అరణ్య రోదన
అడుగడుగునా అడవి బిడ్డలకు కష్టాల పలకరింపు గుక్కెడు నీటి కోసం బారెడు దూరం.. పనులు లేక పట్నం బాట పాలకులు మారినా అవే దుర్భర బతుకులు
స్వాతంత్య్రం వచ్చి 65 ఏళ్లు గడిచినా ఆదివాసీల జీవనంలో మార్పు లేదు.. వారి బతుకులు మారలేదు.. అదే అరణ్య రోదన.. నరకానికి నకళ్లు చూపించే రహదారులు.. దాహం తీర్చుకోవడానికి మైళ్ల దూరం నడక.. రోగమొచ్చినా.. నొప్పొచ్చినా.. కడుపునొచ్చినా నాటు వైద్యమే దిక్కు.. ప్రభుత్వ వైద్యులు ఉన్నా లేనికిందకే లెక్క.. స్థానికంగా ఉండకపోవడం.. ఉన్నా సరైన వైద్యం అందించకపోవడంతో ఏటా వందల సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నారుు.. చదువుకుంటే విజ్ఞానం పెరిగి అభివృద్ధి చెందుతారనుకుంటే అజ్ఞానంలోనే కాలం వెళ్లదీస్తున్నారు.. అనేక పల్లెలు, తండాలు, గూడేలు విద్యుత్ వెలుగులకు నోచుకోక అంధకారంలోనే మగ్గుతున్నాయి.. ఉపాధి లేక ఉన్న ఊరిని.. కన్నవారిని వదిలి పొట్టచేత పట్టుకుని వలస వెళ్తున్నారు.. ఇంత దుర్భరమైన జీవనం గడుపుతున్నా గిరిజనులపై సర్కారుకు కనీస ప్రేమ లేదు.. అడవి బిడ్డలను పట్టించుకోవాలి.. వారి కలలను
సాకారం చేయూలి.. జిల్లాలోని 13 మండలాల్లో విస్తరించి ఉన్న 177 గ్రామాల్లోని 2 లక్షల మంది అడవి బిడ్డల దీనస్థితిపై ‘సాక్షి’ ఫోకస్..
- ములుగు/ఏటూరునాగారం/కొత్తగూడ/మంగపేట
సదువు సాగదు..
ఏజెన్సీ పిల్లలు బడికి వెళ్లాలంటే నిత్యం ప్రయాసే. గూడేనికి మైళ్ల దూరంలో పాఠశాల ఉండడంతో విద్యార్థులు ఒంటరిగా వెళ్లలేని పరిస్థితి. వీరిని పాఠశాలకు పంపించడానికి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తీసుకెళ్లాలి. మళ్లీ బడి ముగిశాక తీసుకురావడానికి అదే పరిస్థితి. ప్రస్తుతం 20 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలను అధికారులు రేషనలైజేషన్ పేరుతో మూసివేశారు. దీంతో ఏజెన్సీ గ్రామాల్లోని విద్యార్థులు పక్కనే ఉన్న గ్రామాలకు కాలినడకన వెళ్తున్నారు. ఆర్థిక స్తోమత లేని వారు ఇలా ఫొటోలో కనిపిస్తున్నట్లు సైకిల్ మీద వారి పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తున్నారు. ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి బతికే ఆదివాసీలు ఎన్ని పనులు ఉన్నా సాయంత్రం పాఠశాల వదిలే సమయానికి తిరిగి వారి పిల్లలను తీసుకురావడానికి తంటాలు పడుతున్నారు. తమ గ్రామంలో పాఠశాల ఉంటే కష్టాలు తీరుతాయని ములుగు మండలంలోని లాలాయిగూడెం, దుబ్బగూడెం, పత్తిపల్లి, కొడిశలకుంట, జగ్గన్నపేట, ఏటూరునాగారం మండలం ముల్లకట్ట, మంగపేట మండలం నడిమిగూడెం, కొత్తగూడ మండలం పుల్సంవారిగుంపు, పెద్దెల్లాపూర్‌తోపాటు వెంకటాపురం, గోవిందరావుపేట మండలాల్లో రేషనలైజేషన్ పేరుతో పదుల సంఖ్యలో ఉన్న ఐటీడీఏ పాఠశాలలను అధికారులు మూసివేశారు. వాటిని పునఃప్రారంభించి ఇబ్బందులు తొలగించాలని వారు కోరుతున్నారు.
రవాణా బహుదూరం
ఏజెన్సీలోని గిరిజన గూడేలకు రవాణా దూరం.. భారంగా మారింది. సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో నేటికీ ఎడ్ల బండ్లు, సైకిళ్ల మీద ప్రయాణం చేయడం పరిపాటిగా మారింది. వాగులు, ఒర్రెలు నిత్యం ప్రజల రవాణాను అడ్డుకుంటూ గిరిజనులకు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. రోగమొస్తే డొల్లాలు, మంచాలను కట్టుకొని పది మైళ్ల దూరంలో ఉన్న ప్రధాన రహదారికి చేరుకోవాల్సిన దుస్థితి. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో కూడా ఇటువంటి సంఘటనలు ఎన్నెన్నో. వాగులపై కల్వర్టులు, బ్రిడ్జిలు లేకపోవడంతో రాంపూర్, ఐలాపురం, సర్వాయి, చిట్యాల, భూపతిపూర్, లింగాల, రాయబంధం, ఎలిశెట్టిపల్లి గ్రామాలకు రవాణా మార్గం లేక ప్రజలు కష్టాలు పడుతున్నారు.
ఉపాధి లేక వలసలు
గిరిజన గూడేల్లో ఉపాధి పనులు లేకపోవడంతో గిరిజనులు వలసపోతున్నారు. ఉపాధిహామీ పథకం మారుమూల అటవీ గ్రామాల్లో చేపట్టకపోవడంతో కూలీ పనుల కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వరి, మిరప పంటల్లో పనిలేదు. దీంతో ట్రాక్టర్లు, కాలినడకన ఇతర గ్రామాలకు చేరుకొని అక్కడ పొద్దంతా కూలీ పనులు చేసి ఇంటికి తిరిగి రావాల్సి వస్తోంది. ఇంకా గొత్తికోయగూడేల్లో సైతం గిరిజనులు ఏటూరునాగార ం నుంచి ఇతర గ్రామాలకు పనులకు వెళ్తున్నారు. వ్యవసాయ పనులు దూరమవుతుంటే.. భవన నిర్మాణ కూలీ పనులపై గిరిజనులు ఆధారపడాల్సిన దయనీయమైన పరిస్థితి నెలకొంది.
దరి చేరని వైద్యం
ఏజెన్సీలో వైద్యం అందక ఆదివాసీలు విలవిలలాడుతున్నారు. మంగపేట మండలంలోని మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులకు ప్రభుత్వ వైద్య సేవలు అందని ద్రాక్షలా మారాయి. కడుపునొప్పి, జ్వరం వచ్చినా గ్రామాల్లో వైద్య సేవలు అందకపోవడంతో సమీపంలోని మంగపేట, రాజుపేటలోని ఆర్‌ఎంపీ వైద్యులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో పొరుగునే ఉన్న ఖమ్మం జిల్లా మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం వంటి పట్టణాల్లోని ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. వైద్యం కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక స్తోమత లేని గిరిజనులు ఆర్‌ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు నాటు వైద్యాన్ని నమ్ముకుని ప్రాణాలు వదులుతున్నారు. మంగపేట, చుంచుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ ఆయా కేంద్రాల పరిధిలోని ప్రజలకు వైద్య సేవలు అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ రెండు పీహెచ్‌సీల వైద్యాధికారులు ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు తప్ప మరెవరికీ తెలవకపోవడం గమనార్హం. వాతావరణ పరిస్థితులను బట్టి గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉంటూ గ్రామాల్లో పరిస్థితులను పర్యవేక్షించాల్సిన కొందరు ఏఎన్‌ఎంలు మండల కేంద్రాల్లో ఉంటూ వారంలో ఒకరోజు సబ్‌సెంటర్‌కు వచ్చి వెళ్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్యులు లేకపోవడంతో ఫార్మసిస్టు, స్టాఫ్‌నర్స్ ఇచ్చే మాత్రలు తీసుకొని వెళ్తున్నారు.
డీడీలు కట్టినా...
జిల్లాలోని 177 ఏజెన్సీ గ్రామాల అభివృద్ధి కోసం ఐటీడీఏ పథకాలను ప్రవేశపెడుతూ అభివృద్ధి చేయాల్సి ఉంది. అయితే ఆ దిశగా సంస్థ ఎలాంటి పనులు చేపట్టలేదని తెలుస్తోంది. మారుమూల గిరిజన గ్రామాల్లో త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం లేక గిరిజన రైతులు వ్యవసాయానికి నీటిని పెట్టుకోలేని పరిస్థితి. కొత్తగూడ మండలం గంగారం పంచాయతీ పరిధిలోని కొడిశలమిట్ట గ్రామంలోని సుమారు 24 మంది రైతులు వ్యవసాయ విద్యుత్ కోసం 2011లో రూ.6,150 చొప్పున డీడీలు తీశారు. అలాగే సొంత డబ్బులు వెచ్చించి బోర్లు ఏర్పాటు చేసుకున్నారు. డీడీలు కట్టి మూడేళ్లు గడిచినా త్రీఫేజ్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయకపోవడంతో రైతులు కష్టాలు పడుతున్నారు. ఐటీడీఏ గ్రీవెన్స్‌కు ఇప్పటికీ పదిహేడుమార్లు దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు. ట్రాన్స్‌కో అధికారులకు ఐటీడీఏ నుంచి నిధులు మంజూరు అయితేగాని గిరిజన రైతుల కష్టాలు తీరవు.
నీటి కష్టాలు
ఫొటోలో కనిపిస్తున్న వీరు ములుగు మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పగిడపల్లి ఆదివాసీ గిరిజన మహిళలు. వీరు వర్షాకాలం, చలికాలం తాగునీటికి ఇబ్బందిపడుతున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న మంచినీటి బావి వద్దకు బిందె నెత్తిన పెట్టుకుని పరుగులు తీస్తారు. అక్కడ రద్దీ ఎక్కువగా ఉండడంతో క్యూలో నిలబడి నీటిని తోడుకుంటారు. తర్వాత బిందె నెత్తిన పెట్టుకొని ఇంటి దారి పడతారు. దశాబ్దాలుగా ఇదే పరిస్థితి. వీరే కాకుండా చుట్టుపక్కల ఉన్న కన్నాయిగూడెం, సర్వాపురం, పంచోత్కులపల్లి, కొత్తూరు, దుబ్బగూడెం, లాలాయిగూడెం , ఏటూరునాగారం మండలం ఐలాపురం, అల్లంవారి ఘనపురం, చెల్పాక, రాంపూర్, మంగపేట మండలం శెనగకుంట, పూరేడుపల్లి, దోమెడ, తక్కళ్లపల్లి, తాడ్వాయి మండలం మేడారం, కాల్వపల్లి, నార్లాపూర్, ఆశన్నగూడెం, కొత్తగూడ మండలం పూనుగొండ్ల, దుబ్బగూడెం, జంగవానిగూడెం, చిట్యాల తండా, వెంకన్నగుంపు, తిర్మలగండి ఏజెన్సీ గ్రామాల్లోనూ నీటి కోసం కష్టాలు పడుతున్నారు. ఇక వేసవిలో గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతారు. ఇక్కడి ప్రజలు వర్షాకాలం ఎప్పుడొస్తుందా అని.. కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తారు. భూగర్భ జలవనరులు ఈ ప్రాంతంలో తక్కువగా ఉండడంతో వేలాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ బోర్లు వృథా అవుతున్నాయి. నీటి సమస్యను పరిష్కరించాలని ఎన్నిమార్లు వినతులు సమర్పించినా పట్టించుకునేవారు కరువయ్యారు. ఏజెన్సీ ప్రజల బతుకులు మార్చాలని వారితో స్వయంగా చర్చా కార్యక్రమానికి వెళ్లిన కలెక్టర్ వారి నీటి కష్టాన్ని తీర్చలేకపోయారు. నీటి ఇబ్బందులు తొలగిస్తానని హామీ ఇచ్చి ఐదు నెలలు గడిచినా అతీగతి లేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ గ్రామాల పక్కనే లక్నవరం చెరువు ఉంది. అందులో బోర్లు వేయించి చుట్టుపక్కల గ్రామాలకు నీటిని అందిస్తే కష్టాలు తీరుతాయని గిరిజనులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
నోటీసులతో ఆందోళన
ఆదివాసీలు కడుపు నింపుకునేందుకు పోడు చేసుకుని పంటలు పండిస్తున్నారు. అయితే ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు కొత్తగూడ మండలంలోని పలు గ్రామాల్లో అటవీ శాఖ అధికారులు గిరిజనులకు నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో విప్లవ పార్టీల అండతో పోడు చేసుకుని ఇక్కడి ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. విప్లవ పార్టీల బలం ఎక్కువగా ఉన్నప్పుడు నోరు మెదపని అధికారులు.. కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకుంటామంటూ ఎదుళ్లపల్లి, బత్తులపల్లి, కొత్తగూడ, కోమట్లగూడెం గ్రామ పంచాయతీల పరిధిలోని గిరిజనులకు నోటీసులు జారీ చేశారు. మండల కేంద్రంలో ఇరవై ఎకరాల పోడు భూమిని స్వాధీనం చేసుకుని నర్సరీ పెంచేందుకు సిద్ధం చేశారు. ఇది చర్చనీయాంశంగా మారింది. గిరిజనుల పోడు భూములను స్వాధీనం చేసుకుంటే సహించేది లేదంటూ ఆదివాసీ సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసి హెచ్చరిస్తున్నాయి. అటవీ శాఖ అధికారులు దాడులు ఆపకుంటే తమ బతుకులు ఛిద్రం అవుతాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. మంత్రి పదవి చేపట్టిన చందూలాల్ పోడు భూములపై దృష్టి సారించి ఆదుకోవాలని ఆదివాసీలు కోరుతున్నారు.
కర్ర స్తంభాలే దిక్కు
కర్ర స్తంభాలను చూస్తే అభివృద్ధి ఎంతమాత్రం ఉందో ఇట్టే అర్థమవుతుంది. స్వాతంత్య్రం వచ్చి 65 ఏళ్లు గడిచినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామానికి ఆదివాసీలు స్వయంగా తయారు చేసిన కర్ర స్తంభాల ఆధారంగానే విద్యుత్ లైన్ ఏర్పాటు చేసుకొని విద్యుత్ కాంతులు పొందుతున్నారు. ఊరు పుట్టిన నాటి నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఈదురు గాలులు, విద్యుత్ హైఓల్టేజీ వల్ల కర్రలు కాలిపోతే మళ్లీ అదే ప్రాంతంలో స్తంభాలు ఏర్పాటు చేసుకోవడం గిరిజనులకు పరిపాటిగా మారింది. ఏళ్లు గడిచినా ఐటీడీఏ ద్వారా స్తంభాలు ఏర్పాటు చేయకపోవడంతో విద్యుత్ కోసం గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. ఐటీడీఏ అధికారులు ట్రాన్స్‌కోకు కొంత మొత్తం నిధులు చెల్లించి గ్రామానికి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని గ్రామంలోని సుమారు 80 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. కానీ.. ఇంతవరకు కరెంటు స్తంభాల కోసం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. ఇప్పటికీ గిరిజనులు విద్యుత్ సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు.