జిల్లాలో పెరుగుతున్న నిరుద్యోగ ఉపాధ్యాయులు
శిక్షణ పొందినా దక్కని ఉద్యోగం
రేషనలైజేషన్‌తో మరింత ముప్పు
ఏటా భర్తీకాని టీచర్ పోస్టులు
చిరుద్యోగులుగా మిగిలిపోతున్న అభ్యర్థులు
భావితరాలకు విద్యాబుద్ధులు నేర్పేది ఉపాధ్యాయులే. అందుకే ఆచార్యదేవో భవ ! అన్నారు పెద్దలు. అటువంటి ఉన్నతమైన వృత్తిపై ఉన్న మక్కువతో జిల్లాలో వేలాది మంది ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేశారు. అంతకు ముందు ఇతర కోర్సుల్లో అవకాశం వచ్చినా కాదనుకున్నారు. చివరకు స్థిరపడాలనుకున్న రంగంలో ఉద్యోగం లభించక కుటుంబ పోషణకోసం ప్రయివేటు సంస్థల్లో చిరుద్యోగులుగా మారుతున్నారు. జిల్లాలో ఉపాధ్యాయ శిక్షణ ముగించుకుని ఏటా ఆరువేల మంది బయటికొచ్చి ఉపాధి వేటలో విసిగివేసారిపోతున్నారు.
చిత్తూరు: ఉపాధ్యాయ శిక్షణ ముగించుకుని ఎన్నో ఆశలతో వ్యవస్థలోకి వచ్చే వారికి చదువుకు తగ్గ ఉద్యోగం దొరకడం లేదు. దీంతో వారు నిరాశకు గురవుతున్నారు. మారుమూల మండలాలు గ్రామాల్లోని ప్రైవేటు పాఠశాలల్లో ఉద్యోగం దొరికినా ఆ యాజమాన్యం ఇచ్చే చాలీచాలని జీతానికి అంగీకరించి వెళ్తున్నారు. ఇళ్లు గడవడం కోసం కొంతమంది సెక్యూరిటీ గార్డులు, వారి కుల వృత్తుల్లో ఉపాధి వెతుక్కుంటున్నారు. మరికొంత మంది వ్యసాయం చేసుకుంటున్నారు. ఇదిలానే కొనసాగితే రాబోయే కాలంలో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకునే వారు ఉండరని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు.
కొంప ముంచుతున్న ప్రభుత్వ నిర్ణయం...
ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు ఉపాధ్యాయ నిరుద్యోగులకు శాపమవుతున్నాయి. టీటీసీ శిక్షణ తీసుకున్న వారు మాత్రమే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులని నిబంధన విధించడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. బీఈడీ శిక్షణ తీసుకున్న వారందరూ ఎక్కువ శాతం నిరుద్యోగులుగా మిగులుతున్నారు. టీటీసీ పూర్తి చేసుకున్న వారు ప్రతి సంవత్సరం 2500 మంది. గత 13 సంవత్సరాల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ప్రభుత్వం భర్తీ చేసింది 3200 ఉద్యోగాలు మాత్రమే. ఈ 13 సంవత్సరాల్లో 32500 మంది శిక్షణ ముగించుకొని ఉద్యోగ వేటకు వచ్చారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న డీఎడ్ కాలేజీలు 51. ఈ కాలేజీల్లో సీట్లు సుమారుగా 7 వేలు. ఈ సీట్లలో కేవలం 4500 మంది మాత్రమే ఉపాధ్యాయ శిక్షణ తీసుకుంటున్నారు. 2500 సీట్లు ఖాళీగా మిగులుతున్నాయి.
రేషనలైజేషన్‌తో...
ప్రభుత్వం రేషనలైజేషన్ విధానం అమలు చేస్తే ఉపాధ్యాయ నిరుద్యోగులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఉన్న స్కూళ్లను మూసివేస్తుండటంతో కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం విముఖత చూపే అవకాశం ఉంది. దీంతో ఉపాధ్యాయ శిక్షణ తీసుకున్నా ఇతర మార్గాలు వెతుక్కోవాల్సి వస్తోంది.
తమిళనాడు విధానమే మేలు..
టీచర్ ఉద్యోగాల అమలులో తమిళనాడు విధానం మేలని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. కళాశాలలన్నీ ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటే శిక్షణ బాగుంటుంది. తమిళనాడులో ఉపాధ్యాయ ఉద్యోగాలన్నీ ఎంప్లాయ్‌మెంట్ ఎక్ఛేంజ్ ద్వారా భర్తీ చేస్తారు. సీనియార్టీ ఉన్న వారికి ఉద్యోగం తప్పనిసరిగా వస్తుంది. ఉపాధ్యాయ నిరుద్యోగి కూడా కచ్చితంగా ఉద్యోగం వస్తుందని ధీమాతో ఉంటాడని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి.
కొరియర్‌బాయ్‌గా పని చేస్తున్నా
డీఈడీ పూర్తి చేసి మూడేళ్లయింది. ఈ మూడేళ్లలో కేవలం ఒకసారి టీచర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పని చేద్దామంటే రూ.5 వేల జీతం కూడా ఇవ్వరు. పూట గడవడం కష్టం. కొరియర్‌బాయ్‌గా పని చేస్తున్నా. రేషనలైజేషన్ అమలు చేస్తే టీచర్ ఉద్యోగం ఇక దొరకదు. అనవసరంగా డీఎడ్ చేశాను అనిపిస్తోంది. -మహేశ్, చిత్తూరు.
సీనియార్టీ విధానం అమలు చేయాలి
పరీక్ష విధానం తీసేసి ఉపాధ్యాయుల్ని ఎంపిక చేసే ప్రక్రియలో సీనియార్టీ ప్రకారం ఉద్యోగాలిస్తే మేలు. నిరుద్యోగులకు ఎప్పుడు ఉద్యోగం వ స్తుందో ఒక అంచనా ఉంటుం ది. టీచర్ ఉద్యోగం అవసరం అయిన వారు ఎదురు చూస్తారు. అవసరం లేని వారు ఇంకో ఉపాధి మార్గం ఎంచుకుంటారు. ఉపాధ్యాయ పోస్టులు ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. -వీ. రెడ్డిశేఖర్‌రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు, వైఎస్సార్ టీఎఫ్