కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించిన ఔట్‌సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు
విజయనగరం మున్సిపాలిటీ : పట్టణ ప్రాంతాల్లో నూతన పారిశుద్ధ్య విధానం అమలును వ్యతిరేకిస్తూ శుక్రవారం మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి స్వల్ప ఉద్రిక్తతల నడుమ ముగిసింది. జీఓ నంబర్ 279ను వ్యతిరేకిస్తూ సీఐటీయూ చేపట్టిన ఈ కార్యక్రమంలో విజయనగరం మున్సిపాలిటీ సహా సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీల ఔట్‌సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. అంతకుముందు విజయనగరం మున్సిపల్ పారిశుధ్ధ్య కార్మికులంతా మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
అనంతరం నాలుగు మున్సిపాలిటీల కార్మికులు కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సుమారు రెండు గంటల పాటు నిరసన చేపట్టిన అనంతరం కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, కార్మికుల మధ్య స్వల్ప తోపులాటు చోటు చేసుకుంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరావు వచ్చి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వటంతో కార్మికులు అక్కడి నుంచి వెనుదిరిగారు.
మా పొట్టలు కొట్టద్దు
ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలను జీఓ నంబర్ 279 పేరిట రోడ్డున పడేయొద్దని సీఐటీయూ నేతలు రెడ్డి శంకరరావు, టీవీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పారిశుద్ధ్య విధానాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా విజయనగరం మున్సిపాలిటీలో జీఓ నంబర్ 279 అమలుకు చర్యలు చేపట్టడం దుర్మార్గపు చర్యగా పేర్కొన్నారు.
ఇలాంటి చర్యలతో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగకపోతే ప్రజారోగ్యానికి పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. తాజా విధానంతో ప్రజల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయనున్నారన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నేతలు జగన్మోహనరావు, యు.శంకరరావు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment