విజయనగరం మున్సిపాలిటీ: మున్సిపాలిటీల పరిధిలో ఉపాధ్యాయుల రేషనలైజేషన్ కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం ముగిసింది. మున్సిపల్ రీజనల్ డైరెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కె.రమేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు, అసిస్టెంట్ కమిషనర్ కనకమహాలక్ష్మి ఈ ప్రక్రియను నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో 42 ప్రాథమిక పాఠశాలలు ఉండగా అందులో ఇప్పటి వరకు 102 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా.. గురువారం నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 62 పోస్టులను మిగులుగా తేల్చారు.
అదే విధంగా మూడు ఉన్నత పాఠశాలల్లో 86 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా.. 61 మంది స్కూల్ అసిస్టెంట్‌లను మిగులుగా తేల్చారు. ఈ లెక్కన చూసుకుంటే మున్సిపాలిటీలో ఉన్న 45 ప్రాథమిక , 3 ఉన్నత పాఠశాలల్లో 123 మంది ఉపాధ్యాయులు అదనంగా ఉన్నట్లు లెక్కగట్టారు. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి ఆధారంగా నిర్వహించిన రేషనలైజేషన్ ప్రక్రియలో ఆయా పాఠశాలల్లో అవసరమైన ఉపాధ్యాయులు కన్నా మిగులు ఉపాధ్యాయులే అధికంగా ఉన్నట్లు ప్రభుత్వ నిబంధనలు తేటతెల్లం చేసినట్‌లైంది.
సర్దుబాటు ఎలా?
ఇంత హెచ్చు సంఖ్యలో మిగులు పోస్టులను ఎలా సర్దుబాటు చేస్తారన్న విషయంపై ఇప్పటి వరకు ఎటువంటి ఆదేశాలు జారీ కాలేదు. వాస్తవానికి రెండు రోజుల క్రితం విజయనగరం మున్సిపాలిటీలోనే సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీలకు చెందిన ఉపాధ్యాయులకు రేషనలైజేషన్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించగా... ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వల్లో మిగులు పోస్టులపై స్పష్టత తేలిన తరువాతనే కౌన్సెలింగ్ నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఆ రోజు కౌన్సెలింగ్ ప్రక్రియను బహిష్కరించారు. విషయాన్ని సున్నితంగా పరిశీలించిన రీజనల్ డైరెక్టర్ రమేష్ విభజించు పాలించు అన్న సూత్రాన్ని అమలు చేయటం ద్వారా ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ప్రక్రియను సూనాయాసంగా పూర్తి చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ముగిసిన మున్సిపల్ ఉపాధ్యాయుల రేషనలైజేషన్
Published Fri, Jun 2 2017 3:06 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement