ఉపాధ్యాయ ఖాళీలు 14,232
- లెక్కలు తేల్చిన విద్యాశాఖ
- హేతుబద్ధీకరణ చేస్తే పోస్టులు మిగిలేది కష్టమే
- వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ!
- కేజీ టు పీజీలో మాత్రం ఎక్కువ పోస్టులు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 14,232 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ తేల్చింది. 2014, ఆగస్టు 31 నాటికి విద్యాశాఖ సేకరించిన లెక్కల ప్రకారం (డైస్ డేటా) ఈ ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. అయితే ఖాళీల భర్తీ ఎంతమేరకు అవసరం అన్న కోణం లో ఆలోచనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వివిధ జిల్లాల్లో ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలల్లో విద్యార్థులు లేరు.. విద్యార్థులు ఉన్న చోట ఉపాధ్యాయులు లేరు. దీంతో వేసవి సెలవుల్లో (ఏప్రిల్, మే నెలల్లో) ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) చేపట్టే అంశంపై విద్యాశాఖ ఆలోచనలు చేస్తోంది.
గత ఏడాది దసరా సెలవుల్లోనే ఈ ప్రక్రియ చేపట్టాలని భావించినా ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వేసవి సెలవుల్లో హేతుబద్ధీకరణ చేపడతే అభ్యంతరం లేదని చెప్పాయి. దీంతో ఏప్రిల్, మే నెలల్లో రేషనలైజేషన్ చేసే అంశంపై విద్యాశాఖ దృష్టి సారించింది. అది పూర్తయితే టీచర్ పోస్టుల భర్తీ అవసరం ఉండకపోవచ్చన్న భావన నెలకొంది. అయితే ఉన్నత పాఠశాలల్లో మాత్రం కొంతమేరకు సబ్జెక్టు టీచర్ల నియామకాలు అవసరమని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తానికి పోస్టుల భర్తీ అవసరమా? లేదా? అవసరమైతే ఎన్నింటిని భర్తీ చేయాలన్నది రేషనలైజేషన్ తరువాతే తేలనుంది.
వెలువడాల్సిన సవరణ ఉత్తర్వులు..
ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణపై సవరణ ఉత్తర్వులు వెలువ డాల్సి ఉంది. 2014 సెప్టెంబర్‌లో జారీ చేసిన హేతుబద్ధీకరణ ఉత్తర్వుల ప్రకారం.. ప్రాథమిక పాఠశాలల్లో 19 మంది కంటే తక్కువ మంది విద్యార్థులుంటే.. వారిని కిలోమీటర్ దూరంలోని మరో స్కూల్లో చేరుస్తారు. ఇక ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 75 మంది కంటే తక్కువ మంది పిల్లలు ఉంటే వారిని 3 కిలోమీటర్ల పరిధిలోని స్కూళ్లలో చేర్చాలి. దీంతో నిర్ణీత సంఖ్యకంటే తక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్లు రద్దు కానుండటంతో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. స్కూళ్ల మూసివేత తగదని పేర్కొనడంతో ప్రభుత్వం స్కూళ్లను మూసివేయబోమని అప్పట్లో హామీ ఇచ్చింది. సవరణ ఉత్తర్వులు జారీ చేస్తామని కూడా వెల్లడించింది.
కేజీ టు పీజీలో ఉద్యోగాలపైనే ఆశలు
ప్రస్తుత పాఠశాలల్లో హేతుబద్ధీకరణ చేపడితే కొత్తగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పరిమితంగానే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలనుకుంటున్న కేజీ టు పీజీ క్యాంపస్‌లలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రాథమిక అంచనా ప్రకారం.. ఒక్కో స్కూల్లో వెయ్యి మంది విద్యార్థులకు బోధించేందుకు 34 పోస్టులు అవసరం. అదే 3-4 వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తే ఒక్కో క్యాంపస్‌లో కనీసం 100 మంది టీచర్లు అవసరం అవుతారు. ఈ లెక్కన 445 మండలాల్లో 50 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు అవసరం. అయితే ప్రస్తుతమున్న ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం ద్వారా కొంత సర్దుబాటు చేసి ఆ తరువాత అవసరం మేరకు పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది.