resanalaijesan
-
ముగిసిన మున్సిపల్ ఉపాధ్యాయుల రేషనలైజేషన్
విజయనగరం మున్సిపాలిటీ: మున్సిపాలిటీల పరిధిలో ఉపాధ్యాయుల రేషనలైజేషన్ కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం ముగిసింది. మున్సిపల్ రీజనల్ డైరెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కె.రమేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు, అసిస్టెంట్ కమిషనర్ కనకమహాలక్ష్మి ఈ ప్రక్రియను నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో 42 ప్రాథమిక పాఠశాలలు ఉండగా అందులో ఇప్పటి వరకు 102 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా.. గురువారం నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 62 పోస్టులను మిగులుగా తేల్చారు. అదే విధంగా మూడు ఉన్నత పాఠశాలల్లో 86 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా.. 61 మంది స్కూల్ అసిస్టెంట్లను మిగులుగా తేల్చారు. ఈ లెక్కన చూసుకుంటే మున్సిపాలిటీలో ఉన్న 45 ప్రాథమిక , 3 ఉన్నత పాఠశాలల్లో 123 మంది ఉపాధ్యాయులు అదనంగా ఉన్నట్లు లెక్కగట్టారు. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి ఆధారంగా నిర్వహించిన రేషనలైజేషన్ ప్రక్రియలో ఆయా పాఠశాలల్లో అవసరమైన ఉపాధ్యాయులు కన్నా మిగులు ఉపాధ్యాయులే అధికంగా ఉన్నట్లు ప్రభుత్వ నిబంధనలు తేటతెల్లం చేసినట్లైంది. సర్దుబాటు ఎలా? ఇంత హెచ్చు సంఖ్యలో మిగులు పోస్టులను ఎలా సర్దుబాటు చేస్తారన్న విషయంపై ఇప్పటి వరకు ఎటువంటి ఆదేశాలు జారీ కాలేదు. వాస్తవానికి రెండు రోజుల క్రితం విజయనగరం మున్సిపాలిటీలోనే సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీలకు చెందిన ఉపాధ్యాయులకు రేషనలైజేషన్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించగా... ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వల్లో మిగులు పోస్టులపై స్పష్టత తేలిన తరువాతనే కౌన్సెలింగ్ నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఆ రోజు కౌన్సెలింగ్ ప్రక్రియను బహిష్కరించారు. విషయాన్ని సున్నితంగా పరిశీలించిన రీజనల్ డైరెక్టర్ రమేష్ విభజించు పాలించు అన్న సూత్రాన్ని అమలు చేయటం ద్వారా ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ప్రక్రియను సూనాయాసంగా పూర్తి చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
ఒంగోలు : రేషనలైజేషన్‌కు సంబంధించి ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నారంటూ నిర్లక్ష్యం చేస్తే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ ఉప విద్యాశాఖ అధికారులను, మండల విద్యాశాఖ అధికారులను గుంటూరు ఆర్జేడీ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఆయన ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ ఆవాస ప్రాంతాలు, జాతీయ రహదారి క్రాస్ చేయాల్సిన పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేయరాదన్నారు. జిల్లాలో 10 లోపు విద్యార్థులుండి ఒక కిలోమీటరు పరిధిలో లేని పాఠశాలలు 35–60 పాఠశాలలు ఉన్నాయని, వాటిని కొనసాగించడం కంటే ఆ గ్రామాల్లోని విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. 30 మంది విద్యార్థులలోపు ఉన్న 6,7 తరగతుల యూపీ పాఠశాలలు, 40మంది లోపు విద్యార్థులు ఉన్న 6,7,8 తరగతుల విద్యార్థులు ఉన్న యూపీ పాఠశాలలకు సంబంధించి కూడా జీఐఎస్ పద్దతిన 3 కిలోమీటర్ల పరిధిలో వేరే ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉంటే వాటిని విలీనం చేయాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 50లోపు ఉంటే మూసివేయాల్సిందే అన్నారు. 49 ఉన్నత పాఠశాలలు విలీనం లేదా సింగిల్ మీడియం నిర్వహించే పరిస్థితులు ఉన్నాయని, వాటితోపాటు కొత్తపట్నం, మార్కాపురం పాఠశాలలకు రెండో హెచ్ఎం, రెండో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. పాఠశాలల్లో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీకి సంబంధించి బయోమెట్రిక్ తప్పనిసరి అన్నారు. జూన్ 20వ తేదీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వీటిపై సమీక్షిస్తారని, అప్పటికి ఎక్కడైనా బయోమెట్రిక్ ద్వారా కాకుండా విడిగా సైకిళ్లు పంపిణీ చేస్తే పాఠశాల ప్రధానోపాధ్యాయుల వద్ద నుంచి సంబంధిత మొత్తాన్ని రికవరీ చేస్తారన్నారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 36 శాతం మాత్రమే పాఠ్యపుస్తకాలు వచ్చినందున వచ్చిన వాటిని వచ్చినట్లే పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికే విద్యార్థులకు అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. -
రేషనలైజేషన్ యోచనను విరమించుకోవాలి
విద్యారణ్యపురి : ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల రేషనలైజేషన్ యోచనను విరమించుకోవాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు బి.భుజంగరావు ప్ర భుత్వాన్ని డిమాండ్ చేశారు. హన్మకొండలోని ఎస్టీయూ భవనంలో ఆదివారం జరిగిన సం ఘంస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅ తిథిగా హాజరై మాట్లాడుతూ 2014లో రేషనలైజేషన్ కోసం జీవో 6ను విడుదల చేశాక వ్యతి రేకత వ్యక్తం కావడంతో అప్పట్లో విరమించుకుం దన్నారు. అయితే, మళ్లీ రేషనలైజేషన్‌ను తెరపైకి తీసుకురావడం సరికాదని, వేసవి సెలవుల్లోనే బదిలీలు, రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాలన్నారు. బడిబాట కార్యక్రమంతో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీతో కూడినఆంగ్లమాధ్యమంను అనుమతించాలన్నారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎ.సదయ్య, జిల్లాప్రధాన కార్యదర్శి పి.లక్ష్మినర్సయ్య, బా««దl్యులు అంబాప్రసాద్, బి.రవి, ఆర్.లక్ష్మణ్‌రావు, ఎన్.రమేష్, ఎన్.సాంబయ్య,బి.రమేష్, సుధాకరాచారి, ఏకాంబరాచారి, కె.సురేష్, ఎ.శ్రీధర్, డి. నాగరాజు, డి.శివకోటి, ఎన్.శ్రీహరి పాల్గొన్నారు. -
పేదలకు ఉచిత విద్యను దూరం చేస్తున్న టీడీపీ
18న విజయవాడలో ధర్నా గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు భూషణ్‌రావు డుంబ్రిగుడ: రేషనలైజేషన్ ముసుగులో దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం ఉచిత విద్యను దూరం చేస్తోందని గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కె.భూషణ్‌రావు అన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రేషనలైజేషన్ ముసుగులో రాష్ట్రవ్యాప్తంగా 3,500 పాఠశాలలు మూసివేసిన చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాదిలో 5,475 ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఎత్తివేసేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లను ఎత్తివేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషష్ల కల్పనకు చట్టం చేయాలని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేవారు. డిమాండ్లు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 18న విజయవాడలో చేపట్టబోయే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకుడు వెంకటస్వామి ఉన్నారు. -
నిరుద్యోగ ఉపాధ్యాయులకు నిరాశాపాఠం
జిల్లాలో పెరుగుతున్న నిరుద్యోగ ఉపాధ్యాయులు శిక్షణ పొందినా దక్కని ఉద్యోగం రేషనలైజేషన్‌తో మరింత ముప్పు ఏటా భర్తీకాని టీచర్ పోస్టులు చిరుద్యోగులుగా మిగిలిపోతున్న అభ్యర్థులు భావితరాలకు విద్యాబుద్ధులు నేర్పేది ఉపాధ్యాయులే. అందుకే ఆచార్యదేవో భవ ! అన్నారు పెద్దలు. అటువంటి ఉన్నతమైన వృత్తిపై ఉన్న మక్కువతో జిల్లాలో వేలాది మంది ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేశారు. అంతకు ముందు ఇతర కోర్సుల్లో అవకాశం వచ్చినా కాదనుకున్నారు. చివరకు స్థిరపడాలనుకున్న రంగంలో ఉద్యోగం లభించక కుటుంబ పోషణకోసం ప్రయివేటు సంస్థల్లో చిరుద్యోగులుగా మారుతున్నారు. జిల్లాలో ఉపాధ్యాయ శిక్షణ ముగించుకుని ఏటా ఆరువేల మంది బయటికొచ్చి ఉపాధి వేటలో విసిగివేసారిపోతున్నారు. చిత్తూరు: ఉపాధ్యాయ శిక్షణ ముగించుకుని ఎన్నో ఆశలతో వ్యవస్థలోకి వచ్చే వారికి చదువుకు తగ్గ ఉద్యోగం దొరకడం లేదు. దీంతో వారు నిరాశకు గురవుతున్నారు. మారుమూల మండలాలు గ్రామాల్లోని ప్రైవేటు పాఠశాలల్లో ఉద్యోగం దొరికినా ఆ యాజమాన్యం ఇచ్చే చాలీచాలని జీతానికి అంగీకరించి వెళ్తున్నారు. ఇళ్లు గడవడం కోసం కొంతమంది సెక్యూరిటీ గార్డులు, వారి కుల వృత్తుల్లో ఉపాధి వెతుక్కుంటున్నారు. మరికొంత మంది వ్యసాయం చేసుకుంటున్నారు. ఇదిలానే కొనసాగితే రాబోయే కాలంలో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకునే వారు ఉండరని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. కొంప ముంచుతున్న ప్రభుత్వ నిర్ణయం... ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు ఉపాధ్యాయ నిరుద్యోగులకు శాపమవుతున్నాయి. టీటీసీ శిక్షణ తీసుకున్న వారు మాత్రమే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులని నిబంధన విధించడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. బీఈడీ శిక్షణ తీసుకున్న వారందరూ ఎక్కువ శాతం నిరుద్యోగులుగా మిగులుతున్నారు. టీటీసీ పూర్తి చేసుకున్న వారు ప్రతి సంవత్సరం 2500 మంది. గత 13 సంవత్సరాల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ప్రభుత్వం భర్తీ చేసింది 3200 ఉద్యోగాలు మాత్రమే. ఈ 13 సంవత్సరాల్లో 32500 మంది శిక్షణ ముగించుకొని ఉద్యోగ వేటకు వచ్చారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న డీఎడ్ కాలేజీలు 51. ఈ కాలేజీల్లో సీట్లు సుమారుగా 7 వేలు. ఈ సీట్లలో కేవలం 4500 మంది మాత్రమే ఉపాధ్యాయ శిక్షణ తీసుకుంటున్నారు. 2500 సీట్లు ఖాళీగా మిగులుతున్నాయి. రేషనలైజేషన్‌తో... ప్రభుత్వం రేషనలైజేషన్ విధానం అమలు చేస్తే ఉపాధ్యాయ నిరుద్యోగులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఉన్న స్కూళ్లను మూసివేస్తుండటంతో కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం విముఖత చూపే అవకాశం ఉంది. దీంతో ఉపాధ్యాయ శిక్షణ తీసుకున్నా ఇతర మార్గాలు వెతుక్కోవాల్సి వస్తోంది. తమిళనాడు విధానమే మేలు.. టీచర్ ఉద్యోగాల అమలులో తమిళనాడు విధానం మేలని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. కళాశాలలన్నీ ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటే శిక్షణ బాగుంటుంది. తమిళనాడులో ఉపాధ్యాయ ఉద్యోగాలన్నీ ఎంప్లాయ్మెంట్ ఎక్ఛేంజ్ ద్వారా భర్తీ చేస్తారు. సీనియార్టీ ఉన్న వారికి ఉద్యోగం తప్పనిసరిగా వస్తుంది. ఉపాధ్యాయ నిరుద్యోగి కూడా కచ్చితంగా ఉద్యోగం వస్తుందని ధీమాతో ఉంటాడని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి. కొరియర్‌బాయ్‌గా పని చేస్తున్నా డీఈడీ పూర్తి చేసి మూడేళ్లయింది. ఈ మూడేళ్లలో కేవలం ఒకసారి టీచర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పని చేద్దామంటే రూ.5 వేల జీతం కూడా ఇవ్వరు. పూట గడవడం కష్టం. కొరియర్‌బాయ్‌గా పని చేస్తున్నా. రేషనలైజేషన్ అమలు చేస్తే టీచర్ ఉద్యోగం ఇక దొరకదు. అనవసరంగా డీఎడ్ చేశాను అనిపిస్తోంది. -మహేశ్, చిత్తూరు. సీనియార్టీ విధానం అమలు చేయాలి పరీక్ష విధానం తీసేసి ఉపాధ్యాయుల్ని ఎంపిక చేసే ప్రక్రియలో సీనియార్టీ ప్రకారం ఉద్యోగాలిస్తే మేలు. నిరుద్యోగులకు ఎప్పుడు ఉద్యోగం వ స్తుందో ఒక అంచనా ఉంటుం ది. టీచర్ ఉద్యోగం అవసరం అయిన వారు ఎదురు చూస్తారు. అవసరం లేని వారు ఇంకో ఉపాధి మార్గం ఎంచుకుంటారు. ఉపాధ్యాయ పోస్టులు ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. -వీ. రెడ్డిశేఖర్‌రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు, వైఎస్సార్ టీఎఫ్ -
రేషనలైజేషన్‌పై మరో జీవో
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయుల బది లీల్లో భాగంగా చేపడుతున్న పాఠశాల, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) ప్ర క్రియ ప్రహసనంగా మారింది. షెడ్యూల్ ప్రకారం రేషనలైజేషన్ ప్రక్రియను ఈ నెల 8వ తేదీతో ముగించి ఖాళీలు, మిగులు పోస్టుల జాబితాను 9వ తేదీన ప్రకటించాల్సి ఉంది. రాత్రంతా కసరత్తు చేసినా జాబితా కొలిక్కిరాలేదు. రేషనలైజేషన్ జీఓలను ఇటీవల మూడుసార్లు సవరించడంతో ఆ మేరకు మూడు జాబితాలను జిల్లా స్థాయిలో తయారు చేశారు. ఆగస్టు 31న తేదీ నాటికి విద్యార్థుల నమోదు సంఖ్యను ప్రాతిపధికగా తీసుకొని ఒక జాబితా, ఇదే తేదీలోపు విద్యార్థి ఆధార్ నమోదు సంఖ్యను తీసుకొని మరొకజాబితాను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. అలాగే ఈ సంవత్సరం ఏప్రిల్ 30 నాటికి చైల్డ్ ఇన్ఫో నమోదు ఆధారంగా మూడో జాబితాను జిల్లా విద్యాశాఖ తయారుచేసింది. ఈ మూడు జాబితాలను తయారు చేయడానికి జిల్లా విద్యాశాఖకు దాదాపుగా 15 రోజులు పట్టింది. అయితే తాజాగా బుధవారం రాత్రి 9.30 తరువాత నంబర్ 55తో మరో సవరణ జీఓను విడుదల చేయడంతో ఖాళీలు, మిగులు పోస్టుల సంఖ్య జాబితా తయారీ ప్రక్రియ మొదటికి వచ్చింది. ముందుగా తయారుచేసిన మూడు జాబితాలకు సంబంధం లేకుండా 2015 ఏప్రిల్ 30నాటికి విద్యార్థుల ఆధార్‌నమోదు సంఖ్యను ప్రాతిపదికగా తీసుకొని ఉపాధ్యాయ పోస్టులను లెక్కించాలని సవరణ జీఓలో పేర్కొన్నారు. మరో మూడు అంశాలను పేర్కొని వాటిని పరిగణలోకి తీసుకొని కొత్త జాబితాను శుక్రవారం ఉదయానికే విడుదల చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేశారు. దీంతో జాబితా తయారీలో బుధవారం రాత్రంతా సిబ్బంది తలమునకలయ్యారు. అయితే గురువారం సాయంత్రం 5.00 గంటలలోపు తయారు చేయలేకపోయారు. సవరించిన నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకొని జాబితా తయారు చేయడానికి కనీసం నాలుగు రోజులైన పడుతుందని ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. ఇంతటి ప్రక్రియను హడావుడిగా చేపడితే భారీ స్థాయిలో తప్పులు దొర్లి ఉపాధ్యాయులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బదిలీ షెడ్యూల్ యథావిథిగా కొనసాగుతోంది. బదిలీ దరఖాస్తులను పెట్టుకోవడానికి వెబ్సైట్ గురువారం ఉదయమే ప్రారంభించారు. ఈ నెల 13వ తేదీ వరకు దరఖాస్తులు పెట్టుకొనే అవకాశం ఇచ్చారు. అయితే జిల్లాలో పోస్టుల ఖాళీలు, మిగులు పోస్టులు వివరాలు తెలియక పోవడం వల్ల తొలి రోజున దరఖాస్తులు చేయడానికి ఉపాధ్యాయులు ముందుకురాలేదని తెలుస్తోంది. జిల్లాలో సుమారు 10 వేల మంది ఉపాధ్యాయులున్నారు. వీరిలో 8 సంవత్సరాల సర్వీసున్న ఉపాధ్యాయులు, బదిలీ కోరుకున్న ఉపాధ్యాయులు సుమారు ఆరు వేల మంది వరకు ఉన్నారు. బదిలీ ప్రక్రియ సక్రమంగా లేకపోవడం వల్ల వీరంతా ఆందోళనలో ఉన్నారు. సవరణ జీఓ ద్వారా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే..! వెబ్సైట్లో బదిలీ దరఖాస్తుల స్వీకరణ ముందు ఉపాధ్యాయుల ఐడీ, ఆధార్‌నంబర్లను, పుట్టిన తేదీ, మొదటి నియామకపు తేదీ, ప్రస్తుత పాఠశాలలో నియామకపు తేదీ, పనితీరు పాయింట్లు, ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలి. స్కూళ్లలోని ఎలిమెంటరీ సెక్షన్లకు గాని, ఉన్నత పాఠశాలలకు గాని రేషనలైజేషన్ లేనందువల్ల ఫిజికల్ ైసైన్స్ నుంచి గణితారి, తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంకు మార్పులు ప్రస్తుత బదిలీల్లో లేవు. కావున వాటికి కేటాయించిన ఐదు పాయింట్లను రద్దుచేశారు. -
ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌లో గందరగోళం
నల్లగొండ రూరల్ : ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్ ఆదివారం గందరగోళం, ధర్నాలు, వాగ్వాదాలు, ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నంతో ఒక్కసారిగా వాతావరణం ఉత్కంఠకు దారితీసి సోమవారానికి వాయిదా పడింది. రేషనలైజేషన్‌లో ఎత్తేసిన స్కూళ్ల జాబితాలను ముందుగా ప్రకటించకపోవడంతో ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కౌన్సెలింగ్‌లో పాల్గొని అనుకూలమైన ప్రాంతాలు లభించకపోవడంతో నాట్ విల్లింగ్ పేర్కొన్నారు. గంటల వ్యవధిలోనే రేషనలైజేషన్‌లో స్కూళ్లు ఎత్తేసినట్లుగా ఆన్లైన్లో సమాచారం ఇవ్వడం గందరగోళానికి దారితీసింది. స్పౌజ్ కేసుల్లో కూడా స్పష్టత లేకపోవడం వివాదాస్పదంగా మారింది. గంటకో నిబంధన, పూటకో రూలు అమలు చేయడం, మొత్తం మీద కౌన్సెలింగ్ గందరగోళంగా, వివాదాస్పదంగా మారింది. తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు ఉపాధ్యాయులు పెట్రోల్ సీసాతో ఆత్మహత్యా ప్రయత్నానికి ఒడిగట్టడం ఉపాధ్యాయుల్లో ఒక్కసారిగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఉపాధ్యాయ సంఘాలన్నీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌కు సమాచారం ఇవ్వడంతో కౌన్సెలింగ్ హాల్లో ఉండి పర్యవేక్షించారు. పారదర్శకంగా నిబంధనల ప్రకారం ఇబ్బందులు లేకుండా అందరికీ న్యాయం జరిగేలా కౌన్సెలింగ్ నిర్వహించాలని ఎమ్మెల్సీ పూల రవీందర్.. డీఈఓ ఎస్.విశ్వనాథరావు, ఏజేసీ వెంకట్రావ్‌లకు సూచించారు. ఇదే విషయమై ఆయన కలెక్టర్‌తో కూడా మాట్లాడారు. యూటీఎఫ్, ఏపీటీఎఫ్ సంఘాలు ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించాయి. పీఆర్టీయూ, ఎస్టీయూ, ఆపస్, పీఈటీ, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలు ఎమ్మెల్సీకి అనుకూలంగా నినాదాలు చేశాయి. ఈదశలో ఉపాధ్యాయ సంఘాలు రెండుగా చీలి పోటా పోటీ ధర్నాలకు తెర తీశాయి. ఆత్మహత్యాయత్నం.. నకిరేకల్ బాలికల హైస్కూల్‌ను రేషనలైజేషన్‌లో ఎత్తేశారు. అక్కడ పనిచేస్తున్న స్వరూప ఈ విషయం తెలియకపోవడంతో సాధారణ కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. స్పౌజ్ కేసును పరిగణించాలని కేతేపల్లిలో పనిచేస్తున్న భర్త శ్రీనివాస్ డీఈఓను అభ్యర్థించారు. దీనికి డీఈఓ నిరాకరించారు. దీంతో భర్త శ్రీనివాస్ తనకు న్యాయం జరగలేదని ఆవేదనతో పెట్రోల్ సీసాతో ఎమ్మెల్సీ పూల రవీందర్ ముందే ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. కాళ్లావేళ్లా పడ్డా డీఈఓ కనికరించకపోవడంతో ఉపాధ్యాయుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. రేషనలైజేషన్‌లో హైస్కూల్‌ను తొలగిస్తున్నట్లుగా ఆన్లైన్లో లేకపోవడం, ఉపాధ్యాయులకు సమాచారం లేకపోవడంతో గందరగోళానికి దారితీసింది. అదే విధంగా బాలికల హైస్కూల్ రేషనలైజేషన్‌లో ఉంది. ఈ విషయం ముందుగానే ప్రకటించకపోవడం వివాదాస్పదంగా మారింది. ఖాళీల జాబితాను ముందుగానే ప్రకటించకపోవడంతో డీఈఓ తీరుకు నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు మండిపడ్డాయి. డీఈఓ వద్ద ఉన్న ఖాళీ పోస్టుల వివరాలను బహిర్గతం చేయాలని, స్పౌజ్ జాబితాను 2008 నుంచి ప్రకటించాలని, రేషనలైజేషన్ పాఠశాల జాబితాను బహిర్గతం చేయాలని ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీ పూల రవీందర్ అధికారులకు సూచించారు. ఆదివారం జరగాల్సిన గణితం, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ సోమవారానికి వాయిదా పడింది. ఖండించిన ఉపాధ్యాయ సంఘాలు.. ఎమ్మెల్సీ రవీందర్‌కు వ్యతిరేకంగా సభ్యులు లేని కొన్ని సంఘాలు పనిగట్టుకుని కౌన్సెలింగ్‌లో గందరగోళం సృష్టించడాన్ని ఖండిస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల నేతలు భిక్షపతి, నర్సిరెడ్డి, భిక్షంగౌడ్, కృష్ణమూర్తిలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
టీచర్ల బదిలీలకు 1500 దరఖాస్తులు!
ముగిసిన దరఖాస్తు ప్రక్రియ పాఠశాలల హేతుబద్ధీకరణ పూర్తి సిటీబ్యూరో: ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. రెండేళ్ల తర్వాత టీచర్ల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. బుధవారం సాయంత్రానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు విధానం పూర్తయింది. వాటిని పరిశీలించిన అనంతరం విద్యాశాఖ ఆమోదించాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే దరఖాస్తుల సంఖ్య తేలనుంది. జిల్లాలో మూడు వేలకు పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో తప్పనిసరి బదిలీ అయ్యే వారితోపాటు ఆశావహులు సైతం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్కూళ్లలో ఉన్న మిగులు ఉపాధ్యాయులు 95 మంది, ఒకే పాఠశాలలో ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న 78 మంది ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్లు ఒకే బడిలో విధులు నిర్వహించిన 100 మంది స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ), 200 మంది ఎస్జీటీలు తప్పనిసరిగా ద రఖాస్తు చేసుకున్నట్లే. వీరితో దాదాపు 800 మంది రిక్వెస్ట్ కింద, మరికొందరు ఆశావహ దృక్పథంతో దరఖాస్తులను అప్లోడ్ చేశారని సమాచారం. ఇలా అన్ని విభాగాల్లో 1,500 పైబడి బదిలీ కోసం దరఖాస్తులు వచ్చి ఉండవచ్చని అంచనా. ముగిసిన పాఠశాలల రేషనలైజేషన్ హైదరాబాద్ జిల్లాలో పాఠశాలల హేతుబద్ధీకరణ ప్రక్రియ ముగిసింది. అందుకు సంబంధించిన జాబితాను వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల సంఖ్యలో ఎంటువంటి మార్పులేదు. ఇప్పటివరకు ఉన్న స్కూళ్లు యథావిధిగా 2015-16 విద్యా సంవత్సరానికి కొనసాగనున్నాయి. అయితే ఉన్నత పాఠశాలల్లో నడుస్తున్న సక్సెస్ స్కూళ్ల సంఖ్య మాత్రం తగ్గింది. జిల్లాలో 135 సక్సెస్ స్కూళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వీటిలో 6 నుంచి పదో తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో బోధన అందిస్తున్నారు. 20 సక్సెస్ స్కూళ్లలో 50 మంది లోపు విద్యార్థులే నమోదయ్యారు. రేషనలైజేషన్‌లో భాగంగా వీటిని కిలోమీటర్ పరిధిలో ఉన్న ఇతర సక్సెస్ స్కూళ్లలో విలీనం చేశారు. తద్వారా 15 సక్సెస్ స్కూళ్లు సంఖ్యా పరంగా తగ్గాయని అధికారులు తెలిపారు. ఈ బడుల్లో బోధించే 60 - 70 మంది ఉపాధ్యాయులను ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేయనున్నారు. అలాగే ప్రాథమిక పాఠశాలల సంఖ్యలో మార్పు చోటుచేసుకుంది. ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న రెండు పీఎస్‌లను.. ఒక పీఎస్‌గా మార్చారు. ఇలా పది పీఎస్‌లను ఇతర పీఎస్‌లలో విలీనం చేయడంతో తాజాగా జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల సంఖ్య 624కు పడిపోయింది. విలీనమైన బడుల్లోని ఉపాధ్యాయులకు అదనపు పాయింట్లు కే టాయించనున్నారు. -
ముగిసిన రేషనలైజేషన్
జిల్లా పరిషత్ పాఠశాలల్లో మిగులు పోస్టులను గుర్తించిన విద్యాశాఖ వాటిని సర్దుబాటు చేసేందుకు నానాపాట్లు పడాల్సి వచ్చింది. సర్దుబాటు ప్రక్రియ ఆలస్యం కావడంతో బదిలీల షెడ్యూల్లోనే మార్పులు చేయాల్సి వచ్చింది. విద్యాశాఖ డెరైక్టర్ నుంచి రోజుకో జీఓ జారీ కావడం...దానికి అనుసరించి మార్పులు చేర్పులు చేయడంలో విద్యాశాఖ రేయింబవళ్లు శ్రమించింది. బుధవారం ఉపాధ్యాయ తుదిఖాళీల జాబితాను విద్యాశాఖ వెబ్సైట్లో ప్రవేశపెట్టింది. అలాగే బదిలీల కోసం ఉపాధ్యాయుల దరఖా స్తు కూడా ముగిసింది. 19 మంది విద్యార్థుల లోపు ఉన్న పాఠశాలలకు ఒక టీచరు, 20 నుంచి 60 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ఇద్దరు టీచర్లు చొప్పున కేటగిరీల వారీగా మిగులు పోస్టులను సర్దుబాటు చేశారు. ఈ విధంగా సర్ధుబాటు చేయగా ఇంకా మిగిలిన పోస్టులను డీఈఓ వద్దనే ఉంచారు. ప్రభుత్వం భవిష్యత్తులో డీఎస్సీ ద్వారా లేదా కొత్త పోస్టులు మంజూరు చేసినప్పుడు వీటిని వాడుకుంటారు. బుధవారం రాత్రి 10 గంటల సమయం వరకు విద్యాశాఖ అందించిన సమాచారం మేరకు వివరాలు....జిల్లా పరిషత్ యాజమాన్య కోటాలో జిల్లా ప్రాథమిక పాఠశాలలు 2179 ఉన్నాయి. ఈ పాఠశాలలకు ప్రభుత్వం 5,838 పోస్టులను మంజూరు చేసింది. రేషనలైజేషన్ జీఓ నెం.11, 17 ప్రకారం కా వాల్సిన పోస్టులు 4,765 మాత్రమే. ఇవి గాక 1073 పోస్టులు మిగులుతున్నాయి. దీంట్లో 436 పోస్టులను కదిలించకుండా అక్కడే ఉంచారు. మిగులు పోస్టుల నుంచి కదలించకుండా ఉన్న పోస్టులను తీసేయగా 637 ఎస్జీటీ పోస్టులు మిగిలాయి. వీటిని డీఈఓ వద్దనే ఉంచారు. జెడ్పీ కోటా కిందనే ఉర్దూ విభాగంలో జిల్లాలో 19 పాఠశాలలు ఉన్నాయి. దీంట్లో 41 పోస్టులు మంజూరు కాగా 30 పోస్టులు అవసరం ఉంది. ఈ పోస్టులను సర్దుబాటు చేయగా 11 పోస్టులు మిగులుతున్నాయి. దీంట్లో 5 పోస్టులను కదలించకుండా అక్కడే ఉంచడం ద్వారా 5 పోస్టులు మిగిలాయి. ఉర్దూ మీడియంలో.. ప్రభుత్వ మేనేజ్మెంట్ కింద ఉర్దూ మీడియంలో జిల్లాలో 14 పాఠశాలలు ఉన్నాయి. 38 పోస్టులను మంజూరు చేయగా రేషనలైజేషన్ జీఓ ప్రకారం 24 పోస్టులు సరిపోతున్నాయి. ఈ పోస్టులను మినహాయిస్తే 14 పోస్టులు మిగులుతున్నాయి. దీంట్లో 7 పోస్టులు కదిలించకుండా అక్కడే ఉంచడం ద్వారా మరో 7 పోస్టులు డీఈఓ వద్దనే ఉంచారు. తెలుగు మీడియంలో.. ప్రభుత్వ మేనేజ్మెంట్ కింద తె లుగు మీడియంలో జిల్లాలో 77 పాఠశాలలు ఉన్నాయి. దీంట్లో 225 ఎస్జీటీ పోస్టులు మంజూరు చేశారు. కానీ రేషనలైజేషన్ జీఓ ప్రకారం 167 పోస్టులు సరిపోతున్నాయి. 58 పోస్టులు మిగులుతున్నాయి. దీంట్లో 17 పోస్టులు కదిలించలేదు. ఈ పోస్టుల్లోంచి మిగులు పోస్టులను తీసేయగా 41 పోస్టులు డీఈఓ వద్దనే ఉంచారు. స్కూల్ అసిస్టెంట్ల పోస్టుల వివరాలు ఇంకా అందాల్సి ఉంది. -
ఉపాధ్యాయ ఖాళీ పోస్టుల వెల్లడి
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల తాత్కాలిక జాబితాను సోమవారం జిల్లా విద్యాశాఖ ప్రకటించింది. కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి ఆమోదంతో డీఈఓ ఎస్.విశ్వనాథరావు ఖాళీల వివరాలను కేటగిరీల వారీగా విడుదల చేశారు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులతోపాటు, లాంగ్వేజి పండిట్లు, ఐదేళ్లు, ఎనిమిదేళ్లు సర్వీసు దాటిన ప్రధానోపాధ్యాయుల స్థానాలు, ఎల్ఎఫ్ఎల్ పాఠశాలల్లో 50 ఏళ్లలోపు పనిచేస్తున్న హెచ్ఎంల పోస్టుల వివరాలను విద్యాశాఖ వెబ్సైట్ ఠీఠీఠీ. ఛీౌ్ఛ ్చజౌఛ్చీ.ఛౌజటఞ్టౌ.ఛిౌఝలో ప్రవేశపెట్టారు. ఈ జాబితాపైన ఏమైన అభ్యంతరాలు లేదా సవరణలు ఉన్నట్లయితే అట్టి అభ్యంతరాలను సంబంధిత అధికారి ధ్రువీకరణతో మంగళ, బుధవారాల్లో విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలి. ఇదిలాఉంటే షెడ్యూల్ ప్రకారం రేషనలైజేషన్ జాబితాను కూడా సోమవారం ప్రకటించాల్సి ఉంది. కానీ గుర్తించిన మిగులు పోస్టులను ఏవిధంగా సర్దుబాటు చేయాలనే దానిపై విద్యాశాఖ డెరైక్టర్ నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇక పదో తరగతి ఫలితాల్లో 25 శాతం కంటే తక్కువ మార్కులు సాధించిన ఉపాధ్యాయులు, హెచ్ఎంలకు ఊరట లభించింది. తొలుత జారీ చేసిన నిబంధనల ప్రకారం ఆ పాఠశాలల టీచర్లు, హెచ్ఎంలను 3 లేదా 4 కేటగిరీ పాఠశాలలకు కౌన్సెలింగ్ ముందే బదిలీ చేయాలని ఉంది. దీని ప్రకారం జిల్లాలో ఇద్దరు హెచ్ఎంలు, గణితం సబ్జెక్టుకు సంబంధించిన ఐదుగురు టీచర్లును గుర్తించారు. కానీ సోమవారం డెరైక్టర్ నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు వారిని సాధారణ కౌన్సిలింగ్లోకి తీసుకోవాలని చెప్పడంతో ఆ ఖాళీల వివరాలను కూడా వెల్లడించారు. 2013లో బదిలీ అయినా పాత స్థానాల్లో ఉండిపోయిన టీచర్లు 213 మంది ఉన్నారు. పాత స్థానాల్లో ఉండిపోయిన వారు కోరుకున్న స్థానం హేతుబద్ధీకరణలో పోతే వారి బదిలీ రద్దు చేసి అదనంగా ఐదు పాయింట్లు ఇచ్చి ప్రస్తుత బదిలీల్లో అవకాశం కల్పిస్తారు. అయితే హేతుబద్ధీకరణ కసరత్తు ఇంకా ఎటూ తేలకపోవడంతో ఆ ఖా ళీలను కూడా ప్రకటించారు. హేతుబద్ధీకరణలో పో స్టులు ఉన్నా...లేకున్నా...సాధారణ బదిలీల్లో అవకాశ క ల్పించాలనే డిమాండ్ కూడా ఉపాధ్యాయల వైపు నుంచి ఉంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశంతో ఆ ఖాళీలను కూడా జాబితాలో చేర్చారు. కేటగిరీల వారీగా ఖాళీలు... క్రాఫ్ట్ టీచరు పోస్టులు : లాంగ్‌స్టాండింగ్ -1, ఖాళీలు-97 మొత్తం=98 డ్రాయింగ్ మాస్టర్స్ : ఖాళీలు-32 , మొత్తం=32 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు : లాంగ్‌స్టాండింగ్-283, ఖాళీలు-55 , మొత్తం=338 ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం స్థానాలు : లాంగ్‌స్టాండింగ్-1, ఖాళీలు-88, మొత్తం=89 లాంగ్వేజి పండిట్ హిందీ : లాంగ్‌స్టాండింగ్-9, ఖాళీలు-39, మొత్తం=48 లాంగ్వేజి పండిట్ తెలుగు : 2013 బదిలీల్లో రిలీవ్ చేయని స్థానాలు-2, లాంగ్ స్టాండింగ్-8, ఖాళీలు-67, మొత్తం=77 లాంగ్వేజి పండిట్ ఉర్ధూ : లాంగ్ స్టాండింగ్-1, ఖాళీలు-2. మొత్తం=3 మ్యూజిక్ పోస్టు ఖాళీలు-5, మొత్తం=5 ఫిజికల్ డెరైక్టర్ పోస్టులు : లాంగ్ స్టాండింగ్-7, ఖాళీలు-5, మొత్తం=12 పీఈటీలు : 2013 బదిలీల్లో రిలీవ్ చేయని స్థానాలు -1, లాంగ్‌స్టాండింగ్-14, ఖాళీలు-41, మొత్తం=56 స్కూల్ అసిస్టెంటు స్థానాలు... బయోసైన్స్ : 2013 బదిలీల్లో రిలీవ్ చేయని స్థానాలు-3, లాంగ్‌స్టాండింగ్-19, ఖాళీలు-57, మొత్తం=79 ఇంగ్లిష్ : లాంగ్ స్టాండింగ్ -49, ఖాళీలు-36, మొత్తం=85 హిందీ : 50 ఏళ్లు దాటిన స్థానాలు-1, 2013 బదిలీల్లో రిలీవ్ చేయని స్థానాలు-1, లాంగ్ స్టాండింగ్-19, ఖాళీలు-19., మొత్తం=40 గణితం : 2013 బదిలీల్లో రిలీవ్ చేయని స్థానాలు-1, లాంగ్‌స్టాండింగ్-18, ఖాళీలు-51, మొత్తం=70 ఫిజికల్ సైన్స్ : లాంగ్‌స్టాండింగ్-29, ఖాళీలు-17, మొత్తం=46 సాంఘికశాస్త్రం : 2013 బదిలీల్లో రిలీవ్ చేయని స్థానాలు-5, లాంగ్‌స్టాండింగ్-25, ఖాళీలు-148, మొత్తం=178 తెలుగు : 2013 బదిలీల్లో రిలీవ్ చేయని స్థానాలు-2, లాంగ్ స్టాండింగ్-10, ఖాళీలు-43, మొత్తం=55 ఉర్దూ : ఖాళీలు-2, మొత్తం=2 ఎస్జీటీ స్థానాలు : 2013 బదిలీల్లో రిలీవ్ చేయని స్థానాలు-202, లాంగ్‌స్టాండింగ్-129, ఖాళీలు -1088, మొత్తం=1419 -
ఉపాధ్యాయ ఖాళీలు 14,232
లెక్కలు తేల్చిన విద్యాశాఖ హేతుబద్ధీకరణ చేస్తే పోస్టులు మిగిలేది కష్టమే వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ! కేజీ టు పీజీలో మాత్రం ఎక్కువ పోస్టులు? సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 14,232 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ తేల్చింది. 2014, ఆగస్టు 31 నాటికి విద్యాశాఖ సేకరించిన లెక్కల ప్రకారం (డైస్ డేటా) ఈ ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. అయితే ఖాళీల భర్తీ ఎంతమేరకు అవసరం అన్న కోణం లో ఆలోచనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వివిధ జిల్లాల్లో ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలల్లో విద్యార్థులు లేరు.. విద్యార్థులు ఉన్న చోట ఉపాధ్యాయులు లేరు. దీంతో వేసవి సెలవుల్లో (ఏప్రిల్, మే నెలల్లో) ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) చేపట్టే అంశంపై విద్యాశాఖ ఆలోచనలు చేస్తోంది. గత ఏడాది దసరా సెలవుల్లోనే ఈ ప్రక్రియ చేపట్టాలని భావించినా ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వేసవి సెలవుల్లో హేతుబద్ధీకరణ చేపడతే అభ్యంతరం లేదని చెప్పాయి. దీంతో ఏప్రిల్, మే నెలల్లో రేషనలైజేషన్ చేసే అంశంపై విద్యాశాఖ దృష్టి సారించింది. అది పూర్తయితే టీచర్ పోస్టుల భర్తీ అవసరం ఉండకపోవచ్చన్న భావన నెలకొంది. అయితే ఉన్నత పాఠశాలల్లో మాత్రం కొంతమేరకు సబ్జెక్టు టీచర్ల నియామకాలు అవసరమని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తానికి పోస్టుల భర్తీ అవసరమా? లేదా? అవసరమైతే ఎన్నింటిని భర్తీ చేయాలన్నది రేషనలైజేషన్ తరువాతే తేలనుంది. వెలువడాల్సిన సవరణ ఉత్తర్వులు.. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణపై సవరణ ఉత్తర్వులు వెలువ డాల్సి ఉంది. 2014 సెప్టెంబర్‌లో జారీ చేసిన హేతుబద్ధీకరణ ఉత్తర్వుల ప్రకారం.. ప్రాథమిక పాఠశాలల్లో 19 మంది కంటే తక్కువ మంది విద్యార్థులుంటే.. వారిని కిలోమీటర్ దూరంలోని మరో స్కూల్లో చేరుస్తారు. ఇక ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 75 మంది కంటే తక్కువ మంది పిల్లలు ఉంటే వారిని 3 కిలోమీటర్ల పరిధిలోని స్కూళ్లలో చేర్చాలి. దీంతో నిర్ణీత సంఖ్యకంటే తక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్లు రద్దు కానుండటంతో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. స్కూళ్ల మూసివేత తగదని పేర్కొనడంతో ప్రభుత్వం స్కూళ్లను మూసివేయబోమని అప్పట్లో హామీ ఇచ్చింది. సవరణ ఉత్తర్వులు జారీ చేస్తామని కూడా వెల్లడించింది. కేజీ టు పీజీలో ఉద్యోగాలపైనే ఆశలు ప్రస్తుత పాఠశాలల్లో హేతుబద్ధీకరణ చేపడితే కొత్తగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పరిమితంగానే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలనుకుంటున్న కేజీ టు పీజీ క్యాంపస్‌లలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రాథమిక అంచనా ప్రకారం.. ఒక్కో స్కూల్లో వెయ్యి మంది విద్యార్థులకు బోధించేందుకు 34 పోస్టులు అవసరం. అదే 3-4 వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తే ఒక్కో క్యాంపస్‌లో కనీసం 100 మంది టీచర్లు అవసరం అవుతారు. ఈ లెక్కన 445 మండలాల్లో 50 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు అవసరం. అయితే ప్రస్తుతమున్న ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం ద్వారా కొంత సర్దుబాటు చేసి ఆ తరువాత అవసరం మేరకు పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. -
అరణ్య రోదన
అడుగడుగునా అడవి బిడ్డలకు కష్టాల పలకరింపు గుక్కెడు నీటి కోసం బారెడు దూరం.. పనులు లేక పట్నం బాట పాలకులు మారినా అవే దుర్భర బతుకులు స్వాతంత్య్రం వచ్చి 65 ఏళ్లు గడిచినా ఆదివాసీల జీవనంలో మార్పు లేదు.. వారి బతుకులు మారలేదు.. అదే అరణ్య రోదన.. నరకానికి నకళ్లు చూపించే రహదారులు.. దాహం తీర్చుకోవడానికి మైళ్ల దూరం నడక.. రోగమొచ్చినా.. నొప్పొచ్చినా.. కడుపునొచ్చినా నాటు వైద్యమే దిక్కు.. ప్రభుత్వ వైద్యులు ఉన్నా లేనికిందకే లెక్క.. స్థానికంగా ఉండకపోవడం.. ఉన్నా సరైన వైద్యం అందించకపోవడంతో ఏటా వందల సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నారుు.. చదువుకుంటే విజ్ఞానం పెరిగి అభివృద్ధి చెందుతారనుకుంటే అజ్ఞానంలోనే కాలం వెళ్లదీస్తున్నారు.. అనేక పల్లెలు, తండాలు, గూడేలు విద్యుత్ వెలుగులకు నోచుకోక అంధకారంలోనే మగ్గుతున్నాయి.. ఉపాధి లేక ఉన్న ఊరిని.. కన్నవారిని వదిలి పొట్టచేత పట్టుకుని వలస వెళ్తున్నారు.. ఇంత దుర్భరమైన జీవనం గడుపుతున్నా గిరిజనులపై సర్కారుకు కనీస ప్రేమ లేదు.. అడవి బిడ్డలను పట్టించుకోవాలి.. వారి కలలను సాకారం చేయూలి.. జిల్లాలోని 13 మండలాల్లో విస్తరించి ఉన్న 177 గ్రామాల్లోని 2 లక్షల మంది అడవి బిడ్డల దీనస్థితిపై ‘సాక్షి’ ఫోకస్.. - ములుగు/ఏటూరునాగారం/కొత్తగూడ/మంగపేట సదువు సాగదు.. ఏజెన్సీ పిల్లలు బడికి వెళ్లాలంటే నిత్యం ప్రయాసే. గూడేనికి మైళ్ల దూరంలో పాఠశాల ఉండడంతో విద్యార్థులు ఒంటరిగా వెళ్లలేని పరిస్థితి. వీరిని పాఠశాలకు పంపించడానికి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తీసుకెళ్లాలి. మళ్లీ బడి ముగిశాక తీసుకురావడానికి అదే పరిస్థితి. ప్రస్తుతం 20 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలను అధికారులు రేషనలైజేషన్ పేరుతో మూసివేశారు. దీంతో ఏజెన్సీ గ్రామాల్లోని విద్యార్థులు పక్కనే ఉన్న గ్రామాలకు కాలినడకన వెళ్తున్నారు. ఆర్థిక స్తోమత లేని వారు ఇలా ఫొటోలో కనిపిస్తున్నట్లు సైకిల్ మీద వారి పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తున్నారు. ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి బతికే ఆదివాసీలు ఎన్ని పనులు ఉన్నా సాయంత్రం పాఠశాల వదిలే సమయానికి తిరిగి వారి పిల్లలను తీసుకురావడానికి తంటాలు పడుతున్నారు. తమ గ్రామంలో పాఠశాల ఉంటే కష్టాలు తీరుతాయని ములుగు మండలంలోని లాలాయిగూడెం, దుబ్బగూడెం, పత్తిపల్లి, కొడిశలకుంట, జగ్గన్నపేట, ఏటూరునాగారం మండలం ముల్లకట్ట, మంగపేట మండలం నడిమిగూడెం, కొత్తగూడ మండలం పుల్సంవారిగుంపు, పెద్దెల్లాపూర్తోపాటు వెంకటాపురం, గోవిందరావుపేట మండలాల్లో రేషనలైజేషన్ పేరుతో పదుల సంఖ్యలో ఉన్న ఐటీడీఏ పాఠశాలలను అధికారులు మూసివేశారు. వాటిని పునఃప్రారంభించి ఇబ్బందులు తొలగించాలని వారు కోరుతున్నారు. రవాణా బహుదూరం ఏజెన్సీలోని గిరిజన గూడేలకు రవాణా దూరం.. భారంగా మారింది. సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో నేటికీ ఎడ్ల బండ్లు, సైకిళ్ల మీద ప్రయాణం చేయడం పరిపాటిగా మారింది. వాగులు, ఒర్రెలు నిత్యం ప్రజల రవాణాను అడ్డుకుంటూ గిరిజనులకు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. రోగమొస్తే డొల్లాలు, మంచాలను కట్టుకొని పది మైళ్ల దూరంలో ఉన్న ప్రధాన రహదారికి చేరుకోవాల్సిన దుస్థితి. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో కూడా ఇటువంటి సంఘటనలు ఎన్నెన్నో. వాగులపై కల్వర్టులు, బ్రిడ్జిలు లేకపోవడంతో రాంపూర్, ఐలాపురం, సర్వాయి, చిట్యాల, భూపతిపూర్, లింగాల, రాయబంధం, ఎలిశెట్టిపల్లి గ్రామాలకు రవాణా మార్గం లేక ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఉపాధి లేక వలసలు గిరిజన గూడేల్లో ఉపాధి పనులు లేకపోవడంతో గిరిజనులు వలసపోతున్నారు. ఉపాధిహామీ పథకం మారుమూల అటవీ గ్రామాల్లో చేపట్టకపోవడంతో కూలీ పనుల కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వరి, మిరప పంటల్లో పనిలేదు. దీంతో ట్రాక్టర్లు, కాలినడకన ఇతర గ్రామాలకు చేరుకొని అక్కడ పొద్దంతా కూలీ పనులు చేసి ఇంటికి తిరిగి రావాల్సి వస్తోంది. ఇంకా గొత్తికోయగూడేల్లో సైతం గిరిజనులు ఏటూరునాగార ం నుంచి ఇతర గ్రామాలకు పనులకు వెళ్తున్నారు. వ్యవసాయ పనులు దూరమవుతుంటే.. భవన నిర్మాణ కూలీ పనులపై గిరిజనులు ఆధారపడాల్సిన దయనీయమైన పరిస్థితి నెలకొంది. దరి చేరని వైద్యం ఏజెన్సీలో వైద్యం అందక ఆదివాసీలు విలవిలలాడుతున్నారు. మంగపేట మండలంలోని మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులకు ప్రభుత్వ వైద్య సేవలు అందని ద్రాక్షలా మారాయి. కడుపునొప్పి, జ్వరం వచ్చినా గ్రామాల్లో వైద్య సేవలు అందకపోవడంతో సమీపంలోని మంగపేట, రాజుపేటలోని ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో పొరుగునే ఉన్న ఖమ్మం జిల్లా మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం వంటి పట్టణాల్లోని ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. వైద్యం కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక స్తోమత లేని గిరిజనులు ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు నాటు వైద్యాన్ని నమ్ముకుని ప్రాణాలు వదులుతున్నారు. మంగపేట, చుంచుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ ఆయా కేంద్రాల పరిధిలోని ప్రజలకు వైద్య సేవలు అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ రెండు పీహెచ్‌సీల వైద్యాధికారులు ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు తప్ప మరెవరికీ తెలవకపోవడం గమనార్హం. వాతావరణ పరిస్థితులను బట్టి గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉంటూ గ్రామాల్లో పరిస్థితులను పర్యవేక్షించాల్సిన కొందరు ఏఎన్ఎంలు మండల కేంద్రాల్లో ఉంటూ వారంలో ఒకరోజు సబ్సెంటర్కు వచ్చి వెళ్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్యులు లేకపోవడంతో ఫార్మసిస్టు, స్టాఫ్‌నర్స్ ఇచ్చే మాత్రలు తీసుకొని వెళ్తున్నారు. డీడీలు కట్టినా... జిల్లాలోని 177 ఏజెన్సీ గ్రామాల అభివృద్ధి కోసం ఐటీడీఏ పథకాలను ప్రవేశపెడుతూ అభివృద్ధి చేయాల్సి ఉంది. అయితే ఆ దిశగా సంస్థ ఎలాంటి పనులు చేపట్టలేదని తెలుస్తోంది. మారుమూల గిరిజన గ్రామాల్లో త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం లేక గిరిజన రైతులు వ్యవసాయానికి నీటిని పెట్టుకోలేని పరిస్థితి. కొత్తగూడ మండలం గంగారం పంచాయతీ పరిధిలోని కొడిశలమిట్ట గ్రామంలోని సుమారు 24 మంది రైతులు వ్యవసాయ విద్యుత్ కోసం 2011లో రూ.6,150 చొప్పున డీడీలు తీశారు. అలాగే సొంత డబ్బులు వెచ్చించి బోర్లు ఏర్పాటు చేసుకున్నారు. డీడీలు కట్టి మూడేళ్లు గడిచినా త్రీఫేజ్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయకపోవడంతో రైతులు కష్టాలు పడుతున్నారు. ఐటీడీఏ గ్రీవెన్స్‌కు ఇప్పటికీ పదిహేడుమార్లు దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు. ట్రాన్స్‌కో అధికారులకు ఐటీడీఏ నుంచి నిధులు మంజూరు అయితేగాని గిరిజన రైతుల కష్టాలు తీరవు. నీటి కష్టాలు ఫొటోలో కనిపిస్తున్న వీరు ములుగు మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పగిడపల్లి ఆదివాసీ గిరిజన మహిళలు. వీరు వర్షాకాలం, చలికాలం తాగునీటికి ఇబ్బందిపడుతున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న మంచినీటి బావి వద్దకు బిందె నెత్తిన పెట్టుకుని పరుగులు తీస్తారు. అక్కడ రద్దీ ఎక్కువగా ఉండడంతో క్యూలో నిలబడి నీటిని తోడుకుంటారు. తర్వాత బిందె నెత్తిన పెట్టుకొని ఇంటి దారి పడతారు. దశాబ్దాలుగా ఇదే పరిస్థితి. వీరే కాకుండా చుట్టుపక్కల ఉన్న కన్నాయిగూడెం, సర్వాపురం, పంచోత్కులపల్లి, కొత్తూరు, దుబ్బగూడెం, లాలాయిగూడెం , ఏటూరునాగారం మండలం ఐలాపురం, అల్లంవారి ఘనపురం, చెల్పాక, రాంపూర్, మంగపేట మండలం శెనగకుంట, పూరేడుపల్లి, దోమెడ, తక్కళ్లపల్లి, తాడ్వాయి మండలం మేడారం, కాల్వపల్లి, నార్లాపూర్, ఆశన్నగూడెం, కొత్తగూడ మండలం పూనుగొండ్ల, దుబ్బగూడెం, జంగవానిగూడెం, చిట్యాల తండా, వెంకన్నగుంపు, తిర్మలగండి ఏజెన్సీ గ్రామాల్లోనూ నీటి కోసం కష్టాలు పడుతున్నారు. ఇక వేసవిలో గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతారు. ఇక్కడి ప్రజలు వర్షాకాలం ఎప్పుడొస్తుందా అని.. కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తారు. భూగర్భ జలవనరులు ఈ ప్రాంతంలో తక్కువగా ఉండడంతో వేలాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ బోర్లు వృథా అవుతున్నాయి. నీటి సమస్యను పరిష్కరించాలని ఎన్నిమార్లు వినతులు సమర్పించినా పట్టించుకునేవారు కరువయ్యారు. ఏజెన్సీ ప్రజల బతుకులు మార్చాలని వారితో స్వయంగా చర్చా కార్యక్రమానికి వెళ్లిన కలెక్టర్ వారి నీటి కష్టాన్ని తీర్చలేకపోయారు. నీటి ఇబ్బందులు తొలగిస్తానని హామీ ఇచ్చి ఐదు నెలలు గడిచినా అతీగతి లేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ గ్రామాల పక్కనే లక్నవరం చెరువు ఉంది. అందులో బోర్లు వేయించి చుట్టుపక్కల గ్రామాలకు నీటిని అందిస్తే కష్టాలు తీరుతాయని గిరిజనులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నోటీసులతో ఆందోళన ఆదివాసీలు కడుపు నింపుకునేందుకు పోడు చేసుకుని పంటలు పండిస్తున్నారు. అయితే ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు కొత్తగూడ మండలంలోని పలు గ్రామాల్లో అటవీ శాఖ అధికారులు గిరిజనులకు నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో విప్లవ పార్టీల అండతో పోడు చేసుకుని ఇక్కడి ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. విప్లవ పార్టీల బలం ఎక్కువగా ఉన్నప్పుడు నోరు మెదపని అధికారులు.. కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకుంటామంటూ ఎదుళ్లపల్లి, బత్తులపల్లి, కొత్తగూడ, కోమట్లగూడెం గ్రామ పంచాయతీల పరిధిలోని గిరిజనులకు నోటీసులు జారీ చేశారు. మండల కేంద్రంలో ఇరవై ఎకరాల పోడు భూమిని స్వాధీనం చేసుకుని నర్సరీ పెంచేందుకు సిద్ధం చేశారు. ఇది చర్చనీయాంశంగా మారింది. గిరిజనుల పోడు భూములను స్వాధీనం చేసుకుంటే సహించేది లేదంటూ ఆదివాసీ సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసి హెచ్చరిస్తున్నాయి. అటవీ శాఖ అధికారులు దాడులు ఆపకుంటే తమ బతుకులు ఛిద్రం అవుతాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. మంత్రి పదవి చేపట్టిన చందూలాల్ పోడు భూములపై దృష్టి సారించి ఆదుకోవాలని ఆదివాసీలు కోరుతున్నారు. కర్ర స్తంభాలే దిక్కు కర్ర స్తంభాలను చూస్తే అభివృద్ధి ఎంతమాత్రం ఉందో ఇట్టే అర్థమవుతుంది. స్వాతంత్య్రం వచ్చి 65 ఏళ్లు గడిచినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామానికి ఆదివాసీలు స్వయంగా తయారు చేసిన కర్ర స్తంభాల ఆధారంగానే విద్యుత్ లైన్ ఏర్పాటు చేసుకొని విద్యుత్ కాంతులు పొందుతున్నారు. ఊరు పుట్టిన నాటి నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఈదురు గాలులు, విద్యుత్ హైఓల్టేజీ వల్ల కర్రలు కాలిపోతే మళ్లీ అదే ప్రాంతంలో స్తంభాలు ఏర్పాటు చేసుకోవడం గిరిజనులకు పరిపాటిగా మారింది. ఏళ్లు గడిచినా ఐటీడీఏ ద్వారా స్తంభాలు ఏర్పాటు చేయకపోవడంతో విద్యుత్ కోసం గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. ఐటీడీఏ అధికారులు ట్రాన్స్‌కోకు కొంత మొత్తం నిధులు చెల్లించి గ్రామానికి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని గ్రామంలోని సుమారు 80 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. కానీ.. ఇంతవరకు కరెంటు స్తంభాల కోసం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. ఇప్పటికీ గిరిజనులు విద్యుత్ సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు. -
19 మంది లోపున్న బడులు మూసివేత
