మున్సిపల్ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ప్రక్రియను ఉపాధ్యాయులు బహిష్కరించారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం
విజయనగరం మున్సిపాలిటీ: మున్సిపల్ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ప్రక్రియను ఉపాధ్యాయులు బహిష్కరించారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్న ఈ ప్రక్రియలో మిగులు ఉపాధ్యాయులపై స్పష్టత ఇచ్చేంత వరకు రేషనలైజేషన్ జరగనివ్వమంటూ అడ్డగించారు. మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ ఆశాజ్యోతి ఆధ్వర్యంలో విజయనగరం మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించ తలపెట్టిన రేషనలైజేషన్ ప్రక్రియకు ముందుస్తు సమాచారం ప్రకారం విజయనగరం మున్సిపాలిటీలతో పాటు మిగిలిన మూడు మున్సిపాలిటీలకు చెందిన ఉపాధ్యాయులు హాజరయ్యారు.
ముందుగా పార్వతీపురం మున్సిపాలిటీకి చెందిన ఉపాధ్యాయులకు రేషనలైజేషన్ ప్రక్రియ ప్రారంభించిన సమయంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు తమ సమస్యలను మున్సిపల్ ఆర్డీ ఆశాజ్యోతి దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థుల వాస్తవ నమోదు ప్రకారం మిగులు పోస్టులు గుర్తించాలని, రేషనలైజేషన్ ప్రక్రియను ఏ విధంగా నిర్వహిస్తారని, మిగులు ఉపాధ్యాయులను ఎక్కడికి కేటాయింపు చేస్తారన్న విషయంపై స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకే పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం పోస్టులను సర్దుబాటు చేసిన తరువాతే మిగులు పోస్టులు చూపించాలని, సీనియార్టీ ప్రకారం ఉపాధ్యాయుల జాబితాను తయారుచేసి ఆ జాబితాను పాఠశాలలకు ఇచ్చిన తరువాతనే రేషనలైజేషన్ ప్రక్రియ నిర్వహించాలన్నారు.
మున్సిపల్ ఆర్డీ ఆశాజ్యోతి రేషనలైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్న మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో కొద్ది సేపు వారించారు. మిగులు ఉపాధ్యాయులపై ఉన్నతాధికారుల నుంచి స్పష్టత వచ్చిన విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పగా... ఆ స్పష్టతపై ముందుగా తేల్చాలని డిమాండ్ చేశారు. అంత వరకు రేషనలైజేషన్ ప్రక్రియను జరగనివ్వమంటూ, కౌన్సెలింగ్‌కు హాజరైన ఉపాధ్యాయులంతా కార్యాలయం బయటకు వచ్చేశారు.