భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు మున్సిపాలిటీలు తీవ్రంగా దెబ్బతిన్నాయని... ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు రూ.1,129 కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కె.తారకరామారావు విజ్ఞప్తి చేశారు.ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేటీఆర్.. గురువారం అక్కడ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై విజ్ఞప్తులు చేశారు. తొలుత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడితో సమావేశమైన కేటీఆర్... తెలంగాణలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల పరిస్థితిని వివరించారు. నష్టాలపై ఒక నివేదికను ఆయనకు అందించారు. దీనిపై వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. విభాగాల వారీగా కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా అందే పూర్తి నష్టం నివేదిక ఆధారంగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. భేటీ అనంతరం కేటీఆర్ మాట్లాడారు.