7 నుంచి రెండో విడత ఆసరా | YS Jagan announced that YSR Asara Scheme second installment | Sakshi
Sakshi News home page

7 నుంచి రెండో విడత ఆసరా

Published Thu, Sep 23 2021 4:21 AM | Last Updated on Thu, Sep 23 2021 4:21 AM

YS Jagan announced that YSR Asara Scheme second installment - Sakshi

సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు అక్టోబర్‌ 7వ తేదీ నుంచి వరుసగా 10 రోజుల పాటు విజయ దశమి కానుకగా రెండో విడత ఆసరా అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన మాట్లాడుతూ అక్టోబర్‌ 7 నుంచి 10 రోజుల పాటు ఆసరా పథకంపై నిర్వహించే అవగాహన, చైతన్య కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొంటారని చెప్పారు. ఆ రోజుల్లో ఆసరా చెక్కుల పంపిణీయే కాకుండా ఆసరా, చేయూత, దిశ ద్వారా మహిళా సాధికారతకు ఏ విధంగా అడుగులు వేశామో ప్రజలకు వివరిస్తారన్నారు. ఆసరా, చేయూత ద్వారా జీవితాలను మెరుగు పరుచుకున్న వారి విజయాలను మహిళలకు వివరిస్తారని చెప్పారు. ఈ పథకాల ద్వారా వారి జీవితాలను ఎలా మార్చుకోవచ్చో కూడా వివరిస్తారని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ అతిపెద్ద కార్యక్రమం మండలం యూనిట్‌గా జరుగుతుందని, దాదాపు రూ.6,500 కోట్లు వైఎస్సార్‌ ఆసరా కింద ఇస్తున్నామని స్పష్టం చేశారు. తద్వారా దాదాపు 80 లక్షల మందికిపైగా అక్కచెల్లెమ్మలు లబ్ధిపొందుతారని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు
► పట్టణాలు, గ్రామాల్లో సంపూర్ణ పారిశుధ్య కార్యక్రమాలకు సంబంధించిన క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమం ‘క్లాప్‌’ అక్టోబర్‌ 1న ప్రారంభం అవుతుంది. అక్టోబర్‌ 19న జగనన్న తోడు కార్యక్రమం ఉంటుంది. దీని కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు అందజేస్తాం. 
► అక్టోబర్‌ 26న రైతులకు ‘వైఎస్సార్‌ సున్నావడ్డీ రుణాలు’ కార్యక్రమం ఉంటుంది. దీంతోపాటు ఈ ఏడాది రైతు భరోసా రెండో విడత అమలు చేస్తాం. కలెక్టర్లు ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి.  

జాగ్రత్తగా ఉండాలి
► కోవిడ్‌ తీవ్రత తగ్గింది. ఉధృతంగా ఉన్న కాలంలో పాజిటివిటీ రేటు 25.56 శాతం నమోదైంది. ప్రస్తుతం 2.5 శాతం కన్నా తక్కువగా ఉంది. రికవరీ రేటు కూడా 98.63 శాతంగా ఉంది. అయినా, కోవిడ్‌ పట్ల ఎలాంటి అలసత్వం వద్దు. మాస్కుల వినియోగం తప్పనిసరి. ఆంక్షలు కొనసాగించాలి. మలేరియా, డెంగీ, డయేరియా, టైఫాయిడ్‌ వంటి సీజనల్‌ వ్యాధులపైనా దృష్టి పెట్టండి.  
► 104 నంబర్‌ అనేది వన్‌స్టాప్‌ సొల్యూషన్‌గా నడవాలి. టీచింగ్‌ ఆస్పత్రులు, ఆస్పత్రుల్లో అన్నిరకాలుగా సిద్ధం కావాలి. మీ జిల్లాల్లోని టీచింగ్‌ ఆస్పత్రులకు జాయింట్‌ కలెక్టర్‌ హౌసింగ్‌ను అడ్మిన్‌ ఇన్‌చార్జిగా నియమించాలి. 
► నవంబర్‌ 15 నుంచి విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో కావాల్సిన సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. డిప్యుటేషన్లను పూర్తిగా రద్దు చేయాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ డిప్యుటేషన్లకు అనుమతి ఇవ్వొద్దు. ఎక్కడ సిబ్బంది లేకపోయినా ఆరోగ్య శాఖ కార్యదర్శి, కలెక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ పీఎస్‌ఏ ప్లాంట్లు
► 100 బెడ్లకు మించి ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఉంచేలా చూడాలి.   ప్రైవేటు ఆస్పత్రులకు 30 శాతం సబ్సిడీ కూడా ఇస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సదుపాయం లేదు. ప్రైవేటు ఆస్పత్రులు డి–టైప్‌ సిలిండర్లు, కాన్‌సన్‌ట్రేటర్లను అందుబాటులో ఉంచుకునేలా చూడాలి.
► ప్రభుత్వ ఆస్పత్రుల్లో 143 ప్రాంతాల్లో పీఎస్‌ఏ ప్లాంట్లు పెడుతున్నాం. అక్టోబర్‌ 10 నాటికి పీఎస్‌ఏ ప్లాంట్లన్నీ ఏర్పాటవుతాయి. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడంలో ఇవన్నీ సన్నాహకాలు.

ఫిబ్రవరి నాటికి సంపూర్ణ వ్యాక్సినేషన్‌ లక్ష్యం 
► ప్రస్తుతం మనం 2,59,55,673 మందికి వ్యాక్సినేషన్‌ ఇచ్చాం. వీరిలో 1,24,25,525 మందికి రెండు డోసులు, 1,35,30,148 మందికి సింగిల్‌ డోసు వ్యాక్సినేషన్‌ పూర్తయింది. 18 సంవత్సరాలు దాటిన వారికి నవంబర్‌ 30 నాటికి 3.5 కోట్ల మందికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్‌ ఇవ్వగలుగుతాం. 
► వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ప్రజలందరికీ పూర్తిగా 2 డోసులు ఇవ్వగలుగుతాం. వ్యాక్సినేషన్‌పైనా కలెక్టర్లు దృష్టి సారించాలి. రెండో డోసును సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలి. వచ్చే 10 రోజుల్లో 26,37,794 మందికి సెకండ్‌ డోసు వ్యాక్సిన్‌ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నాం.
► గుంటూరు, విజయనగరం, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన కలెక్టర్లు వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement