Andhra Pradesh: సుస్థిర ప్రగతిపై దృష్టి | CM YS Jagan instructed district collectors in video conference on Spandana | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: సుస్థిర ప్రగతిపై దృష్టి

Published Thu, Feb 3 2022 3:10 AM | Last Updated on Thu, Feb 3 2022 8:11 AM

CM YS Jagan instructed district collectors in video conference on Spandana - Sakshi

సుస్థిర ప్రగతి లక్ష్యాల కోసం చేస్తున్న పని, సాధిస్తున్న ప్రగతి నమోదు కావాలి. మనం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం. మన కలెక్టర్లు.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న కంటే బాగా పని చేస్తున్నారు. ప్రభుత్వం కూడా అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోంది. దీని వల్ల మన ప్రమాణాలు మరింత పెరుగుతాయి. దేశంలో అత్యుత్తమంగా నిలుస్తాం. దేశం మొత్తం మనవైపు చూస్తుంది.
– వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: సుస్థిర ప్రగతి లక్ష్యాల (ఎస్‌డీజీ –సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌)పై కలెక్టర్లు దృష్టి పెట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. 43 సూచికలపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలన్నారు. ఈ రంగాల్లో ప్రగతి ఎస్‌డీజీ లక్ష్యాలకు చేరువయ్యేలా ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సంస్థలతో కలిసి ముందుకు సాగాలని సూచించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పలు విషయాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనం పోటీ ప్రపంచంలో ఉన్నామని, కేవలం మన పని మనం చేయడమే కాకుండా చేసిన పనికి, సాధించిన లక్ష్యాలకు ప్రమాణాలు అందుకోవడం కూడా అవసరమని చెప్పారు. తద్వారా ఆయా జిల్లాలు జీవన ప్రమాణాలు, సుస్థిర ప్రగతి దిశగా ముందుకు సాగుతూ అంతర్జాతీయ ప్రమాణాలను సాధిస్తాయన్నారు.

సుస్థిర ప్రగతి లక్ష్యాల్లో 43 సూచికలపై కలెక్టర్ల ప్రమేయం నేరుగా ఉంటుందని, నవరత్నాలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతగా అమలు చేయడం ద్వారా ఈ సూచికలు గణనీయంగా మెరుగు పడతాయని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయం మొదలు జిల్లాలు.. రాష్ట్ర సచివాయలం వరకు ఈ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని ఆదేశించారు. అమ్మ ఒడి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా పాఠశాలల్లో చేరికలు పెరగడంతో పాటు, బడి మానేయకుండా నియంత్రించగలుగుతామని చెప్పారు. ఒక పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా 2 సూచికల్లో మన రాష్ట్ర పని తీరు గణనీయంగా కనిపిస్తుందని, ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయని వివరించారు. సుస్థిర ఆర్థిక ప్రగతి సూచికలపై కలెక్టర్లు జిల్లాలో అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..

జగనన్న హౌసింగ్‌తో ఆర్థిక వృద్ధి
► హౌసింగ్‌ వల్ల ఆర్థిక వృద్ధి పెరుగుతుంది. జిల్లా స్థూల జాతీయోత్పత్తి పెరుగుతుంది. సిమెంటు, స్టీలు వినియోగం పెరుగుతుంది. చాల మందికి ఉపాధి లభిస్తుంది. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో 15.60 లక్షల ఇళ్లు నిర్మాణం అవుతున్నాయి. ఇంకా ప్రారంభంకాని ఇళ్లు ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలి. కోర్టు కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టండి. లే అవుట్లలో ఇంకా పనులు ఏమైనా పెండింగ్‌ ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలి.
► అప్రోచ్‌ రోడ్లు ఏర్పాటుపై కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలి. విద్యుత్‌ లైన్ల ఏర్పాటు, గోదాముల నిర్మాణం పూర్తి కావాలి. మార్చి 31లోగా మొదటి విడతలో అన్ని ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావాలి. పనులు మొదలు కాని ఇళ్లు అంటూ ఉండకూడదు. ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు అధికారులు చేదోడుగా నిలవాలి. 
► బ్యాంకర్లతో మాట్లాడి లబ్ధిదారులకు రూ.35 వేల రుణాలు వచ్చేట్టు చేయాలి. వారికి అవసరమైన సామగ్రి అందేలా చర్యలు తీసుకోవాలి. సబ్సిడీపై సిమెంటు, స్టీలు, ఇసుక అందిస్తున్నాం. సక్రమంగా అవి లబ్ధిదారులకు చేరేలా తగిన చర్యలు తీసుకోవాలి. 
► 3.27 లక్షల మంది ఆప్షన్‌ 3 కేటగిరీ ఎంచుకున్నారు. ప్రభుత్వమే నిర్మించాలంటూ ఆప్షన్‌ ఉంచుకున్న లబ్ధిదారుల్లో 3.02 లక్షల మంది గ్రూపులుగా ఏర్పాటయ్యారు. మిగిలిన 25,340 మంది గ్రూపులుగా  ఏర్పాటయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. వెంటనే పనులు మొదలు పెట్టేలా చూడాలి. 

లే అవుట్ల తనిఖీలు తప్పనిసరి
► కలెక్టర్లు ప్రతి వారం ఒక లే అవుట్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. జేసీలు, మున్సిపల్‌ కమిషనర్ల స్థాయి అధికారులు వారానికి ఒకసారి తనిఖీ చేయాలి. జేసీ– హౌసింగ్‌కు సంబంధించిన అధికారి, ఆర్డీఓ, సబ్‌కలెక్టర్లు వారానికి 4 సార్లు తనిఖీ చేయాలి. ఇళ్ల నిర్మాణంలో ఖర్చును తగ్గించడంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి.
► లే అవుట్ల సమీపంలోనే ఇటుక తయారీ యూనిట్లు పెట్టాలి. 500 ఇళ్ల కంటే ఎక్కువ ఉన్న లే అవుట్లలో తప్పనిసరిగా గోడౌన్లు పెట్టాలి. దీనివల్ల ఇళ్ల నిర్మాణ ఖర్చు నియంత్రణలో ఉంటుంది. మెటల్‌ రేట్లపైనా దృష్టి పెట్టాలి. గృహ నిర్మాణంపైనా ప్రతి వారం కలెక్టర్లు సమీక్ష చేయాలి. గ్రామాలు, పట్టణాలు, మండలాలు, లే అవుట్ల వారీగా క్రమం తప్పకుండా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలి. 

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం
► డిసెంబర్‌ 21న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పథకాన్ని ప్రారంభించాం. ఉగాది నుంచి దీపావళి వరకు ఈ పథకం గడువు పొడిగించాం. ఈ పథకం ద్వారా పూర్తి హక్కులు వారికి లభిస్తాయి. లబ్ధిదారుల్లో అవగాహన కల్పించండి.
► డాక్యుమెంట్లు ఉన్న ఆస్తికీ, డాక్యుమెంట్లు లేని ఆస్తికీ ఉన్న తేడాను వారికి వివరించాలి. డాక్యుమెంట్లు లేకపోతే దక్కాల్సిన విలువలో 25 శాతమో, 30 శాతానికో కొనుగోలు చేసి.. వారిని దోపిడీ చేసే పరిస్థితి ఉంటుంది. పూర్తి హక్కులు ఉంటే వారి ఆస్తికి మంచి విలువ ఉంటుంది.
► గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులు ఓటీఎస్‌ కింద రుసుము చెల్లించడానికి 2 వాయిదాల అవకాశం కూడా కల్పించాం. ఒక వాయిదాలో రూ.5 వేలు, ఇంకో వాయిదాలో రూ.5 వేలు కట్టి పూర్తి హక్కులు పొందవచ్చు. ఆస్తి బదలాయింపు జరిగిన వారికి కూడా ఇలాంటి అవకాశాలే ఇచ్చాం. 
► ఈ పథకాన్ని ఇప్పటి వరకు 9.41 లక్షల మంది వినియోగించుకున్నారు. 2.8 లక్షల మందికి రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తయ్యింది. మిగిలిన వారికీ రిజిస్ట్రేషన్‌ చేసి, మండలాల వారీగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించి రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందించాలి.  

90 రోజుల్లోగా ఇళ్ల పట్టాలు 
► ఇప్పటి వరకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఆ తర్వాత 2,01,648 దరఖాస్తులు ప్రాసెస్‌ చేశాం. వీరిలో 1,05,322 మందికి సరిపడా భూములు గుర్తించాం. 91,229 మందికి పట్టాలు ఇచ్చాం. 
► భూమి బదలాయింపు విధానాన్ని వాడుకుని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. మిగిలిన 96,325 మందికి పట్టాలు ఇవ్వడానికి కలెక్టర్లు అన్ని చర్యలూ తీసుకోవాలి. 

26 కోట్ల పని దినాల లక్ష్యం
► ఇంకా 2 నెలల సమయం ఉంది. ప్రతి జిల్లాలో లక్ష పని దినాలు రోజుకు నమోదు చేయాలి. అప్పుడే మనం మరోసారి 26 కోట్ల పని దినాల లక్ష్యాన్ని చేరుకుంటాం. రానున్న రెండు నెలల్లో మెటీరియల్‌ కాంపొనెంట్‌ ఎక్స్‌పెండేచర్‌పై దృష్టి పెట్టాలి. లేకపోతే నిధులు మురిగిపోయే అవకాశం ఉంటుంది.
► సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్, డిజిటల్‌ లైబ్రరీల పనులు చాలా ముఖ్యమైనవి. వీటి నిర్మాణం ద్వారా గ్రామీణ అర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. తద్వారా రాష్ట్ర జీడీపీ పెరుగుతుంది.

స్పందన అర్జీల పరిష్కారం ముఖ్యం
► ప్రజల నుంచి వస్తున్న స్పందన ఆర్జీలను నాణ్యతతో పరిష్కరిస్తున్నారా.. లేదా? నిర్ణీత సమయంలోగా పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉంటున్నాయా? ఎందుకు పెండింగ్‌లో ఉంటున్నాయి? అనే అంశాలపై వారానికి రెండు సార్లు కలెక్టర్లు సమీక్ష చేపట్టాలి. కొత్తగా మనం ఆధునీకరించిన పోర్టల్‌ను ప్రారంభించాం. అర్జీ ఎక్కడ ఉందనేది మనకు దీని ద్వారా తెలుస్తుంది. 
► నిర్దేశిత సమయం కన్నా.. ఆ ఫైలు ఎందుకు పెండింగులో ఉందనే దానిపై దృష్టి పెట్టాలి. 11 శాతం అర్జీలు తిరిగి వస్తున్నాయి. వాళ్లు మళ్లీ దరఖాస్తు చేస్తున్నారు. ఒకే ఫిర్యాదుపై తిరిగి అర్జీ వస్తే.. తిరిగి అదే అధికారికి ఆ అర్జీ వెళ్లకుండా ఎస్‌ఓపీ పాటించాలి. ఈ విధానంపై కలెక్టర్లు మరింత ధ్యాస పెట్టాలి. 
► అర్జీల పరిష్కారంలో మానవత్వం ప్రదర్శించడం ద్వారా 90 శాతం సమస్యలు పూర్తిగా సమసిపోతాయి. ఉద్యోగులు అందుబాటులో ఉన్నప్పుడు, ప్రజల పట్ల మానవతా దృక్పథంతో ఆర్జీని అర్థం చేసుకున్నప్పుడు చాలా వరకు సమస్యలు పరిష్కారమవుతాయి.
► ప్రతి నెలా మూడు రోజులు ఆర్డీఓ కార్యాలయాలను సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించాలి. ప్రధానంగా రెవిన్యూ, భూములకు సంబంధించిన అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామ, వార్డు సచివాలయాలపై సమీక్ష చేయాలి.  
► గ్రామ సచివాలయం నుంచీ శాఖల వారీగా శిక్షణ, అవగాహన ఉండాలి. ఈ శిక్షణ సక్రమంగా కొనసాగుతుందా.. లేదా? అనే దానిపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి.  

ఫిబ్రవరి, మార్చిలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు
► ఫిబ్రవరి 8న జగనన్న చేదోడు (రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు లబ్ధి)
► ఫిబ్రవరి 15న వైఎస్సార్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీ (తాజాగా వరదల్లో నష్టపోయిన రైతులకు.. ఒక సీజన్‌లో జరిగిన నష్టం.. అదే సీజన్‌లోగా ఇవ్వాలన్న లక్ష్యానికి అనుగుణంగా, డిసెంబర్‌లో నష్టం జరిగితే.. ఫిబ్రవరిలో ఇస్తున్నాం)
► ఫిబ్రవరి 22న జగనన్న తోడు (చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణం). ఇప్పటికే 10 లక్షల మందికి వర్తింపు. అదనంగా మరో 6 లక్షల మందికి వర్తింపు.
► మార్చి 8న విద్యా దీవెన
► మార్చి 22న వసతి దీవెన 

ఫిబ్రవరి, మార్చిలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు
► ఫిబ్రవరి 8న జగనన్న చేదోడు (రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు లబ్ధి)
► ఫిబ్రవరి 15న వైఎస్సార్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీ (తాజాగా వరదల్లో నష్టపోయిన రైతులకు.. ఒక సీజన్‌లో జరిగిన నష్టం.. అదే సీజన్‌లోగా ఇవ్వాలన్న లక్ష్యానికి అనుగుణంగా, డిసెంబ ర్‌లో నష్టం జరిగితే.. ఫిబ్రవరిలో ఇస్తున్నాం)
► ఫిబ్రవరి 22న జగనన్న తోడు (చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణం). ఇప్పటికే 10 లక్షల మందికి వర్తింపు. అద నంగా మరో 6 లక్షల మందికి వర్తింపు.
► మార్చి 8న విద్యా దీవెన
► మార్చి 22న వసతి దీవెన. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement