సాక్షి ప్రతినిధి, విజయనగరం : చారిత్రక నగరంగా భాసిల్లుతున్న విజయనగరాన్ని చెత్త సమస్య పట్టి పీడిస్తోంది. ఇక్కడి మునిసిపల్ అధికారులు డంపింగ్‌యార్డు నిర్వహిస్తున్న తీరుపై విజిలెన్స్, ఎన్‌ఫోర్సుమెంట్ విభాగం సీరియస్‌గా తీసుకుంది. యార్డుకోసం వెచ్చిస్తున్న నిధులు దుర్వినియోగం అయినట్టు నిర్ధారించింది. వీరు అనుసరిస్తున్న తీరువల్ల చుట్టుపక్కల నివాసం ఉంటున్నవారికి ప్రమాదం పొంచి ఉందని అభిప్రాయపడింది. దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు సమాయత్తమవుతోంది.
రోజూ 20టన్నుల చెత్త తరలింపు
నగరంలోని చెత్తను డంప్ చేయడానికి 15 ఏళ్ల క్రితం అప్పటి తెలుగుదేశం పార్టీ హయాంలో డెంకాడ మండలం చొల్లంగిపేట పంచాయతీ కె.ముంగినాపల్లి వద్ద 20 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. అక్కడకు రోజూ సుమారు 15నుంచి 20 టన్నుల చెత్తను తరలిస్తున్నారు. తరలిస్తున్న చెత్త నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్ల సమీప గ్రామాలైన కె.ముంగినాపల్లి(దళితవాడ), ముంగినాపల్లి, గుణుపూరుపేట గ్రామాల్లోని ప్రజల జీవనానికి ఆటంకంగా మారింది. నిర్వహణ అధ్వానంగా ఉండటంతో పీల్చే గాలి నుంచి తాగే నీరు వరకు అన్నీ కలుషితమవుతున్నాయి. రోజురోజుకు సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. ఆ గ్రామాల ప్రజలు ఉన్న ఊరిని విడిచి వెళ్లలేక, అక్కడే ఉండ లేక నరకం చూస్తున్నారు. ఈ ప్రాంతంలో ఈగలు, రకరకాల పురుగులు స్వైరవిహారం చేస్తున్నాయి.
వర్షాకాలం వస్తే నరకమే
వర్షాలు కురిస్తే ఇక్కడి పరిస్థితి మరీ దయనీయంగా ఉంటోంది. యార్డులోని కాలుష్యాలు భూగర్బ జలాలతో కలిసి కలుషితమవుతున్నాయి. వాటిని తాగుతున్న అక్కడి ప్రజలు వ్యాధుల బారినపడుతున్నారు. దురదలు, గజ్జి రూపంలో చర్మవ్యాధులు వ్యాపిస్తున్నాయి. దీనికోసం అక్కడ అప్పుడప్పుడు వైద్యాధికారులు వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నారు తప్ప ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం చూపట్లేదు. ఇప్పటికే ఇక్కడ వివిధ వ్యాధుల బారిన పడి 11మంది మృతి చెందారన్న వాదనలు ఉన్నాయి.
మీడియా కథనాలతో కదిలిన విజిలెన్స్
డంపింగ్‌యార్డు వల్ల ప్రజలు పడుతున్న అవస్థలపై మీడియాలో వచ్చిన కథనాలపై మున్సిపల్ యంత్రాంగం, పాలకులు స్పందించకపోయినా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సీరియస్‌గా స్పందించింది. కొన్ని నెలలుగా డంపింగ్ యార్డ్ నిర్వహణను పరిశీలిస్తూ వస్తోంది. ఈ క్రమంలో అధికారుల వైఫల్యాలను గుర్తించింది. ఇప్పుడా లోపాల చిట్టాలతో ప్రభుత్వానికి నివేదిక సిద్ధం చేస్తోంది.
విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ గుర్తించిన అంశాలివి:
బయో గ్యాస్ ప్లాంట్ ద్వారా వ్యర్థ పదార్థాల నుంచి గ్యాస్, విద్యుత్ ఉత్పత్తి చేయాలి. ఇక్కడదేమీ జరగట్లేదు.
పట్టణంలోని రైతు బజార్లు, పండ్ల దుకాణాల వద్ద మిగిలిపోయిన వ్యర్థాలతో ఎరువులు తయారు చేసేందుకు కొనుగోలు చేసిన పలవరైజేషన్ యంత్రం నిరుపయోగంగా ఉంది. దీనికోసం వెచ్చించిన రూ. పదిలక్షలు వృథా అయింది.
తరలిస్తున్న చెత్తను తడి, పొడిగా వేరుచేయాలి. సేకరణ సమయంలోనే ఈ ప్రక్రియ జరగాలి. మున్సిపల్ యంత్రాంగం ఈ విషయంలో విఫలమైంది. యథాతధంగా చెత్త తరలించేస్తుండటంతో దేనికీ ఉపయోగ పడట్లేదు.
సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో గుట్టలుగుట్టలుగా ఎక్కడబడితే అక్కడే చెత్తను డంపింగ్ చేస్తున్నారు. దీనిని చదును చేయడానికి ప్రతీ మూడు నెలలకు లక్షలాది రూపాయల ఖర్చు చేస్తున్నారు.
వర్మీ కంపోస్టు యార్డ్‌ను రూ.10లక్షలతో నిర్మించారు. గాని పలవరైజేషన్ ద్వారా వ్యర్థాల నుంచి వేరు చేసిన మెటీరియల్‌ను దశల వారీగా ఎరువుల కింద మార్చడం లేదు. వర్మీ కంపోస్టు యార్డ్‌కు చేసిన ఖర్చు అంతా నిరుపయోగంగా మారింది.
డంపింగ్ యార్డ్‌లో పనిచేయడానికి 40నుంచి 50మంది సిబ్బంది కావాలి. అధికారులు ఇక్కడ 10మంది పనిచేస్తున్నట్టు చెబుతున్నా... వారూ కనిపించడం లేదు.
డంపింగ్‌పై విజిలెన్స్
Published Sat, Jun 18 2016 11:47 PM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement