Agency Regions
-
అధికారులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలి: మంత్రి అవంతి
విశాఖ: పాడేరు ఐటీడీఏ పరిధిలో అభివృద్ధి పనులపై మంత్రి అవంతి శ్రీనివాస్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సచివాలయాలు, ఆర్బీకేల నిర్మాణాలకు త్వరలో బిల్లులు మంజురు చేస్తామని మంత్రి అవంతి పేర్కొన్నారు. ఏజెన్సీలో ప్రతి గ్రామానికి రోడ్డు,విద్యుత్,తాగునీటి సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. అధికారులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అదే విధంగా.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ రావు తెలిపారు. -
మామిడి తాండ్ర రుచి ... తినరా మైమరచి
తాండ్ర... ఈ పేరు వింటేనే నోరూరుతుంది. గిరిజన మహిళలు సంప్రదాయబద్ధంగా తయారు చేస్తుండడంతో మరింత గిరాకీ పెరుగుతోంది. కిలో రూ.80 వరకూ ధర పలుకుతున్నా కొనుగోలుదారులు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మామిడి సీజన్ అయిపోయినా వీటిని భద్ర పరుచుకొని తినే అవకాశం ఉండడంతో డిమాండ్ పెరుగుతోంది. కొనుగోలుదారుల ఆసక్తిని గమనించి మరింత ఉత్పత్తి చేయడానికి ఈ ప్రాంత వాసులు కృషి చేస్తున్నారు. కురుపాం(విజయనగరం జిల్లా): గిరిజన మహిళలు సంప్రదాయంగా తయారుచేస్తున్న కొండమామిడి తాండ్రకు మంచి గిరాకీ ఏర్పడింది. కురుపాం నియోజకవర్గ పరిధిలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో గిరిశిఖర గ్రామాల్లో గిరిజన మహిళలు కొండమామిడి పండ్లను సేకరించి తాండ్ర తయారీకి ఉపక్రమిస్తున్నారు. ఏజెన్సీలో సహజసిద్ధంగా మామిడి చెట్లకు కాసే కొండమామిడి పండ్లను సేకరించి మామిడి తాండ్రను తయారు చేసి కిలో రూ.60 నుంచి రూ.80 వరకూ విక్రయిస్తున్నారు. తాండ్ర తయారీ ఏజెన్సీలో గిరిశిఖరాలపై మామిడి చెట్లకు కాసే కొండమామిడి పండ్లను ఇంటిల్లపాది ఉదయం, సాయంత్రం సమయాల్లో వెళ్లి పండ్లను సేకరించి వాటిని శుభ్ర పరిచి పెద్ద డబ్బాల్లో వేసి రోకలితో దంచుతారు. దంచగా వచ్చిన మామిడి రసాన్ని మేదర జంగెడలో పలుచగా వెదజల్లేలా ఆరబెడతారు. వీటిలో ఎటువంటి రసాయనాలు కలుపకుండానే పొరలు పొరలుగా వేసి వారం, పది రోజులు ఆరబెట్టి ఉండలా చుట్టి తాండ్రను తయారు చేస్తారు. తియ్యరగు మామిడి పండ్లను ఒక డబ్బాలో వేసి రోకలితో దంచగా వచ్చిన రసాన్ని తాండ్రగా తయారు చేస్తారు. మిగిలిన మామిడి తొక్కలను, టెంకలను వేరు చేసి ఎండబెడతారు. తొక్కలను తియ్యరగుగా పిలుస్తారు. వీటిని బెల్లంతో ఊరగాయగా చేసుకొని అన్నంతో కూరగా ఆరగిస్తారు. టెంకపిండి అంబలిగా... మామిడి పండ్ల నుంచి తొక్కను, రసాన్ని వేరుచేసిన తరువాత చివరిగా ఉండే మామడి టెంకలను కూడా ఎండబెట్టి పిండిగా చేస్తారు. దీన్ని ఉడగబెట్టి అంబలిగా చేసుకొని గిరిజనం ఆరగించటం ఆనవాయితీ. మార్కెట్లో మంచి గిరాకి.. ఏజెన్సీలో గిరిజనం తయారు చేసే తాండ్ర, తియ్యరకు మంచి గిరాకీ ఉంది. స్థానిక వ్యాపారులు తాండ్రను కేజీ రూ.80 వరకు కొనుగోలు చేస్తున్నారు. తియ్యరగు కేజీ రూ.50 ధర పలుకుతోంది. ఎటువంటి రసాయనాలు కలుపకుండా తయారు చేయటంతో వ్యాపారులు ఈ ప్రాంత తాండ్రపై మక్కువ చూపిస్తున్నారు. మామిడితో ఎంతో మేలు ప్రతీ ఏడాది మామిడితో గిరిజన కుటుంబాలకు అన్ని విధాలా మేలే. ఎందుకంటే మేము ఏడాదిపాటు వ్యవసాయ పనుల్లో ఉన్నప్పుడు తాండ్రను అన్నంతో, తియ్యరగు ఊరగాయగా వినియోగిస్తుంటాం, మామిడి టెంకను కూడా టెంక పిండి అంబలిగా చేసుకొని వృద్ధులు తాగుతారు. మరికొన్ని సందర్భాల్లో వ్యాపారులకు కూడా విక్రయిస్తుంటాం. మామిడితో మాకు అన్ని విధాలా మేలే. – బిడ్డిక తులసమ్మ, వలసబల్లేరు గిరిజన గ్రామం, కురుపాం మండలం -
ఐటీడీఏలతో గిరిజనాభివృద్ధి
సాక్షి, అమరావతి: గిరిజన సంక్షేమం, అభివృద్ధిలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీలు (ఐటీడీఏ) కీలకపాత్ర పోషిస్తున్నాయి. గిరిజనులను ఆధునిక సమాజం వైపు మళ్లించే కార్యక్రమంలో భాగంగా అటవీ ప్రాంతాల్లో ఇవి ఏర్పాటయ్యాయి. విద్య, వైద్యం వంటి రంగాల్లో వీరికి మరిన్ని సదుపాయాలు కల్పించాలనే ధ్యేయంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అంతేకాక.. గిరిజనుల్లో పోషకాహార లోపాన్ని సరిదిద్దేందుకు, వారికి జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఐటీడీఏల ద్వారా చర్యలు తీసుకుంటోంది. షెడ్యూల్డ్ ఏరియాగా అటవీ గ్రామాలు 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 27.39 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. వీరు అధికంగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ఏరియాలో ఉన్న అటవీ గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో 36 మండలాలు, 4,765 గ్రామాలున్నాయి. వీటికి ప్రత్యేక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. షెడ్యూల్డ్ గ్రామాల్లో గిరిజనులు గ్రామసభల ద్వారా తీసుకునే నిర్ణయాలను ప్రభుత్వం అమలుచేయాల్సి ఉంటుంది. పీవీటీజీల కోసం ప్రత్యేక కార్యాచరణ రాష్ట్రంలోని పాడేరు, పార్వతీపురం, రంపచోడవరం, సీతంపేట, శ్రీశైలం ఐటీడీఏల్లో ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూపులు (పీవీటీజీ) ఉన్నాయి. వీటిల్లో ప్రధానంగా కోండు, గదబ, పూర్జ, చెంచు వంటి ఆదిమ గిరిజనులు ఉన్నారు. ఆధునిక సమాజం గురించి ఇప్పటికీ వీరికి పూర్తిస్థాయిలో అవగాహనలేదు. అందువల్ల వీరి కోసం ప్రత్యేక కార్యాచరణ ద్వారా కార్యక్రమాలు చేపడతారు. శ్రీశైలం ఐటీడీఏ పూర్తిగా చెంచు గిరిజనుల కోసం ఏర్పాటుచేసింది. నల్లమల అడవుల్లో వీరు నివసిస్తున్నారు. అలాగే, నెల్లూరులో కేవలం యానాదుల కోసం ఐటీడీఏ ఏర్పాటైంది. ఇక మిగిలిన రంపచోడవరం, సీతంపేట, పార్వతీపురం, కోట రామచంద్రాపురం, చింతూరు, పాడేరు ఐటీడీఏల్లో అన్ని కులాలకు చెందిన గిరిజనులు ఉన్నారు. ఒక్క పాడేరులోనే 6,04,047 మంది గిరిజనులు ఉన్నారు. సాధారణ జనంతో పోలిస్తే ఇక్కడ గిరిజనులు 91 శాతంమంది ఉన్నారు. అరకు ప్రాంత అడవులపై వీరు ఆధారపడి జీవిస్తున్నారు. ఇలా మొత్తం 34 రకాల కులాలకు చెందిన గిరిజనులు రాష్ట్రంలో జీవిస్తున్నారు. ఏజెన్సీ పల్లెల ముంగిట్లోకి ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలతోపాటు విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అయితే, గిరిజన విశ్వవిద్యాలయం, గిరిజన ఇంజనీరింగ్–మెడికల్ కాలేజీలు, ఏడు ఐటీడీఏల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటుచేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్ గిరిజన సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. అంతేకాక.. ప్రతి పంచాయతీలో గ్రామ సచివాలయాలు ఏర్పాటుకావడంతో పూర్తిస్థాయిలో ప్రభుత్వం వారి ముంగిటకు చేరింది. ఏ సమస్య ఉన్నా ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశం గిరిజనులకు కలిగింది. వెంటనే ఐటీడీఏ స్పందిస్తోంది. ఆచార వ్యవహారాల్లో మార్పులు గిరిజనులు ఒకప్పుడు వారి ఆచార వ్యవహారాలకు అత్యంత విలువ ఇచ్చేవారు. ఇప్పుడూ వాటికి విలువిస్తూనే ఆధునిక సమాజం వైపు కూడా అడుగులు వేస్తున్నారు. అలాగే, శ్రీశైలం ఐటీడీఏ తీసుకున్న చర్యలతో ఆదిమ గిరిజనులైన చెంచుల వస్త్రధారణలో మార్పులు వచ్చాయి. 25 ఏళ్ల క్రితం పురుషులు కేవలం గోచీ.. మహిళలు తువ్వాళ్లు మాత్రమే చుట్టుకునే వారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ఐఏఎస్ అధికారుల ఆలోచనలతో ముందుకు.. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో కంటే గిరిజన సంక్షేమ శాఖలోనే ఐఏఎస్‌లు ఎక్కువమంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం సీతంపేట, రంపచోడవరం, పాడేరు ఐటీడీఏల్లో వీరున్నారు. అంతేకాక.. ఈ శాఖలో డైరెక్టర్, ముఖ్య కార్యదర్శుల హోదాల్లో కూడా ఐఏఎస్‌లు ఉన్నారు. మిగిలిన ఐటీడీఏలకూ గతంలో ఐఏఎస్‌లు ఉండే వారు. కానీ, ప్రస్తుతం ఆ స్థానాల్లో గ్రూప్–1 అధికారులున్నారు. ఇలా అత్యధికంగా ఉన్నతాధికారులు ఉన్న సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖే. వీరి ఆలోచనలతో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని గిరిజన సంక్షేమం, అభివృద్ధిని ముందుకు నడిపిస్తోంది. పోడు వ్యవసాయానికి పెద్దపీట ఏజెన్సీలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన రైతులకు ప్రభుత్వం ఇటీవల భూమి హక్కు పత్రాలు ఇచ్చింది. వీటి ద్వారా అటవీ భూములపై గిరిజనులకు హక్కులు ఏర్పడతాయి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2.50 లక్షల మంది గిరిజనులకు భూమి హక్కుపత్రాలు ఇప్పించారు. ఆ తరువాత ఇప్పుడే ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ 3.20 లక్షల మంది గిరిజన రైతులకు భూమి హక్కు పత్రాలు ఇప్పించి వారి మనసుల్లో నిలిచారు. మరో లక్ష మందికి ఇప్పించేందుకు సర్వే జరుగుతోంది. -
ఏజెన్సీల్లో సమాచార 'విప్లవం'
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో సమాచార విప్లవం వచ్చింది. వీటివల్ల ఏ గిరిజన గూడెంలో ఏం జరిగినా వెంటనే తెలుసుకునే అవకాశం ఏర్పడింది. గిరిజన పంచాయతీల్లోని సచివాలయాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంవల్లే అక్కడి స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు రాష్ట్ర ప్రభుత్వానికి కలిగింది. అలాగే, అడవుల్లో సరైన రహదారులు లేని గ్రామాలకు ఐశాట్ ఫోన్లు ఇచ్చింది. వీటి ద్వారా కూడా అత్యవసర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం తెలుసుకుంటోంది. గ్రామ సచివాలయాలకు ఫైబర్‌నెట్ సేవలు గిరిజన పంచాయతీల్లోని ప్రతి గ్రామ సచివాలయానికి ఫైబర్‌నెట్ సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఇటీవల రూ.3కోట్లను ఫైబర్‌నెట్ సంస్థకు గిరిజన సంక్షేమ శాఖ అందజేసింది. వీటికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు.. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతమున్న పలు సెల్టవర్ల పరిధిలో అప్పుడప్పుడు సిగ్నల్స్ సరిగ్గా ఉండని కారణంగా సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో.. త్వరలో ఫైబర్‌నెట్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుండడంతో ఆ సమస్యలకు చెక్ పడనుంది. గిరిజన గూడేల్లోని వారు తమ ఇళ్లకు కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందవచ్చు. అంతేకాక.. వివిధ టీవీ చానెల్స్ కూడా ఈ ఫైబర్‌నెట్ ద్వారా వీక్షించవచ్చు. అత్యవసర సమాచారానికి ఐశాట్ ఫోన్లు ఇక గిరిజన గూడేల్లో ఏవైనా సంఘటనలు జరిగినా, సరైన వసతులు లేకపోయినా, వైద్య సాయం కావాల్సి వచ్చినా వెంటనే తెలిపేందుకు ప్రభుత్వం ఆయా ఐటీడీఏలకు ఐశాట్ ఫోన్లను అందజేసింది. ఈ ఫోన్లు ఐటీడీఏ పీవోల పర్యవేక్షణలో ఉంచింది. ఇవి వాకీటాకీల్లా పనిచేస్తాయి. సీతంపేట, పాడేరు, పార్వతీపురం, ఆర్సీ వరం, కేఆర్ పురం, చింతూరు, శ్రీశైలం ఐటీడీఏల్లో మొత్తం 203 ఐశాట్ ఫోన్లు ఉన్నాయి. వలంటీర్లకు కూడా వీటిని ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మరోవైపు.. ఏజెన్సీలోని వైద్య వలంటీర్లకు ఫోన్లు ఇవ్వడం ద్వారా కూడా గిరిజనుల ఆరోగ్య సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలు కలిగింది. సమాచారం తెలుసుకోవడంలో ముందున్నాం గతంలో గిరిజన గూడేల్లో సమాచారం తెలుసుకునేందుకు సమయం పట్టేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రభుత్వ సహకారంతో పలు కంపెనీలు ఇప్పటికే సెల్‌టవర్లను ఏర్పాటుచేశాయి. అలాగే, ప్రస్తుతం గ్రామ సచివాలయాలకు ఫైబర్‌నెట్ కనెక్షన్ల పనులు చురుగ్గా జరుగుతున్నాయి. కొన్నిచోట్ల పూర్తయ్యాయి. ఐశాట్ ఫోన్ల ద్వారా కూడా సమాచారం ఎప్పటికప్పుడు తెలుస్తోంది. – ఇ.రవీంద్రబాబు, అడిషనల్ డైరెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ -
సరిహద్దు ప్రాంతాల్లో విస్తృతంగా కూంబింగ్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర- ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. పెదబయలు అటవీ ప్రాంతంలో రెండు రోజుల క్రితం ఎన్కౌంటర్ జరిగిన పరిసరాల్లో రక్తపు మరకలు గుర్తించడంతో కూంబింగ్ ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కృష్ణారావు పేర్కొన్నారు. ఎన్కౌంటర్ జరిగిన పరిసర ప్రాంతాల్లో సీనియర్ మావోయిస్టు నేతల సమావేశం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పెదబయలు, రూడకోట, ముంచంగిపుట్లు పరిసర ప్రాంతాలను పోలీసుల బలగాలు జల్లెడ పడుతున్నాయి. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో తప్పించుకున్న వారిలో సీనియర్ మావోయిస్టు నాయకులున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు అదుపులో అమాయక గిరిజనులు ఉన్నారంటూ ఆంధ్రప్రదేశ్ హక్కుల సంఘం పత్రికా ప్రకటన ఇచ్చింది. అయితే మా అదుపులో అమాయకపు గిరిజనులు ఎవరూ లేరని జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. (అడవిలో అలజడి) -
విశాఖ ఏజెన్సీలో కాల్పులు కలకలం
సాక్షి, విశాఖపట్నం : ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో తుపాకులు మోతలు మోగుతున్నాయి. తాజాగా విశాఖ ఏజెన్సీలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. జిల్లాలోని పెదబయలు మండలం లండులు అటవీ ప్రాతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. గత కొంత కాలంగా మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం అందుకున్న బలగాలు.. ఆదివారం సాయంత్రం రెక్కీ నిర్వహించాయి. ఆ సమయంలోనే లండులు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారస పడటంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య కొంత సమయం పాటు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. (మావోయిస్టు భాస్కర్ దశాబ్దాల అజ్ఞాతం) ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వర్గాలు ప్రకటించాయి. అయితే సంఘటనా స్థలంలో మావోయిస్టులకు చెందిన సామాగ్రీ లభించినట్లు సమాచారం. కాగా గతకొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలను మావోయిస్టు పార్టీ వేగవంతం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలోని ఆదిలాబాద్, అసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో మావోయిస్టుల కార్యకలపాలపై పోలీసులు బలగాలు నిఘా పెట్టాయి. -
మంత్రి ఈటల జిల్లా పర్యటన
సాక్షి, కొత్తగూడెం : మెరుగైన వైద్య సేవలు అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా మంగళవారం కొత్తగూడెం వచ్చిన మంత్రి.. జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం వైద్య శాఖ అధికారులతో డీఆర్డీఏ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు వచ్చాక వైద్య సేవలు అందించడం కంటే అవి ప్రబలకుండా ముందస్తు నియంత్రణ చర్యలు తీసుకునే విషయంలో వైద్య ఆరోగ్య సిబ్బంది పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. మంచి చేస్తే గుండెల్లో పెట్టుకుని చూసే జిల్లా భద్రాద్రి జిల్లా అని అన్నారు. ఇలాంటి ఏజెన్సీ జిల్లాలో వైద్యసేవలు అందించే అవకాశం రావడం వరంగా భావించాలన్నారు. కష్టపడి వైద్యసేవలు అందజేస్తే వచ్చే తృప్తి మాటల్లో చెప్పలేనిదని అన్నారు. నెగెటివ్ ప్రచారాన్ని చూసి కుంగిపోవద్దని చెప్పారు. జిల్లాలో 137 డెంగీ కేసులు గుర్తించినప్పటికీ ఇప్పటివరకు ఈ సీజన్లో ఒక్క డెంగీ మరణం కూడా లేకుండా చేశారని వైద్య సిబ్బందిని అభినందించారు. ఆశ కార్యకర్తలు, అంగన్వాడి టీచర్లతో కమిటీలు వేసి వ్యాధుల నియంత్రణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మంత్రి ప్రసంగం ప్రారంభిస్తూ అందరూ పనిచేసే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారా అని అడగగా సమావేశ మందిరంలో నిశ్శబ్ధం కనిపించింది. అనంతరం కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి జ్వరం కేసుకు సంబంధించి రక్తపరీక్షలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 2 లక్షల మందికి రక్త పరీక్షలు చేశామని, 379 మలేరియా, 137 డెంగీ కేసులు గుర్తించామని తెలిపారు. జిల్లాలో సీఎస్ఆర్, ఎల్‌డబ్ల్యూఈ నిధుల ద్వారా సైతం వైద్యసేవలు అందజేస్తున్నామని చెప్పారు. సమావేశంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఐటీడీఏ పీఓ పీవీ.గౌతమ్, భద్రాచలం సబ్‌కలెక్టర్ భవేశ్‌మిశ్రా, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్, జెడ్పీ వైస్‌చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ జగత్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుపై దృష్టి పెట్టాలి చండ్రుగొండ జెడ్పీటీసీ సభ్యుడు కొడకండ్ల వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సింగరేణి కేంద్ర కార్యాలయం ఉన్న కొత్తగూడెంలో మెడికల్ కళాశాల ఏర్పాటు విషయమై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. సింగరేణికి ఇక్కడ అనేక భవనాలు, మౌలిక సదుపాయాలు ఉన్నాయని, మైనింగ్ కళాశాల ద్వారా నాణ్యమైన మైనింగ్ ఇంజినీర్లు వస్తున్నారని అన్నారు. సింగరేణి మెడికల్ కళాశాల నెలకొల్పి మంచి వైద్యులను అందజేయడంతో పాటు, ఏజెన్సీ ప్రజలకు మరిన్ని వైద్యసేవలు అందించాలని కోరారు. మణుగూరులో వైద్యులను నియమించాలి మణుగూరు జెడ్పీటీసీ సభ్యుడు పోశం నర్సింహారావు మాట్లాడుతూ మణుగూరులో ఏరియా ఆసుపత్రి నిర్మించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ అందులో వైద్యులను నియమించలేదన్నారు. పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం, పినపాక, మణుగూరు మండలాల నుంచి పోస్టుమార్టం కోసం భద్రాచలం, బూర్గంపాడు వెళ్లాల్సి వస్తోందని, దీంతో మృతుల కుటుంబాలకు అధిక వ్యయభారం అవుతోందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మణుగూరు ఆసుపత్రిలో పోస్టుమార్టం సౌకర్యం కల్పించాలన్నారు. ఆళ్లపల్లి, జానంపేట పీహెచ్‌సీలకు వైద్యలను నియమించాలని కోరారు. -
ఏజెన్సీల్లో అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో అప్రమ త్తంగా ఉండాలని అధికారులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆదేశించారు. శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఆ శాఖ కార్యదర్శి మహేశ్ దత్ ఎక్కా, కమిషనర్ క్రిస్టినా జెడ్ చోంగ్తూ తదితరులతో ఆయన సమావేశమయ్యారు. వరుసగా వర్షాలతో విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్య శాఖ అధికారుల సమన్వయంతో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. ఐటీడీఏ పరిధిలోని వైద్యారోగ్య కేంద్రాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని, అపరిశుభ్ర వాతావరణం లేకుండా పంచాయతీలను అప్రమత్తం చేయాలన్నారు. ఆశ్రమ పాఠశాలలు, స్కూళ్లలో వైద్య శిబిరాలు నిర్వహించి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఐటీడీఏ పరిధిలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. -
అరణ్య రోదన
అడుగడుగునా అడవి బిడ్డలకు కష్టాల పలకరింపు గుక్కెడు నీటి కోసం బారెడు దూరం.. పనులు లేక పట్నం బాట పాలకులు మారినా అవే దుర్భర బతుకులు స్వాతంత్య్రం వచ్చి 65 ఏళ్లు గడిచినా ఆదివాసీల జీవనంలో మార్పు లేదు.. వారి బతుకులు మారలేదు.. అదే అరణ్య రోదన.. నరకానికి నకళ్లు చూపించే రహదారులు.. దాహం తీర్చుకోవడానికి మైళ్ల దూరం నడక.. రోగమొచ్చినా.. నొప్పొచ్చినా.. కడుపునొచ్చినా నాటు వైద్యమే దిక్కు.. ప్రభుత్వ వైద్యులు ఉన్నా లేనికిందకే లెక్క.. స్థానికంగా ఉండకపోవడం.. ఉన్నా సరైన వైద్యం అందించకపోవడంతో ఏటా వందల సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నారుు.. చదువుకుంటే విజ్ఞానం పెరిగి అభివృద్ధి చెందుతారనుకుంటే అజ్ఞానంలోనే కాలం వెళ్లదీస్తున్నారు.. అనేక పల్లెలు, తండాలు, గూడేలు విద్యుత్ వెలుగులకు నోచుకోక అంధకారంలోనే మగ్గుతున్నాయి.. ఉపాధి లేక ఉన్న ఊరిని.. కన్నవారిని వదిలి పొట్టచేత పట్టుకుని వలస వెళ్తున్నారు.. ఇంత దుర్భరమైన జీవనం గడుపుతున్నా గిరిజనులపై సర్కారుకు కనీస ప్రేమ లేదు.. అడవి బిడ్డలను పట్టించుకోవాలి.. వారి కలలను సాకారం చేయూలి.. జిల్లాలోని 13 మండలాల్లో విస్తరించి ఉన్న 177 గ్రామాల్లోని 2 లక్షల మంది అడవి బిడ్డల దీనస్థితిపై ‘సాక్షి’ ఫోకస్.. - ములుగు/ఏటూరునాగారం/కొత్తగూడ/మంగపేట సదువు సాగదు.. ఏజెన్సీ పిల్లలు బడికి వెళ్లాలంటే నిత్యం ప్రయాసే. గూడేనికి మైళ్ల దూరంలో పాఠశాల ఉండడంతో విద్యార్థులు ఒంటరిగా వెళ్లలేని పరిస్థితి. వీరిని పాఠశాలకు పంపించడానికి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తీసుకెళ్లాలి. మళ్లీ బడి ముగిశాక తీసుకురావడానికి అదే పరిస్థితి. ప్రస్తుతం 20 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలను అధికారులు రేషనలైజేషన్ పేరుతో మూసివేశారు. దీంతో ఏజెన్సీ గ్రామాల్లోని విద్యార్థులు పక్కనే ఉన్న గ్రామాలకు కాలినడకన వెళ్తున్నారు. ఆర్థిక స్తోమత లేని వారు ఇలా ఫొటోలో కనిపిస్తున్నట్లు సైకిల్ మీద వారి పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తున్నారు. ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి బతికే ఆదివాసీలు ఎన్ని పనులు ఉన్నా సాయంత్రం పాఠశాల వదిలే సమయానికి తిరిగి వారి పిల్లలను తీసుకురావడానికి తంటాలు పడుతున్నారు. తమ గ్రామంలో పాఠశాల ఉంటే కష్టాలు తీరుతాయని ములుగు మండలంలోని లాలాయిగూడెం, దుబ్బగూడెం, పత్తిపల్లి, కొడిశలకుంట, జగ్గన్నపేట, ఏటూరునాగారం మండలం ముల్లకట్ట, మంగపేట మండలం నడిమిగూడెం, కొత్తగూడ మండలం పుల్సంవారిగుంపు, పెద్దెల్లాపూర్తోపాటు వెంకటాపురం, గోవిందరావుపేట మండలాల్లో రేషనలైజేషన్ పేరుతో పదుల సంఖ్యలో ఉన్న ఐటీడీఏ పాఠశాలలను అధికారులు మూసివేశారు. వాటిని పునఃప్రారంభించి ఇబ్బందులు తొలగించాలని వారు కోరుతున్నారు. రవాణా బహుదూరం ఏజెన్సీలోని గిరిజన గూడేలకు రవాణా దూరం.. భారంగా మారింది. సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో నేటికీ ఎడ్ల బండ్లు, సైకిళ్ల మీద ప్రయాణం చేయడం పరిపాటిగా మారింది. వాగులు, ఒర్రెలు నిత్యం ప్రజల రవాణాను అడ్డుకుంటూ గిరిజనులకు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. రోగమొస్తే డొల్లాలు, మంచాలను కట్టుకొని పది మైళ్ల దూరంలో ఉన్న ప్రధాన రహదారికి చేరుకోవాల్సిన దుస్థితి. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో కూడా ఇటువంటి సంఘటనలు ఎన్నెన్నో. వాగులపై కల్వర్టులు, బ్రిడ్జిలు లేకపోవడంతో రాంపూర్, ఐలాపురం, సర్వాయి, చిట్యాల, భూపతిపూర్, లింగాల, రాయబంధం, ఎలిశెట్టిపల్లి గ్రామాలకు రవాణా మార్గం లేక ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఉపాధి లేక వలసలు గిరిజన గూడేల్లో ఉపాధి పనులు లేకపోవడంతో గిరిజనులు వలసపోతున్నారు. ఉపాధిహామీ పథకం మారుమూల అటవీ గ్రామాల్లో చేపట్టకపోవడంతో కూలీ పనుల కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వరి, మిరప పంటల్లో పనిలేదు. దీంతో ట్రాక్టర్లు, కాలినడకన ఇతర గ్రామాలకు చేరుకొని అక్కడ పొద్దంతా కూలీ పనులు చేసి ఇంటికి తిరిగి రావాల్సి వస్తోంది. ఇంకా గొత్తికోయగూడేల్లో సైతం గిరిజనులు ఏటూరునాగార ం నుంచి ఇతర గ్రామాలకు పనులకు వెళ్తున్నారు. వ్యవసాయ పనులు దూరమవుతుంటే.. భవన నిర్మాణ కూలీ పనులపై గిరిజనులు ఆధారపడాల్సిన దయనీయమైన పరిస్థితి నెలకొంది. దరి చేరని వైద్యం ఏజెన్సీలో వైద్యం అందక ఆదివాసీలు విలవిలలాడుతున్నారు. మంగపేట మండలంలోని మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులకు ప్రభుత్వ వైద్య సేవలు అందని ద్రాక్షలా మారాయి. కడుపునొప్పి, జ్వరం వచ్చినా గ్రామాల్లో వైద్య సేవలు అందకపోవడంతో సమీపంలోని మంగపేట, రాజుపేటలోని ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో పొరుగునే ఉన్న ఖమ్మం జిల్లా మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం వంటి పట్టణాల్లోని ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. వైద్యం కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక స్తోమత లేని గిరిజనులు ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు నాటు వైద్యాన్ని నమ్ముకుని ప్రాణాలు వదులుతున్నారు. మంగపేట, చుంచుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ ఆయా కేంద్రాల పరిధిలోని ప్రజలకు వైద్య సేవలు అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ రెండు పీహెచ్‌సీల వైద్యాధికారులు ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు తప్ప మరెవరికీ తెలవకపోవడం గమనార్హం. వాతావరణ పరిస్థితులను బట్టి గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉంటూ గ్రామాల్లో పరిస్థితులను పర్యవేక్షించాల్సిన కొందరు ఏఎన్ఎంలు మండల కేంద్రాల్లో ఉంటూ వారంలో ఒకరోజు సబ్సెంటర్కు వచ్చి వెళ్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్యులు లేకపోవడంతో ఫార్మసిస్టు, స్టాఫ్‌నర్స్ ఇచ్చే మాత్రలు తీసుకొని వెళ్తున్నారు. డీడీలు కట్టినా... జిల్లాలోని 177 ఏజెన్సీ గ్రామాల అభివృద్ధి కోసం ఐటీడీఏ పథకాలను ప్రవేశపెడుతూ అభివృద్ధి చేయాల్సి ఉంది. అయితే ఆ దిశగా సంస్థ ఎలాంటి పనులు చేపట్టలేదని తెలుస్తోంది. మారుమూల గిరిజన గ్రామాల్లో త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం లేక గిరిజన రైతులు వ్యవసాయానికి నీటిని పెట్టుకోలేని పరిస్థితి. కొత్తగూడ మండలం గంగారం పంచాయతీ పరిధిలోని కొడిశలమిట్ట గ్రామంలోని సుమారు 24 మంది రైతులు వ్యవసాయ విద్యుత్ కోసం 2011లో రూ.6,150 చొప్పున డీడీలు తీశారు. అలాగే సొంత డబ్బులు వెచ్చించి బోర్లు ఏర్పాటు చేసుకున్నారు. డీడీలు కట్టి మూడేళ్లు గడిచినా త్రీఫేజ్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయకపోవడంతో రైతులు కష్టాలు పడుతున్నారు. ఐటీడీఏ గ్రీవెన్స్‌కు ఇప్పటికీ పదిహేడుమార్లు దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు. ట్రాన్స్‌కో అధికారులకు ఐటీడీఏ నుంచి నిధులు మంజూరు అయితేగాని గిరిజన రైతుల కష్టాలు తీరవు. నీటి కష్టాలు ఫొటోలో కనిపిస్తున్న వీరు ములుగు మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పగిడపల్లి ఆదివాసీ గిరిజన మహిళలు. వీరు వర్షాకాలం, చలికాలం తాగునీటికి ఇబ్బందిపడుతున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న మంచినీటి బావి వద్దకు బిందె నెత్తిన పెట్టుకుని పరుగులు తీస్తారు. అక్కడ రద్దీ ఎక్కువగా ఉండడంతో క్యూలో నిలబడి నీటిని తోడుకుంటారు. తర్వాత బిందె నెత్తిన పెట్టుకొని ఇంటి దారి పడతారు. దశాబ్దాలుగా ఇదే పరిస్థితి. వీరే కాకుండా చుట్టుపక్కల ఉన్న కన్నాయిగూడెం, సర్వాపురం, పంచోత్కులపల్లి, కొత్తూరు, దుబ్బగూడెం, లాలాయిగూడెం , ఏటూరునాగారం మండలం ఐలాపురం, అల్లంవారి ఘనపురం, చెల్పాక, రాంపూర్, మంగపేట మండలం శెనగకుంట, పూరేడుపల్లి, దోమెడ, తక్కళ్లపల్లి, తాడ్వాయి మండలం మేడారం, కాల్వపల్లి, నార్లాపూర్, ఆశన్నగూడెం, కొత్తగూడ మండలం పూనుగొండ్ల, దుబ్బగూడెం, జంగవానిగూడెం, చిట్యాల తండా, వెంకన్నగుంపు, తిర్మలగండి ఏజెన్సీ గ్రామాల్లోనూ నీటి కోసం కష్టాలు పడుతున్నారు. ఇక వేసవిలో గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతారు. ఇక్కడి ప్రజలు వర్షాకాలం ఎప్పుడొస్తుందా అని.. కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తారు. భూగర్భ జలవనరులు ఈ ప్రాంతంలో తక్కువగా ఉండడంతో వేలాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ బోర్లు వృథా అవుతున్నాయి. నీటి సమస్యను పరిష్కరించాలని ఎన్నిమార్లు వినతులు సమర్పించినా పట్టించుకునేవారు కరువయ్యారు. ఏజెన్సీ ప్రజల బతుకులు మార్చాలని వారితో స్వయంగా చర్చా కార్యక్రమానికి వెళ్లిన కలెక్టర్ వారి నీటి కష్టాన్ని తీర్చలేకపోయారు. నీటి ఇబ్బందులు తొలగిస్తానని హామీ ఇచ్చి ఐదు నెలలు గడిచినా అతీగతి లేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ గ్రామాల పక్కనే లక్నవరం చెరువు ఉంది. అందులో బోర్లు వేయించి చుట్టుపక్కల గ్రామాలకు నీటిని అందిస్తే కష్టాలు తీరుతాయని గిరిజనులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నోటీసులతో ఆందోళన ఆదివాసీలు కడుపు నింపుకునేందుకు పోడు చేసుకుని పంటలు పండిస్తున్నారు. అయితే ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు కొత్తగూడ మండలంలోని పలు గ్రామాల్లో అటవీ శాఖ అధికారులు గిరిజనులకు నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో విప్లవ పార్టీల అండతో పోడు చేసుకుని ఇక్కడి ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. విప్లవ పార్టీల బలం ఎక్కువగా ఉన్నప్పుడు నోరు మెదపని అధికారులు.. కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకుంటామంటూ ఎదుళ్లపల్లి, బత్తులపల్లి, కొత్తగూడ, కోమట్లగూడెం గ్రామ పంచాయతీల పరిధిలోని గిరిజనులకు నోటీసులు జారీ చేశారు. మండల కేంద్రంలో ఇరవై ఎకరాల పోడు భూమిని స్వాధీనం చేసుకుని నర్సరీ పెంచేందుకు సిద్ధం చేశారు. ఇది చర్చనీయాంశంగా మారింది. గిరిజనుల పోడు భూములను స్వాధీనం చేసుకుంటే సహించేది లేదంటూ ఆదివాసీ సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసి హెచ్చరిస్తున్నాయి. అటవీ శాఖ అధికారులు దాడులు ఆపకుంటే తమ బతుకులు ఛిద్రం అవుతాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. మంత్రి పదవి చేపట్టిన చందూలాల్ పోడు భూములపై దృష్టి సారించి ఆదుకోవాలని ఆదివాసీలు కోరుతున్నారు. కర్ర స్తంభాలే దిక్కు కర్ర స్తంభాలను చూస్తే అభివృద్ధి ఎంతమాత్రం ఉందో ఇట్టే అర్థమవుతుంది. స్వాతంత్య్రం వచ్చి 65 ఏళ్లు గడిచినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామానికి ఆదివాసీలు స్వయంగా తయారు చేసిన కర్ర స్తంభాల ఆధారంగానే విద్యుత్ లైన్ ఏర్పాటు చేసుకొని విద్యుత్ కాంతులు పొందుతున్నారు. ఊరు పుట్టిన నాటి నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఈదురు గాలులు, విద్యుత్ హైఓల్టేజీ వల్ల కర్రలు కాలిపోతే మళ్లీ అదే ప్రాంతంలో స్తంభాలు ఏర్పాటు చేసుకోవడం గిరిజనులకు పరిపాటిగా మారింది. ఏళ్లు గడిచినా ఐటీడీఏ ద్వారా స్తంభాలు ఏర్పాటు చేయకపోవడంతో విద్యుత్ కోసం గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. ఐటీడీఏ అధికారులు ట్రాన్స్‌కోకు కొంత మొత్తం నిధులు చెల్లించి గ్రామానికి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని గ్రామంలోని సుమారు 80 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. కానీ.. ఇంతవరకు కరెంటు స్తంభాల కోసం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. ఇప్పటికీ గిరిజనులు విద్యుత్ సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు.