్సలను తిరిగి వర్తింపజేయాలని ఆరోగ్యశ్రీ ట్రస్టును కోరాయి. ఐదేళ్లుగా అవసరంలేదని భావించిన ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉన్నతాధికారులు కూడా ఇందుకు అంగీకరించారు. అనంతరం ఈ ప్రతిపాదన ప్రభుత్వానికి చేరింది. ప్రభుత్వం దీనికి అనుమతిస్తే ప్రస్తుతం 133 చికిత్సలను నిర్వహిస్తూ ఆరోగ్యశ్రీ నుంచి నిధులు పొందుతున్న ప్రభుత్వ ఆస్పత్రులకు పోటీగా ప్రైవేటు వైద్య కాలేజీలూ ఆ చికిత్సలను అందిస్తాయి. ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు తగ్గి ఆస్పత్రుల అభివృద్ధిపై ప్రభావం పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment