CM Jagan Launched 'ACB 14400 APP' Corruption Free Governance - Sakshi
Sakshi News home page

Andhra Pradesh: అవినీతిపై పిడుగు

Published Thu, Jun 2 2022 3:31 AM | Last Updated on Thu, Jun 2 2022 2:33 PM

CM Jagan Launched ACB 14400 APP Corruption Free Governance - Sakshi

ఏసీబీ 14400 యాప్‌ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. చిత్రంలో డీజీపీ, అధికారులు

ACB 14400 App, సాక్షి, అమరావతి: అవినీతికి ఏమాత్రం తావులేని స్వచ్ఛమైన పాలన అందించడమే మనందరి కర్తవ్యం కావాలని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎవరైనా సరే.. ఎక్కడైనా సరే.. అవినీతికి పాల్పడితే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అవినీతిని నిరోధించేందుకు ఏసీబీ ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్‌ యాప్‌ ‘ఏసీబీ 14400’ని సీఎం జగన్‌ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ‘స్పందన’ సమీక్ష సందర్భంగా ఆవిష్కరించి మాట్లాడారు.

డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఏసీబీ డీఐజీలు అశోక్‌కుమార్, పీహెచ్‌డి రామకృష్ణ ఇందులో పాల్గొన్నారు. ఎక్కడా అవినీతి ఉండకూడదనే మాట ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి చాలా గట్టిగా, స్పష్టంగా, పదేపదే చెబుతున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. వ్యవస్థ ప్రక్షాళన దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా, ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రూ.1.41 లక్షల కోట్లను ఎలాంటి అవినీతికి తావు లేకుండా, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి అత్యంత పారదర్శకంగా జమ చేశామని చెప్పారు.

డేటా నేరుగా ఏసీబీకి
అవినీతి నిర్మూలనకు మరో విప్లవాత్మక మార్పు తెస్తున్నాం. అది కలెక్టరేట్‌ అయినా, ఆర్డీవో కార్యాలయమైనా.. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు అయినా.. మండల కార్యాలయం అయినా.. పోలీస్‌స్టేషన్‌ అయినా.. వలంటీర్లు.. సచివాలయం.. 108.. 104 సర్వీసులు అయినా.. ఎవరైనా సరై .. ఎక్కడైనా లంచం అడిగితే మీరు చేయాల్సింది ఒక్కటే.. మొబైల్‌లో ‘ఏసీబీ 14400’ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని బటన్‌ నొక్కి వీడియో / ఆడియో సంభాషణ రికార్డు చేయండి.

ఆ డేటా నేరుగా ఏసీబీకి చేరుతుంది. ఏసీబీ నేరుగా సీఎంవోకు నివేదిస్తుంది. అవినీతి నిర్మూలనలో ప్రతి కలెక్టర్, ఎస్పీకి బాధ్యత ఉంది.  ఫిర్యాదులపై వెంటనే స్పందించి అంకిత భావంతో అవినీతిని ఏరిపారేయాలి. మన స్థాయిలో తలచుకుంటే 50 శాతం అవినీతి అంతం అవుతుంది. మిగిలిన స్థాయిలో కూడా ఏరి పారేయాల్సిన అవసరం ఉంది. 
ఏసీబీ రూపొందించిన యాప్‌ 

ఎలా పని చేస్తుందంటే..
► గూగుల్‌ ప్లే స్టోర్‌లో ‘ఏసీబీ 14400’ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయడం ద్వారా వినియోగానికి సిద్ధంగా ఉంటుంది. 
► అవినీతి వ్యవహారాలకు సంబంధించిన ఆడియో, వీడియో, ఫొటోలను నేరుగా లైవ్‌ రిపోర్ట్‌ ఫీచర్‌ వినియోగించుకుని అక్కడికక్కడే ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
► లాడ్జ్‌ కంప్‌లైంట్‌ ఫీచర్‌ ద్వారా తమ దగ్గరున్న డాక్యుమెంట్లు, వీడియో, ఆడియో, ఫొటో ఆధారాలను ఏసీబీకి పంపించవచ్చు.
► ఫిర్యాదు రిజిస్టర్‌ చేయగానే మొబైల్‌ ఫోన్‌కు రిఫరెన్స్‌ నంబరు వస్తుంది. 
► త్వరలో ఐఓఎస్‌ వెర్షన్‌లోనూ యాప్‌ను సిద్ధం చేస్తున్న ఏసీబీ.

గూగుల్‌ ప్లే స్టోర్‌లో 14400 యాప్‌: డీజీపీ
రాష్ట్ర ప్రభుత్వం అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ఫిర్యాదుల కోసం రూపొందించిన 14400 యాప్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉందని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ యాప్‌ను మొబైల్‌ ఫోన్లలో డౌన్లోడ్‌ చేసుకుని ఓటీపీ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ యాప్‌ ద్వారా ఎవరైనా లైవ్‌ స్ట్రీమింగ్, ఆడియో, వీడియోను రికార్డు చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. గతంలో జరిగిన అవినీతిపై సైతం ఫిర్యాదు చేసే విధంగా యాప్‌ను రూపొందించామన్నారు. అవినీతికి పాల్పడుతున్న అధికారి పేరు, శాఖ వివరాలను పొందుపరిచి పంపితే, తక్షణమే అవినీతి నిరోధక శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement