పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు తీరం వెంబడి ట్రామ్ (రైలు) తరహా ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేసే విషయం ఆలోచించాలి. అందుకు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీ కోసం కన్సల్టెన్సీని నియమించండి.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : అవినీతికి ఆస్కారం లేకుండా, లంచాల ప్రసక్తే లేకుండా బిల్డింగ్ ప్లాన్లు ప్రజలకు అందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణాలు, నగరాల్లో ప్రాధాన్యతాక్రమంలో భూగర్భ డ్రైనేజీ, మురుగు నీటి శుద్ధి ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. మంచినీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వాడాలని, డీశాలినేషన్ (సముద్రం జలాల శుద్ధి) చేసిన నీటినే పరిశ్రమలకు వినియోగించాలని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. విశాఖ, కాకినాడ, తిరుపతి సహా వివిధ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో అభివృద్ధి కార్యక్రమాల పరిస్థితి గురించి ఆరా తీస్తూ.. పలు సూచనలు చేశారు.
అవినీతికి ఆస్కారం ఇవ్వొద్దు
కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో లంచాలు తీసుకోకుండా బిల్డింగ్ ప్లాన్లు మంజూరు చేసే పరిస్థితి ఉండాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు విస్పష్టంగా చెప్పారు. అవసరమైతే ఇందుకు ఏసీబీ సాయం తీసుకోవాలని సూచించారు. మెరుగైన వ్యవస్థను తయారు చేయడానికి అహ్మదాబాద్ ఐఐఎం సేవలను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. అవినీతిలేని వ్యవస్థను తీసుకు వస్తే అధికారులను సన్మానిస్తామని చెప్పారు. విశాఖ నగరానికి నిరంతరాయంగా తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పోలవరం నుంచి భూగర్భ పైప్‌లైన్ ద్వారా తాగునీటిని నేరుగా విశాఖ నగరానికి సరఫరా చేయడానికి వీలుగా ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. విశాఖలో దాదాపు 1.50 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు.
మున్సిపాలిటీలుగా కమలాపురం, కుప్పం
వైఎస్సార్ జిల్లాలోని కమలాపురం, చిత్తూరు జిల్లాలోని కుప్పం పంచాయతీలను మున్సిపాల్టీలుగా మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరించారు. త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఆయన అధికారులకు సూచించారు. రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో జనాభాను దృష్టిలో పెట్టుకుని దశల వారీగా, ప్రాధాన్యతా క్రమంలో భూగర్భ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి ప్రాజెక్టులను చేపట్టాలని ఆదేశించారు. మురుగు నీటిని తప్పనిసరిగా శుద్ధి చేసిన తర్వాతే బయటకు వదలాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా> 110 మున్సిపాల్టీల్లో 19,769 కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజీ నిర్మించడానికి రూ.23,037 కోట్లు ఖర్చు అవుతుందన్న అంచనాలను అధికారులు సీఎంకు వివరించారు. లక్షకు పైబడ్డ జనాభా ఉన్న 34 మున్సిపాల్టీల్లో భూగర్భ డ్రైనేజీ, మురుగు నీటి శుద్ధి కోసం రూ.11,181 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. డీశాలినేషన్ చేసిన నీటినే పరిశ్రమల అవసరాలకు వాడుతూ.. మంచి నీటిని కేవలం తాగునీటి అవసరాలకే వాడేందుకు అవసరమైతే చట్టం చేద్దామని సీఎం అన్నారు. ఇందుకు సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు.
స్పెసిఫికేషన్స్ మార్చకుండా రివర్స్ టెండరింగ్
స్పెసిఫికేషన్స్ మార్చకుండా పట్టణ గృహ నిర్మాణ పథకంలో రివర్స్ టెండర్లు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఫ్లాట్ల నిర్వహణ బాగుండేలా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్కూళ్లలో తల్లిదండ్రుల కమిటీల్లానే ఫ్లాట్ల నిర్వహణ కోసమూ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 48,608 హౌసింగ్ యూనిట్ల(ఇళ్ల)కు రివర్స్ టెండరింగ్ నిర్వహించామని అధికారులు సీఎంకు వివరించారు. రూ.2,399 కోట్ల కాంట్రాక్టు విలువ గల పనులకు నిర్వహించిన రివర్స్ టెండర్ల ద్వారా రూ.303 కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. మిగిలిన యూనిట్లకూ త్వరలోనే రివర్స్ టెండరింగ్ పూర్తి చేస్తామన్నారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి బొత్స, పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లి, మంగళగిరి, పులివెందులలో అభివృద్ధి చూపించాలి
తాడేపల్లి, మంగళగిరి, పులివెందుల మున్సిపాలిటీలలో అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ మున్సిపాలిటీల్లో కచ్చితంగా ఫలితాలు చూపించాలని స్పష్టం చేశారు. ఈ మున్సిపాల్టీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేసి ప్రతిపాదనలతో రావాలన్నారు. ఆ మేరకు డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) తయారు చేస్తున్నామని అధికారులు వివరించారు. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలలో 10,794 మంది ఇళ్ల పట్టాల లబ్ధిదారులను గుర్తించామని అధికారులు తెలుపగా, మోడల్ కాలనీ కట్టాలని సీఎం ఆదేశించారు. విజయవాడలో ముంపునకు గురికాకుండా కృష్ణా నది పొడవునా రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ పనులు వీలైనంత వేగంగా చేపట్టాలని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment