ఒంగోలు : రేషనలైజేషన్‌కు సంబంధించి ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నారంటూ నిర్లక్ష్యం చేస్తే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ ఉప విద్యాశాఖ అధికారులను, మండల విద్యాశాఖ అధికారులను గుంటూరు ఆర్‌జేడీ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఆయన ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ ఆవాస ప్రాంతాలు, జాతీయ రహదారి క్రాస్ చేయాల్సిన పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేయరాదన్నారు.
జిల్లాలో 10 లోపు విద్యార్థులుండి ఒక కిలోమీటరు పరిధిలో లేని పాఠశాలలు 35–60 పాఠశాలలు ఉన్నాయని, వాటిని కొనసాగించడం కంటే ఆ గ్రామాల్లోని విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. 30 మంది విద్యార్థులలోపు ఉన్న 6,7 తరగతుల యూపీ పాఠశాలలు, 40మంది లోపు విద్యార్థులు ఉన్న 6,7,8 తరగతుల విద్యార్థులు ఉన్న యూపీ పాఠశాలలకు సంబంధించి కూడా జీఐఎస్ పద్దతిన 3 కిలోమీటర్ల పరిధిలో వేరే ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉంటే వాటిని విలీనం చేయాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 50లోపు ఉంటే మూసివేయాల్సిందే అన్నారు.
49 ఉన్నత పాఠశాలలు విలీనం లేదా సింగిల్ మీడియం నిర్వహించే పరిస్థితులు ఉన్నాయని, వాటితోపాటు కొత్తపట్నం, మార్కాపురం పాఠశాలలకు రెండో హెచ్‌ఎం, రెండో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. పాఠశాలల్లో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీకి సంబంధించి బయోమెట్రిక్ తప్పనిసరి అన్నారు. జూన్ 20వ తేదీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వీటిపై సమీక్షిస్తారని, అప్పటికి ఎక్కడైనా బయోమెట్రిక్ ద్వారా కాకుండా విడిగా సైకిళ్లు పంపిణీ చేస్తే పాఠశాల ప్రధానోపాధ్యాయుల వద్ద నుంచి సంబంధిత మొత్తాన్ని రికవరీ చేస్తారన్నారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 36 శాతం మాత్రమే పాఠ్యపుస్తకాలు వచ్చినందున వచ్చిన వాటిని వచ్చినట్లే పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికే విద్యార్థులకు అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
Published Wed, May 31 2017 11:13 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement