
చీకటి జీవోతో చిక్కిన ఆదాయం
పీఎన్ కాలనీ:చేతులు కాల్చుకున్నాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకున్నా.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రభుత్వ ఖజానాకు కోట్లలోనే నష్టం వాటిల్లింది. భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ ఇటీవల జారీ చేసిన జీవో నెం.398 వల్ల జిల్లాలో రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.3.70 కోట్ల మేరకు ఆదాయం తగ్గిపోయింది. మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో ఆర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల పరిధిలోని భూములకు తప్ప ఇతర భూముల రిజిస్ట్రేషన్లు నిషేధిస్తూ గత ఏడాది నవంబర్ 29న ప్రభుత్వం 398 నెంబర్‌తో ఒక జీవోను విడుదల చేసింది. దీని ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాలోనూ భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు బాగా తగ్గిపోయాయి.
జిల్లాలో గత నవంబరులో 2,792 రిజిస్ట్రేషన్లు జరగ్గా రిజిస్ట్రేషన్ల శాఖకు * 3,63,20,292 ఆదాయం సమకూరింది. అయితే జీవో నెం. 398 ప్రభావంతో డిసెంబరులో రిజిస్ట్రేషన్ల సంఖ్య సుమారు వెయ్యి వరకు తగ్గిపోయింది. ఆ నెలలో 1754 రిజిస్ట్రేషన్లు జరగ్గా 3,26,15,158 రూపాయల ఆదాయం మాత్రమే వచ్చింది. జనవరి మొదటి వారంలోనూ ఇదే పరిస్థితి. ఎట్టకేలకు కళ్లు తెరిచిన ప్రభుత్వం ఈ నెల ఐదో తేదీన 398 జీవోను రద్దు చేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయినా సరే జీవో అమల్లో ఉన్న కాలంలో తమ శాఖకు సుమారు 3.70 కోట్ల ఆదాయం తగ్గిపోయిందని, ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం తగ్గడం గతంలో ఎప్పుడూ జరగలేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
యథావిధిగా రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని ప్రభుత్వం నుంచి గత సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయని వారు వెల్లడించారు. జీవో వెలువడిన నాటి నుంచి రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయి. దాంతో జీవోను రద్దు చేయాలని రియల్టర్లు, డాక్యుమెంట్ రైటర్లు ప్రభుత్వానికి పలు దఫాలు లేఖలు రాయడంతోపాటు నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఎప్పుడూ రద్దీగా కళకళలాడుతూ ఉండే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రిజిస్ట్రేషన్లు లేక బోసిపోయాయి. సిబ్బంది ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు ప్రభుత్వం 398 జీవోను రద్దు చేయడంతో రిజిస్ట్రేషన్ల శాఖకు మళ్లీ పూర్వపు కళ వచ్చింది.