రూ.17,300 కోట్లతో వైద్య రంగానికి చికిత్స  | CM YS Jagan Review On Medical Health Nadu Nedu In Amaravati | Sakshi
Sakshi News home page

రూ.17,300 కోట్లతో వైద్య రంగానికి చికిత్స 

Published Fri, Oct 30 2020 2:37 AM | Last Updated on Fri, Oct 30 2020 8:14 AM

CM YS Jagan Review On Medical Health Nadu Nedu In Amaravati - Sakshi

రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలను తీసుకొస్తున్నాం. ఇందుకు భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదు. ఆస్పత్రుల్లో పరిశుభ్రత విషయంలో రాజీపడొద్దు. జనరేటర్లు, ఏసీలు పని చేయడం లేదని, శానిటేషన్‌ సరిగా లేదనే మాట ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో నిరాదరణకు గురైన వైద్య, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా చేపడుతున్న నాడు–నేడు కార్యక్రమాలకు రూ.17,300 కోట్లు వ్యయం చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్‌ కాలేజీలకు జనవరిలోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాడు –నేడు కింద కొత్తగా తీసుకొస్తున్న 16 మెడికల్‌ కాలేజీలు, ఇప్పటికే ఉన్న మెడికల్‌ కాలేజీల్లో అభివృద్ధి, పునరుద్ధరణ పనులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ తదితర వాటి నిర్మాణాలు, అభివృద్ధి పనుల పురోగతిపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు ఉండాలన్నారు. ప్రతి అంశానికీ బాధ్యులు ఉండాలని చెప్పారు. ఆస్పత్రిలో పరికరాల దగ్గర నుంచి ఏసీల వరకు ప్రతిదీ సక్రమంగా పని చేసేలా దృష్టి పెట్టాలన్నారు. అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్న తర్వాత వాటి నిర్వహణ బాగోలేదనే మాట రాకూడదని హెచ్చరించారు.

ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..
కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ఉండాలి 

  • ఆస్పత్రుల నిర్మాణంలో పాటిస్తున్న అత్యుత్తమ విధానాలను పరిశీలించి, వాటిని పాటించండి. పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పులివెందులలో కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాలకు నవంబర్‌ లోగా టెండర్లు పిలవాలి. 
  • అనకాపల్లి, మదనపల్లి, ఏలూరు, నర్సాపురం, నంద్యాల, మార్కాపురం, బాపట్లలో మెడికల్‌ కాలేజీల నిర్మాణాలకు డిసెంబర్‌లో.. విజయనగరం, రాజమండ్రి, పెనుకొండ, అమలాపురం, ఆదోని మెడికల్‌ కాలేజీల నిర్మాణాలకు జనవరిలో టెండర్లు పిలవాలి. 
  • వీటి కోసం రూ.7,500 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. ఇప్పుడున్న మెడికల్‌ కాలేజీల్లో నాడు –నేడు పనులకు మరో రూ.5,472 కోట్లు ఖర్చు పెడుతున్నాం. వీటికి అవసరమైన పరిపాలనా పరమైన అనుమతులను వెంటనే మంజూరు చేయాలి. 
  • నిర్మాణ రీతిలో హరిత విధానాలు పాటించడం ద్వారా ఉష్ణోగ్రతలను తగ్గించాలి. కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా సౌకర్యాలు ఉండాలి.

ఆరోగ్యశ్రీ రిఫరల్‌ విధానం బాగుండాలి

  • వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ వచ్చేంత వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆరోగ్యశ్రీకి సంబంధించిన సమాచారం ఇవ్వండి. అక్కడున్న హెల్త్‌ అసిస్టెంట్‌/ఏఎన్‌ఎంల ద్వారా రిఫరల్‌ చేయించాలి. ఎంపానల్‌ అయిన ఆస్పత్రుల జాబితాను గ్రామ, వార్డు, సచివాలయాల్లో ఉంచండి. వైద్యం కావాలనుకున్న వారికి మార్గ నిర్దేశం చేయాలి. 
  • ఆరోగ్య శ్రీ కింద 2 వేల వ్యాధులకు ఇప్పటికే 7 జిల్లాల్లో చికిత్స అమలవుతోంది. నవంబర్‌ 13 నుంచి  మిగిలిన 6 జిల్లాల్లో (శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణ, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం) చికిత్స అందుబాటులోకి వస్తుంది. 
  • అవసరం అనుకుంటే అదనంగా వైద్య ప్రక్రియలను ఈ జాబితాలో చేర్చండి. అంతిమంగా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలి. 
  • ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌ కుమార్‌ సింఘాల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement