సాక్షి, అమరావతి: గిరిజన సంక్షేమం, అభివృద్ధిలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలు (ఐటీడీఏ) కీలకపాత్ర పోషిస్తున్నాయి. గిరిజనులను ఆధునిక సమాజం వైపు మళ్లించే కార్యక్రమంలో భాగంగా అటవీ ప్రాంతాల్లో ఇవి ఏర్పాటయ్యాయి. విద్య, వైద్యం వంటి రంగాల్లో వీరికి మరిన్ని సదుపాయాలు కల్పించాలనే ధ్యేయంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అంతేకాక.. గిరిజనుల్లో పోషకాహార లోపాన్ని సరిదిద్దేందుకు, వారికి జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఐటీడీఏల ద్వారా చర్యలు తీసుకుంటోంది.
షెడ్యూల్డ్ ఏరియాగా అటవీ గ్రామాలు
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 27.39 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. వీరు అధికంగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ఏరియాలో ఉన్న అటవీ గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో 36 మండలాలు, 4,765 గ్రామాలున్నాయి. వీటికి ప్రత్యేక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. షెడ్యూల్డ్ గ్రామాల్లో గిరిజనులు గ్రామసభల ద్వారా తీసుకునే నిర్ణయాలను ప్రభుత్వం అమలుచేయాల్సి ఉంటుంది.
పీవీటీజీల కోసం ప్రత్యేక కార్యాచరణ
రాష్ట్రంలోని పాడేరు, పార్వతీపురం, రంపచోడవరం, సీతంపేట, శ్రీశైలం ఐటీడీఏల్లో ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూపులు (పీవీటీజీ) ఉన్నాయి. వీటిల్లో ప్రధానంగా కోండు, గదబ, పూర్జ, చెంచు వంటి ఆదిమ గిరిజనులు ఉన్నారు. ఆధునిక సమాజం గురించి ఇప్పటికీ వీరికి పూర్తిస్థాయిలో అవగాహనలేదు. అందువల్ల వీరి కోసం ప్రత్యేక కార్యాచరణ ద్వారా కార్యక్రమాలు చేపడతారు. శ్రీశైలం ఐటీడీఏ పూర్తిగా చెంచు గిరిజనుల కోసం ఏర్పాటుచేసింది. నల్లమల అడవుల్లో వీరు నివసిస్తున్నారు. అలాగే, నెల్లూరులో కేవలం యానాదుల కోసం ఐటీడీఏ ఏర్పాటైంది. ఇక మిగిలిన రంపచోడవరం, సీతంపేట, పార్వతీపురం, కోట రామచంద్రాపురం, చింతూరు, పాడేరు ఐటీడీఏల్లో అన్ని కులాలకు చెందిన గిరిజనులు ఉన్నారు. ఒక్క పాడేరులోనే 6,04,047 మంది గిరిజనులు ఉన్నారు. సాధారణ జనంతో పోలిస్తే ఇక్కడ గిరిజనులు 91 శాతంమంది ఉన్నారు. అరకు ప్రాంత అడవులపై వీరు ఆధారపడి జీవిస్తున్నారు. ఇలా మొత్తం 34 రకాల కులాలకు చెందిన గిరిజనులు రాష్ట్రంలో జీవిస్తున్నారు.
ఏజెన్సీ పల్లెల ముంగిట్లోకి ప్రభుత్వం
గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలతోపాటు విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అయితే, గిరిజన విశ్వవిద్యాలయం, గిరిజన ఇంజనీరింగ్–మెడికల్ కాలేజీలు, ఏడు ఐటీడీఏల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటుచేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్ గిరిజన సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. అంతేకాక.. ప్రతి పంచాయతీలో గ్రామ సచివాలయాలు ఏర్పాటుకావడంతో పూర్తిస్థాయిలో ప్రభుత్వం వారి ముంగిటకు చేరింది. ఏ సమస్య ఉన్నా ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశం గిరిజనులకు కలిగింది. వెంటనే ఐటీడీఏ స్పందిస్తోంది.
ఆచార వ్యవహారాల్లో మార్పులు
గిరిజనులు ఒకప్పుడు వారి ఆచార వ్యవహారాలకు అత్యంత విలువ ఇచ్చేవారు. ఇప్పుడూ వాటికి విలువిస్తూనే ఆధునిక సమాజం వైపు కూడా అడుగులు వేస్తున్నారు. అలాగే, శ్రీశైలం ఐటీడీఏ తీసుకున్న చర్యలతో ఆదిమ గిరిజనులైన చెంచుల వస్త్రధారణలో మార్పులు వచ్చాయి. 25 ఏళ్ల క్రితం పురుషులు కేవలం గోచీ.. మహిళలు తువ్వాళ్లు మాత్రమే చుట్టుకునే వారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు.
ఐఏఎస్ అధికారుల ఆలోచనలతో ముందుకు..
రాష్ట్రంలోని అన్ని శాఖల్లో కంటే గిరిజన సంక్షేమ శాఖలోనే ఐఏఎస్‌లు ఎక్కువమంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం సీతంపేట, రంపచోడవరం, పాడేరు ఐటీడీఏల్లో వీరున్నారు. అంతేకాక.. ఈ శాఖలో డైరెక్టర్, ముఖ్య కార్యదర్శుల హోదాల్లో కూడా ఐఏఎస్‌లు ఉన్నారు. మిగిలిన ఐటీడీఏలకూ గతంలో ఐఏఎస్‌లు ఉండే వారు. కానీ, ప్రస్తుతం ఆ స్థానాల్లో గ్రూప్–1 అధికారులున్నారు. ఇలా అత్యధికంగా ఉన్నతాధికారులు ఉన్న సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖే. వీరి ఆలోచనలతో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని గిరిజన సంక్షేమం, అభివృద్ధిని ముందుకు నడిపిస్తోంది.
పోడు వ్యవసాయానికి పెద్దపీట
ఏజెన్సీలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన రైతులకు ప్రభుత్వం ఇటీవల భూమి హక్కు పత్రాలు ఇచ్చింది. వీటి ద్వారా అటవీ భూములపై గిరిజనులకు హక్కులు ఏర్పడతాయి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2.50 లక్షల మంది గిరిజనులకు భూమి హక్కుపత్రాలు ఇప్పించారు. ఆ తరువాత ఇప్పుడే ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ 3.20 లక్షల మంది గిరిజన రైతులకు భూమి హక్కు పత్రాలు ఇప్పించి వారి మనసుల్లో నిలిచారు. మరో లక్ష మందికి ఇప్పించేందుకు సర్వే జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment