‘మీ సేవ’ కష్టాలు
- జనన, మరణ ధ్రువపత్రాల జారీలో తీవ్ర జాప్యం
- వేధిస్తున్న డిజిటల్ సిగ్నేచర్ సమస్య
- రెండునెలలుగా జనం అవస్థలు
అనకాపల్లి : అనకాపల్లి జోనల్ పరిధిలో జనన, మరణ ధ్రువపత్రాల కోసం మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే జారీ కావడం లేదు. జీవీఎంసీ ద్వారా విడుదలయ్యే ధ్రువపత్రాలకు మీసేవా కేంద్రం హెడ్‌క్వార్టర్ ద్వారా డిజిటల్ సిగ్నేచర్ కీ సౌకర్యం ఉండాలి. మీసేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకుంటే వారికి ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే వ్యవస్థ అనకాపల్లి జోనల్‌లో లేకుండా పోయింది.
హైదరాబాద్‌లోని ఎన్‌ఐసీ మీసేవ కేంద్రాల ద్వారా వచ్చే దరఖాస్తులకు స్థానిక కార్యాలయంలో డిజిటల్ సిగ్నేచర్ సౌకర్యం కల్పిస్తేనే పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కలుగుతుంది. మూడురోజుల నుంచి అనకాపల్లి జోనల్ కార్యాలయంలో సర్టిఫికెట్లు మాన్యువల్ పద్ధతిలో అందించడంతో కొద్దిగా వత్తిడి తగ్గినప్పటికీ పెండింగ్ దరఖాస్తులు రెండువేలకు పైగానే ఉన్నాయి. అన్ని ధ్రువీకరణ పత్రాలతో పాటు పలు సేవలను మీసేవా కేంద్రం ద్వారా పొందవచ్చని ప్రభుత్వం గొప్పలు చెబుతూంటే అనకాపల్లి జోనల్‌లో మాత్రం జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను పొందేందుకు మీసేవా సౌకర్యం లేకపోవడం దురదృష్టకరం.
అనకాపల్లి అంటే అలుసే
అనకాపల్లి జోనల్ అంటే జీవీఎంసీ అధికారులకు అలుసుగానే కనిపిస్తోంది. గతంలోనూ హెల్త్ ఆఫీసర్ పోస్టుకు ఇన్‌ఛార్జినే నియమించి కాలం వెళ్లదీసిన జీవీఎంసీ అధికారులు రెండు నెలలుగా హెల్త్ ఆఫీసర్ లేకపోయినా పట్టించుకోవడం లేదు. తాజాగా గాజువాక జోనల్ హెల్త్ ఆఫీసర్‌కు అనకాపల్లి జోనల్ హెల్త్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో మళ్లీ ఇన్‌చార్జి పాలనలోనే పబ్లిక్ హెల్త్ విభాగం కొనసాగనుంది. కీలకమైన పారిశుద్ధ్య వ్యవస్థ నిర్వహణతో పాటు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆహారోత్పత్తులపై పర్యవేక్షణ వంటి అధికారాలు ఉన్న హెల్త్ ఆఫీసర్ నియామకం విషయంలో ఉన్నతాధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదని దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డిజిటల్ సిగ్నేచర్ కీ లేకే జాప్యం : జోనల్ కమిషనర్
ఈ సమస్యపై అనకాపల్లి జోనల్ కమిషనర్ డి.చంద్రశేఖరరావును వివరణ కోరగా డిజిటల్ సిగ్నేచర్ కీ సౌకర్యం ఉన్న జీవీఎంసీకి దరఖాస్తు చేసుకున్నవారికి వెంటనే ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతున్నాయని, మీ సేవా కేంద్రానికి ఆ సౌకర్యం లేకపోవడం వల్లే జాప్యం అవుతోందని చెప్పారు. డిజిటల్ సిగ్నేచర్ కీ కోసం ఇప్పటికే దరఖాస్తు చేశామని, ప్రస్తుతం మాన్యువల్ పద్ధతిలో ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నామని చెప్పారు.