ఖాళీగా కాళోజీ వర్సిటీ
రాష్ట్రంలో వైద్య విద్య నిర్వహణలో కీలకమైన వర్సిటీపై ఆ శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి సమీక్షించ కపోవడం వల్లే పోస్టుల భర్తీ ప్రక్రియను ఎవరూ పట్టించు కోవట్లేదనే అభిప్రాయముం ది. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ వైద్య విద్య నిర్వహణ చూసేది. రాష్ట్ర విభజనతో తెలంగాణలో 2014 సెప్టెంబర్ 26న కాళోజీ ఆరోగ్య వర్సిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాత్కాలిక వైస్ చాన్సలర్‌ను, రిజిస్ట్రార్ నియమించింది. వర్సిటీ నిర్వహణకు అవసరమై 82 పోస్టులను శాశ్వత ప్రాతిపదికన, 22 పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అనుమతిస్తూ గతేడాది జనవరి 19న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం అనుమ తిచ్చి ఏడాదిన్నర గడిచినా వర్సిటీ ఉన్నతాధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోవట్లేదు.
వైద్య శాఖలో, ఇతర వర్సిటీల్లో పని చేస్తున్న 21 మందిని డిప్యూటేషన్ పద్ధతిలో నియమిం చారు. దీంతో 61 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మిగతా ఔట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఇటీవలే రెండు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను ఎంపిక చేశారు. ఒకే ఏజెన్సీకి ఈ కాంట్రాక్టు అప్పగించాల్సి ఉండగా.. మంత్రి పేషీలోని ఓ ఉన్నతాధికారి ఒత్తిడి మేరకు 2 సంస్థలకు అప్పగించినట్లు తెలి సింది. ప్రస్తుత ఏడాది వైద్య విద్య కోర్సుల కౌన్సెలింగ్ పూర్తయ్యేలోపు ఈ ఉద్యోగాలను సైతం భర్తీ చేసే అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది.