సర్దుబాటు మోళీ.. అవన్నీ ఖాళీ
టీచరు పోస్టుల భర్తీలో ఇదీ సంగతి
10,603 పోస్టులు భర్తీ కావాల్సి ఉండగా 9,061కు మాత్రమే ప్రకటన
సాక్షి, హైదరాబాద్: టీచర్ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన టెట్ కమ్ టీఆర్టీ పరీక్ష నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం చూపిస్తున్న పోస్టుల సంఖ్యకు, జిల్లాల్లో వాస్తవ ఖాళీలకు పొంతన కుదరడం లేదు. ఇటీవల ప్రభుత్వం సర్దుబాటు పేరిట రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న సాకుతో అక్కడి ఉపాధ్యాయులను వేరే పాఠశాలల్లో తరలించింది. అక్కడ ఖాళీగా ఉన్న పోస్టులలో వీరిని నియమించింది. ఇలా దాదాపు 15వేల మందిని ఇతర పాఠశాల ల్లోకి పంపి అక్కడి పోస్టులను ఖాళీగా లేనట్లుగా చేసింది. అంటే అప్పటివరకు 15వేల పోస్టులు ఖాళీగా ఉండగా వాటిని భర్తీ చేయాల్సిన ప్రభుత్వం వేరే పాఠశాలల టీచర్లను సర్దుబాటుపేరిట అక్కడ నియమించి ఖాళీలు లేనట్లుగా చేసింది.
ఇలా అనేక మండలాల్లో ఖాళీ పోస్టులేవీ లేనట్లుగా ముందుగానే ఏర్పాట్లు చేసుకుంది. సర్దుబాటుపేరిట ఖాళీ పోస్టులను నింపేసిన స్థానాల సంగతి అటుంచితే జిల్లాల్లో తాజాగా ఉన్న ఖాళీలను కూడా పూర్తిస్థాయిలో చూపించడం లేదు. గురువారం షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు స్కూల్ అసిస్టెంటు, భాషాపండితులు, పీఈటీ, ఎస్జీటీ పోస్టులలో 9061 ఖాళీలున్నట్లు ప్రకటించారు. జిల్లాల నుంచి ‘సాక్షి’ సేకరించిన సమాచారం ప్రకారం ఖాళీల సంఖ్య అంతకన్నా ఎక్కువగానే ఉంది. జిల్లాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లోని పోస్టులు 10,603గా ఉంది.
మంత్రి ప్రకటించిన ఖాళీల సంఖ్య 9,061 మాత్రమే. దాదాపు 1,500 పోస్టులను తగ్గించి చూపించారు. ఆర్థిక శాఖ అనుమతివ్వలేదన్న సాకుతో పోస్టులకు ప్రభుత్వం మంగళం పాడింది. భాషా పండితుల ఖాళీలు 975 ఉండగా దాన్ని 812కు, పీఈటీలు 185 ఉండగా 156కు, ఎస్జీటీ పోస్టులు 7594 ఉండగా 6244 పోస్టులను మాత్రమే అధికారికంగా చూపుతోంది. ఇవి కాకుండా ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లలో మరో 225 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీ విషయం ఎప్పుడన్నది తేల్చలేదు.