► జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం
► ఉచితంగా ఆసుపత్రుల్లోనే పంపిణీ
► తెలియని వారి నుంచి సొమ్ము దండుకుంటున్న వైనం
ప్రస్తుతం జనన, మరణ ధ్రువీకరణ పత్రాల అవసరం ప్రతి ఒక్కరికి సర్వ సాధారణమైంది. విద్యాభ్యాసం నుంచి ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకునేంత వరకు అవసరం ఏదైనా జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేయగా... చనిపోయిన వారి మరణాన్ని ధ్రువీకరిస్తూ అధికారికంగా జారీ చేసే ధ్రువపత్రానికి అంతే విలువ పెరిగిపోయింది. ఈ రెండు పత్రాలు పొందే ప్రక్రియ తెలియని వారు దళారుల వలలో పడి మోసపోతున్నారు. విజయనగరం మున్సిపాలిటీలో ఇదే అదునుగా చేసుకుంటున్న పలువురు మున్సిపల్ సిబ్బందితో పాటు వారి అనుచరులుగా వ్యవహరిస్తున్న దళారులు అమాయక ప్రజల నుంచి డబ్బులు గుంజుకుంటున్నారు. ఉచితంగానే ఇచ్చే ధ్రువీకరణ పత్రాల కోసం జేబులు గుల్ల చేసుకుంటున్నారు.
విజయనగరం: విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో నిత్యం జననలతో పాటు మరణాలు పదుల సంఖ్యలోనే జరుగుతుంటాయి. జిల్లా కేంద్రం కావటం... పేరొందిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఇక్కడే ఉండటంతో గర్బిణులు ప్రసవంతో పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి చికిత్సలు చేయిస్తుంటారు. ఇలా వైద్య సేవల కోసం వచ్చిన వారిలో నూతనంగా జన్మించిన పిల్లలు, పరిస్థితి చేయిదాటి మరణించిన వారు ఉంటారు. వీరికి ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. అయితే ఈ రెండు పత్రాల జారీకి సంబంధించి దళారుల అడ్డుగోళ్ల వసూళ్లపై స్పందించిన ప్రభుత్వం గతేడాది డిసెంబర్ ఒకటి అనంతరం జన్మించిన జననాలు, మరణాల ధ్రువీకరణ పత్రాలను ఉచితంగా ఆయా ఆసుపత్రులు, మున్సిపాలిటీలు నుంచి పొందే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది.
విషయం తెలియని పలువురు దళారుల పాలిట పడి చేతి చమురు వదిలించుకుంటున్నట్లు సర్వత్రా వినిపిస్తోంది. ఇందుకు గతంలో అమల్లో విధానం ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు. జనన, మరణాలకు సంబంధించిన ధ్రువీకరణలను మున్సిపాలిటీ ధ్రువీకరరించిన తరువాత మీసేవా కేంద్రాల ద్వారా పొందే వారు. అయితే ఈ ప్రక్రియలో దళారులు కీలక పాత్ర పోషించే వారన్న అపవాద లేకపోలేదు. దీంతో నూతన విధానం ద్వారా దళారుల ఆగడాలకు చెక్ పెట్టారు.
అధికారిక లెక్కల ప్రకారం విజయనగరం మున్సిపాలిటీలో నూతన విధానం అమలు తరువాత ఇప్పటి వరకు 400 మరణాలు, 920 జననాలు జరిగినట్లు మున్సిపల్ అధికారుల సమాచారం. వీరిలో 300 జననాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను మున్సిపాలిటీ నుంచి సదరు పిల్లల తల్లిదండ్రులు పొందారు. అయితే జనన ధ్రువీకరణకు సంబంధించి ఆయా ఆసుపత్రుల్లోనే ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆసుపత్రుల్లో చికిత్స కోసం వెళ్లి మరణిస్తే సదరు ధ్రువీకరణ పత్రం కూడా అక్కడే పొందవచ్చు. అదే ఇంటి వద్దనే సాధారణ మరణం సంభవిస్తే వివరాలను మున్సిపల్ కార్యాలయంలో నమోదు చేయించుకోవటం ద్వారా ధ్రువీకరణ పత్రం తీసుకోవచ్చు.
విషయం తెలియని చాలా మంది దళారుల చేతికి చిక్కి ఇబ్బందులు పడుతున్నట్లు కార్యాలయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు వద్ద సాక్షి ప్రస్తావించగా.... 2016 సంవత్సరం డిసెంబర్ ఒకటి అనంతరం మున్సిపాలిటీ పరిధిలో జరిగే జనన, మరణాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను ఉచితంగానే అందజేస్తున్నట్టు చెప్పారు. ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న వారు సదరు ఆసుపత్రి నుంచే పొందవచ్చని, ఇంటి వద్ద జరిగే వాటికి సంబంధించి మున్సిపాలిటీలో నమోదు చేయించుకుని ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుందన్నారు.