విద్యార్థులు లేకుంటే సమీపంలోని పాఠశాలల్లో విలీనం ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్దీకర ణ (రేషనలైజేషన్)కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ మేనేజ్మెంట్ల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉండాల్సిన విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య ను ఉత్తర్వుల్లో పొందుపరిచారు. 2013-14 డైస్ లెక్కల ఆధారంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ కోసం జిల్లా స్థాయిలో సాధికారిక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో జిల్లా స్థాయి సాధికారిక కమిటీకి చైర్మన్‌గా ఆ జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు. జిల్లా విద్యాశాఖాధికారి సభ్య కార్యదర్శిగా, జాయింట్ కలెక్టర్, జెడ్పీ సీఈవో, ఐటీడీఏ పీవో, ఆర్వీఎం పీవో సభ్యులుగా ఉంటారు. రేషనలైజేషన్ ప్రక్రియ అమలుకు షెడ్యూల్, మార్గదర్శకాలు, సూచనలను జారీ చేయాల్సిందిగా పాఠశాల విద్యా కమిషనర్‌ను ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం 19 మం దిలోపు పిల్లలున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను కిలోమీటరు పరిధిలోని ఇతర పాఠశాలల్లో విలీనం చేస్తారు. ఆ స్కూళ్లలోని ఉపాధ్యాయ పోస్టులను విద్యార్థులున్న పాఠశాలలకు బదిలీ చేస్తారు. గిరి జన ప్రాంతాల్లో 19 మందిలోపు విద్యార్థులు ఉన్నా, లేకపోయినా కిలోమీటరు పరిధిలోని ఉన్న మరో ప్రభుత్వ లేదా సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలో విలీనం చేస్తారు. ఒకవేళ కిలోమీటర్ పరిధిలో మరో పాఠశాల లేకపోతే కనీసం 15 మంది విద్యార్థులున్నా ఆ పాఠశాలను కొనసాగిస్తారు. ఇక ఈ హేతుబద్దీకరణపై 29న విద్యాశాఖ అధికారులు సమావేశమై షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. వచ్చే నెల చివరలో ఈ రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. ఇవీ మార్గదర్శకాలు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్దీకరణలో భాగంగా ఉన్న పోస్టుల సర్దుబాటును మాత్రమే చేపడతారు. ఒక్క కొత్త పోస్టు కూడా సృష్టించరు. ప్రాథమిక పాఠశాలల్లో.. 19 మంది కంటే తక్కువ సంఖ్యలో విద్యార్థులున్న పాఠశాలలను కిలోమీటరు పరిధిలో ఉన్న మరో పాఠశాలలో విలీనం చేస్తారు. 20 నుంచి 60 మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు ఎస్జీటీని ఇస్తారు. ఆ తరువాత ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ను కేటాయిస్తారు. విద్యార్థుల సంఖ్య 151కి మించి ఉంటే ఒక ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంను ఇస్తారు. ఇక గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలను విలీనం చేయాల్సి వస్తే ఐటీడీఏ స్కూళ్లలో విలీనం చేస్తారు. పోస్టులను మాత్రం సంబంధిత యాజమాన్యంలోనే సర్దుబాటు చేస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో.. ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాల నిబంధనలే వర్తిస్తాయి. 6, 7, 8 తరగతుల్లో 19 మందికన్నా తక్కువగా విద్యార్థులు ఉంటే.. మూడు కిలోమీటర్ల పరిధిలోని ఉన్న మరో ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేస్తారు. 20 నుంచి 100 మంది విద్యార్థులున్న స్కూళ్లలో ఒక గణితం, ఒక ఆర్ట్స్ స్కూల్ అసిస్టెంట్, రెండు భాషా పండిట్ పోస్టులు ఉంటాయి. 101 నుంచి 140 మంది విద్యార్థులున్న స్కూళ్లలో గణితం టీచర్ పోస్టును అదనంగా ఇస్తారు. ఆ తరువాత ప్రతి 35 మంది విద్యార్థులకు ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్టును అదనంగా ఇస్తారు. ఈ స్కూళ్లలో సీనియర్ అయిన స్కూల్ అసిస్టెంట్ ప్రధానోపాధ్యాయుడిగా వ్యవహరించాలి. స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు వారి సబ్జెక్టులను బోధిస్తూనే, అవసరమైతే ప్రాథమిక తరగతుల్లో బోధించాలి. ఉన్నత పాఠశాల్లో.. 6 నుంచి పదో తరగతి వరకు 75 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలల(ఇంగ్లిష్ మీడియంతో సహా)ను మూసివేసి విద్యార్థులను సమీపంలోని స్కూల్లో నమోదు చేస్తారు. 75 నుంచి 220 మంది విద్యార్థుల వరకు ఉంటే.. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో టీచర్ చొప్పున 9 మందిని ఇస్తారు. ఆ తరువాత ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ను అదనంగా ఇస్తారు. ఉన్నత పాఠశాలల్లో ఒక తరగతిలో కనీస విద్యార్థుల సంఖ్య 40 మంది. 60కి మించితే రెండో సెక్షన్‌ను, 100 మందికి మించితే మూడో సెక్షన్‌ను ఏర్పాటు చేయాలి. పోస్టులను ఒక స్కూల్ నుంచి మరో పాఠశాలకు మా ర్చే పక్షంలో విద్యార్థుల నమోదు, సెక్షన్లను దృష్టిలో పెట్టుకొని కమిటీ నిర్ణయం తీసుకోవాలి. ప్రాంతీయ సంయుక్త సంచాలకుడి అనుమతి లేకుం డా జెడ్పీ, మున్సిపల్ స్కూళ్లలో నిర్వహిస్తున్న అదన పు సెక్షన్లను క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు జారీచేయాలి. మరికొన్ని నిబంధనలు.. బాలికల పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లో కో-ఎడ్యుకేషన్/ బాలుర పాఠశాలల్లో విలీనం చేయొద్దు. ఇంగ్లిషు మీడియం ఉన్న పాఠశాలల్లో 75 మందిలోపు పిల్లలు ఉంటే ఇంగ్లిషు మీడియం కోసం అదనంగా పోస్టులను ఇవ్వరు. 75 నుంచి 220 మంది వరకు పిల్లలున్న స్కూళ్లలో భాషేతర స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 4, 221 నుంచి 260 వరకు 6, 261 నుంచి 340 వరకు 7 పోస్టులు అదనంగా కేటాయిస్తారు. రేషనలైజేషన్‌లో సీనియారిటీ ప్రకారం జూనియర్ అయిన వారిని అదనపు టీచర్‌గా గుర్తిస్తారు. -
ఉచిత విద్యకు ప్రణాళికలు రూపొందించాలి
విద్యాపరిరక్షణ కమిటీ ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి డీఎస్‌యూ ఆధ్వర్యంలో సదస్సు కేయూ క్యాంపస్ : సరైన ప్రణాళిక లేకుండా నే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామని సీఎం కేసీఆర్ హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విద్యాపరి రక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.నర్సిం హారెడ్డి విమర్శించారు. డెమోక్రటిక్ స్టూడెం ట్స్ యూనియన్ (డీఎస్‌యూ) ఆధ్వర్యంలో ‘తెలంగాణ విద్యారంగం, భవిష్యత్ లక్ష్యాలు - కార్యాచరణ’ అంశంపై హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ సెమినార్‌హాల్‌లో శనివారం స దస్సు నిర్వహించారు. ఈ సదస్సులో నర్సిం హారెడ్డి మాట్లాడుతూ సీఎం చెప్పిన మాటల ప్రకారం ఉచిత విద్య కొందరికే చేరువయ్యే అవకాశముందన్నారు. సాధ్యాసాధ్యాలను సరిగా పరిగణనలోకి తీసుకోకుండా ప్రకట నలు చేయడం కాకుండా.. స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఇక కార్పొరేట్ విద్యాసంస్థలపై ప్రభుత్వం ఇంత వరకు తన వైఖరి ప్రకటించలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఎంఈఓ పోస్టులతో పాటు కళాశాలల్లో ఖాళీల ను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం పాఠ్యాం శాల్లో వేదాలు, ఉపనిషత్తులను చేర్చి మనువాద రాజ్య స్థాపనకు కుట్ర పన్నుతోందని విమర్శించారు. సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు చేపట్టకుండా.. రేషనలైజేషన్ పేరి ట వేలాది స్కూళ్ల మూసివేతకు కుట్ర పన్నారని ఆరోపించారు. సదస్సులో డీఎస్‌యూ రాష్ట్ర అ ధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కంచర్ల బద్రి, అరుణాంక్‌తో పాటు సంపత్‌రెడ్డి, జేసీ.పాణి, అమృతరాజు, సిద్ధార్థ, శ్రావణ్, జనార్దన్, అవినాష్, అనిల్, సదయ్య, శివ, నగేష్, భాస్కర్, శ్రీకాంత్, సురేష్, ప్రేంసాగర్ పాల్గొన్నారు. -
229 పాఠశాలలు మూత!
జిల్లాలో 75 కంటే తక్కువ మంది విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలు 67 ప్రాథమికోన్నత స్కూలల్లో 6,7 తరగతుల్లో 20 కన్నా తక్కువ పిల్లలున్న స్కూళ్లు 57 ఇరవై మందికన్నా తక్కువ పిల్లలున్న ప్రాథమిక పాఠశాలలు 105 సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం త్వరలో అమలుచేయబోయే పాఠశాలల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) ప్రక్రియతో జిల్లాలో దాదాపు 229 పాఠశాలలు మూతపడనున్నాయి. దసరా సెలవుల్లో రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు ఆయా పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యను తేల్చడంలో నిమగ్నమయ్యారు. ఒకట్రెండు రోజుల్లో రేషనలైజేషన్ ప్రక్రియకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల కానున్నప్పటికీ.. ఆ వివరాలపై జిల్లా విద్యాశాఖకు సూచనప్రాయంగా ఆదేశాలందాయి. దీంతో చర్యలు చేపట్టిన జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రాథమిక వివరాలతో నివేదిక తయారు చేశారు. రేషనలైజేషన్ ప్రక్రియతో జిల్లాలో దాదాపు 229 పాఠశాలలు మూతపడనున్నట్లు గుర్తించి అవాక్కయ్యారు. ఇంత వెనక‘బడి’పోయామా? జిల్లాలో 2,321 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో 1,651 ప్రాథమిక, 244 ప్రాథమికోన్నత, 426 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిల్లో దాదాపు 3.51లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మౌలిక వసతుల సమస్య, ప్రైవేటు పాఠశాలల ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. పలు పాఠశాలల్లో ఇద్దరేసి టీచర్లున్నా విద్యార్థుల సంఖ్య సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది. దీంతో పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఈ క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ ప్రక్రియపై విద్యాశాఖ సైతం మార్గదర్శకాలు రూపొందించి ప్రభుత్వం ముందు పెట్టింది. ఒకట్రెండు రోజుల్లో వీటికి ఆమెదం పడనుంది. జిల్లా విద్యాశాఖ తయారుచేసిన ప్రాథమిక వివరాల ప్రకారం జిల్లాలో 75 మంది కంటే తక్కువ విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలు 67 ఉన్నాయి. కనీసం 75 మంది విద్యార్థులుంటే గానీ ఉన్నత పాఠశాలలను నడపొద్దని సర్కారు నిర్ణయించింది. దీంతో ఈ పాఠశాలలు మూతపడే అవకాశం ఉంది. అదేవిధంగా మరోవైపు ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆరు, ఏడు తరగతుల్లో కనీసం 20 మంది విద్యార్థులుండాలనే నిబంధన పెట్టింది. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలల్లోనూ కనీసం 20 మంది పిల్లలుండాలి. కానీ జిల్లాలోని 57 యూపీఎస్లలోని 6,7 తరగతుల్లో 20 మంది పిల్లులు కూడా లేరు. 105 ప్రాథమిక పాఠశాలల్లోనూ పిల్లల సంఖ్య 20కి మించలేదు. తాజా రేషనలైజేషన్‌తో ఇవన్నీ మూతపడనున్నాయి. టీచర్లు తారుమారు.. త్వరలో రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తయితే జిల్లాలో దాదాపు వెయ్యిమంది టీచర్లకు స్థాన చలనం కలగనుంది. పిల్లలులేని కారణంగా బడులు మూసివేయడంతో.. అక్కడ పనిచేసే టీచర్లను సమీప పాఠశాలలకు బదిలీ చేయనున్నారు. అదేవిధంగా టీచర్ల నిష్పత్తి, విద్యార్థుల నిష్పత్తిలో తేడా ఉన్న పాఠశాలల్లోనూ ఉపాధ్యాయుల సంఖ్య మారనుంది. మొత్తంగా మార్గదర్శకాలు విడుదలైన అనంతరం ఈ మార్పుల అంశంపై స్పష్టత రానుంది. -
తాళాలేయాల్సిన స్కూళ్లపై తర్జనభర్జన
567 ప్రాథమిక పాఠశాలల్లో 20 మంది కన్నా తక్కువ విద్యార్థులు 130 ప్రాథమికోన్నత పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి పది మంది కంటే తక్కువ ఉన్న స్కూళ్లు 195 వివరాలు సిద్ధం చేసిన జిల్లా విద్యాశాఖ సాక్షి, విశాఖపట్నం : ప్రాథమిక విద్య పడకెక్కుతోంది. ఓ వైపు కొత్తగా పాఠశాలల స్థాయిని పెంచుతున్నట్టు అధికారులు హోరెత్తిస్తున్నారు. మరోవైపు విద్యార్థుల సంఖ్య తగ్గి చాలా స్కూళ్లకు తాళాలు వేయాలనుకుంటున్నారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత(యూపీ) పాఠశాలల వివరాల్ని పరిశీలిస్తే 697 పాఠశాలల్లో 20 మంది కంటే తక్కువ విద్యార్థులున్నట్టు లెక్క తేలింది. వీటిలో ఎన్ని స్కూళ్లు మూసివేయాలన్నదానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. తాజా జాబితా సిద్ధం 2014 జూలై 30 నాటికి జిల్లాలో 567 ప్రాథమిక పాఠశాలల్లో, సుమారు 130 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 20 మంది కన్నా తక్కువగా విద్యార్థులున్నట్టు లెక్క తేల్చారు. వీటిలో 138 ప్రాథమిక పాఠశాలలు, 57 యూపీ స్కూళ్లలో 10 మంది కంటే తక్కువ విద్యార్థులున్నారు. విద్యా హక్కు చట్టం నిబంధనల మేరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత సెక్షన్లకు వేర్వేరుగా కనీసం 20 మంది విద్యార్థులుండాలి. లేకుంటే అలాంటి ప్రాథమిక పాఠశాలను సమీపంలోని యూపీ స్కూల్లోనో, తక్కువ విద్యార్థులున్న యూపీ స్కూళ్లను సమీపంలోని హైస్కూల్లోనో విలీనం చేయాలి. ఉపాధ్యాయుల్ని మండలం యూనిట్‌గా సర్దుబాటు చేయాలి. ఇదే ప్రాతిపదికన ఇప్పటికే యూపీ స్కూళ్ల జాబితా సిద్ధం చేశారు. తాజాగా వీటికి ప్రాథమిక పాఠశాలల వివరాల్ని కూడా జత చేశారు. తీరని సందిగ్థం ఇప్పటికీ రేషనలైజేషన్‌పై ఎటూ తేల్చలేకపోతున్నారు. 20 మంది కన్నా తక్కువ విద్యార్థులున్న యూపీ స్కూళ్లను సమీప హైస్కూళ్లలో విలీనం చేయాలన్న ఆదేశాలతో మరో 400 మంది ఉపాధ్యాయులు మిగిలిపోతున్నారు. ఇప్పుడు 567 ప్రాథమిక పాఠశాలలు కూడా తక్కువ విద్యార్థులున్న జాబితాలో చేరాయి. ఇందులో ఉన్న ఏకోపాధ్యాయుల్ని సర్దుబాటు చేయాల్సి ఉంది. వీరిని కూడా కలిపితే ఏకంగా 1650 మంది ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి. వీరందరినీ ఏం చేయాలన్నదానిపై పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోనున్నట్టు అధికారులు చెప్తున్నారు. -
యూపీ స్కూళ్లకు మంగళం?
6, 7 తరగతుల్లో 20 మంది కంటే తక్కువ ఉంటే ప్రాథమిక పాఠశాలలుగా మార్పు విద్యాశాఖను ప్రతిపాదనలు కోరిన డెరైక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డీఎస్సీలో పోస్టులు కోత పెట్టేందుకే అంటున్న ఉపాధ్యాయ సంఘాలు చిత్తూరు(ఎడ్యుకేషన్) : పాఠశాల విద్యలో మార్పుల పేరుతో ప్రభుత్వం రోజుకో ఉత్తర్వు తెస్తూ అటు ఉపాధ్యాయుల్లోనూ, విద్యాశాఖ వర్గాల్లోనూ ఆందోళన రేపుతోంది. ఇప్పటికే రేషనలైజేషన్ అంటూ ఉపాధ్యాయుల్లో కలకలం రేపిన ప్రభుత్వం తాజాగా ప్రాథమికోన్నత పాఠశాలలను మూసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో 242 పాఠశాలలను ప్రాథమికోన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేసిన ప్రభుత్వం తాజాగా యూపీ స్కూళ్లనే మూసివేసేందుకు రంగం సిద్ధం చేయడం గమనార్హం. డీఎస్సీలో పోస్టులు తగ్గించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న ప్రభుత్వం అందుకు తగినట్లుగా ఒక్కో ఏర్పాటు చేసుకుంటూ వస్తోంది. బడి ఈడు పిల్లలందర్నీ పాఠశాలల్లో చేర్పించేందుకు ఒకపక్క ఆర్భాటంగా బడి పిలుస్తోంది కార్యక్రమం ప్రారంభించి మరోవైపు పాఠశాల విద్యను నిర్వీర్యం చేసే పనులకు పూనుకుంటోంది. ప్రతిపాదనలు ఇవ్వండి జిల్లాలో 450 ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. వీటిలో 6, 7 తరగతుల్లో 20 మంది విద్యార్థుల కంటే సంఖ్య తక్కువగా ఉంటే వాటిని ప్రాథమిక పాఠశాలలుగా మార్చేందుకు వెంటనే ప్రతిపాదనలు పంపాలని డెరైక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (డీఎస్సీ) ఆదేశించింది. దీనికోసం ఆర్సీ నెంబర్ 36ను విడుదల చేసినట్లుగా ఉపాధ్యాయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత ఏడాది నిర్వహించిన యూ-డైస్ సర్వే ప్రకారం జిల్లాలో తక్కువగా విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలలు 186 ఉన్నాయని, వాటికి ప్రతిపాదనలు పంపాలని డీఎస్సీ విద్యాశాఖకు సూచించింది. ఉన్నతాధికారులు 186 పాఠశాలలని చెప్పగా, విద్యాశాఖ అధికారుల లెక్కల ప్రకారం 205 పాఠశాలలున్నాయి. వీటిలో దేనికి ప్రతిపాదనలు పంపాలో తెలియక అధికారులు తికమకపడుతున్నారు. డీఎస్సీలో కోత కోసమేనా 2012లో ఇచ్చిన జీఓ నెం 55 ప్రకారం మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న హైస్కూళ్లకు 6, 7 తరగతుల్లో 20 మంది విద్యార్థుల కంటే తక్కువ సంఖ్య ఉన్న యూపీ స్కూళ్లను విలీనం చేయాలి. రెండేళ్లుగా అమలుకు నోచుకోని ఈ ఉత్తర్వులు తాజాగా తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. డీఎస్సీలో పోస్టుల సంఖ్య తక్కువగా ఇచ్చేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ప్రాథమిక పాఠశాలలుగా చేయడం ద్వారా అక్కడ కొంతమంది ఉపాధ్యాయులు మిగిలిపోతారు. వీరిని రేషనలైజేషన్‌లో సర్దుబాటు చేస్తే చాలా వరకు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరుతుంది. మొదట తాత్కాలిక రేషనలైజేషన్ చేస్తామని చెప్పిన ఉన్నతాధికారులు డీఎస్సీ కంటే ముందు పూర్తి స్థాయిలో రేషనలైజేషన్ చేయాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా డీఎస్సీకి పెద్దగా పోస్టులు ఇవ్వాల్సి అవసరం ఉండదనే ఇదంతా చేస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.