సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ప్రారంభం కార్యక్రమం జనవరి 20 వరకూ కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకూ 39 శాతం ఇళ్లస్థలాలు పంపిణీ పూర్తైందని పేర్కొన్నారు. 17వేలకు పైగా కాలనీల్లోని 9,668 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్లస్థలాల పంపిణీ జరిగిందని, మిగిలిన వాటిని కూడా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పాలనలో పారదర్శకతను తారస్థాయికి తీసుకుని వెళ్లామని, ఇక ముందు కూడా దీనిని కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు. స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ మంగళవారం సమీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా.. ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ప్రారంభ అంశంపై జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు.(చదవండి: ధాన్యం సేకరించిన పక్షంలోగా చెల్లింపులు)
మౌలిక సదుపాయాలు కల్పించాలి
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... ‘‘ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గొప్ప కార్యక్రమం జరిగింది. ప్రతి కలెక్టర్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అక్కచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం కనిపిస్తోంది. వారి అందరి దీవెనలు మీకు లభిస్తాయి. నాతోపాటు, మీ అందరికీ కూడా ఈ సంతోషం ఉంటుంది. లే అవుట్స్‌లో ఇంటి నిర్మాణాలు కొనసాగించడం ఒక కార్యక్రమమైతే, వాటిలో మౌలిక సదుపాయలు కల్పించడం మరొక కార్యక్రమం. రోడ్లు, కరెంటు, తాగునీరు.. లాంటి కనీస సౌకర్యాలు కల్పించాలి. కాలనీ పరిమాణాన్ని బట్టి.. ఇతర సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కూడా పెట్టాలి. స్కూళ్లు, అంగన్‌వాడీలు, పార్కులు, గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్ లాంటివి రావాలి. కాలనీ పరిమాణం, జనాభా బట్టి వీటిని ఏర్పాటు చేయాలి.
ఇందుకు సంబంధించి ఎస్‌ఓపీని తయారు చేయాలి. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేసరికి అవన్నీపూర్తి కావాలి. ఒక లే అవుట్‌లో పనులు ప్రారంభించిన తర్వాత అవన్నీ పూర్తికావాలి. కాలనీలో పనులు మొదలుపెట్టిన తర్వాత అందులో ఉన్న అన్ని ఇళ్లనూ పూర్తిచేయాలి. ఒకవేళ అదనంగా ఇళ్ల నిర్మాణాన్ని మంజూరు చేయాల్సి వస్తే.. వెంటనే దానికి అనుగుణంగా మంజూరుచేసి కాలనీలో అన్ని ఇళ్లనూ పూర్తిచేసేలా చర్యలు తీసుకుందాం’’ అని దిశా నిర్దేశం చేశారు.
ఆహ్లాదకర వాతావరణం ఉండాలి: సీఎం జగన్
వైఎస్సార్ జగనన్న కాలనీలను మురికివాడలుగా మార్చే పరిస్థితి ఉండకూడదని, ప్రతిచోటా ఆహ్లాదకర వాతావరణం ఉండాలని సీఎం జగన్ అన్నారు. రోడ్లను వినూత్న రీతిలో నిర్మించి, బాగా ఎలివేట్ చేయాలని సూచించారు. వీధి దీపాలు, కరెంటు స్తంభాల ఏర్పాటులో కూడా వినూత్న పద్ధతులను అనుసరించాలని, కాలనీలు కట్టేటప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్లు శ్రద్ధపెట్టి అన్ని పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. డిజైన్లు, ఇతరత్రా అంశాలపై ఇప్పటికే కొన్ని సూచనలు చేశానని, కలెక్టర్లు దీన్ని సవాల్‌గా తీసుకుని, సమర్థతను నిరూపించుకోవాలని పేర్కొన్నారు.
అవినీతికి పాల్పడితే పేదవాళ్ల ఉసురు తగులుతుంది
- ప్రతి కాలనీ వెలుపల బస్టాప్ ఉండాలి.
- బస్టాప్‌ను కూడా హైటెక్ రీతిలో తీర్చిదిద్దాలి.
- కాలనీ ఎంట్రన్స్‌కూడా వినూత్నరీతిలో ఉండాలి.
- పెద్ద పెద్ద లేఅవుట్స్‌లో ఎలా ఉంటాయో.. అలాంటివి ఉండాలి.
- చెట్లు నాటాలి.. ఒక పద్ధతి ప్రకారం నాటాలి. కాలనీల నిర్మాణంలో మన సంతకం కనిపించాలి.
- అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ లాంటి వ్యవస్థలను ఇప్పుడే కల్పించడంపై దృష్టిపెట్టాలి.
- ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారులనుంచి ఆప్షన్లను వెంటనే తీసుకోవాలి.
- ఇది త్వరగా చేస్తేనే మనం చేయదగ్గ పనులకు కార్యాచరణ పూర్తవుతుంది.
- ఆప్షన్లు తీసుకునే కార్యక్రమం కూడా 20వ తేదీ నాటికి పూర్తికావాలి.
- మ్యాపింగ్, జియో ట్యాగింగ్ కూడా ఏకకాలంలో పూర్తిచేయాలి
- ఎన్‌ఆర్‌ఇజీఎస్ కింద లబ్ధిదారులకు జాబ్‌కార్డులు ఇవ్వడం, వారి పేరుతో బ్యాంకు అక్కౌంట్లను ప్రారంభించడం పూర్తిచేయాలి.
- పేమెంట్ల విడుదలకు ఏపీ హౌసింగ్ వెబ్‌సైట్‌ను వినియోగించుకోండి.
- ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నీటి సరఫరా, కరెంటు చాలా ముఖ్యమైన అంశాలు.. మొదటగా వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
- కలెక్టర్లు క్రమం తప్పకుండా రివ్యూలు చేపట్టాలి.
- కాలనీల్లో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలపై డీపీఆర్‌లు తయారుచేయాలి. చాలా పెద్ద పెద్ద కాలనీలు ఇవి.. కొన్ని చోట్ల నగర పంచాయతీలు చేస్తున్నాం. మురుగునీటిని శుద్ధిచేసే ప్లాంట్లకోసం కూడా డీపీఆర్‌లు తయారుచేయాలి.
- ప్రతి కాలనీలోనూ ఒక మోడల్ హౌస్‌ను కట్టండి.
- ఇళ్ల నిర్మాణంలో వినియోగించే మెటీరియల్ నాణ్యత చాలా ముఖ్యమైనది
- పేదవాళ్ల నుంచి ఎవరైనా అవినీతికి పాల్పడితే అది క్షమించరాని నేరం.
- అవినీతి జరిగితే పేదవాళ్ల ఉసురు తగులుతుంది.
- ప్రతి అధికారికీ కలెక్టర్లు కమ్యూనికేట్ చేయాలి.
- ఇంట్లో కరెంటు సరఫరా కోసం వాడే వైరు కూడా క్వాలిటీతో ఉండాలి.
- ఇళ్ల నిర్మాణం జరుగుతున్న కాలనీ వరకూ ఇసుక సరఫరా జరిగేలా చూడండి. అలాగే మెటల్ సరఫరా కూడా చూసుకోండి.
- మెటీరియల్‌కు సంబంధించి టెండర్లను 20వ తేదీనాటికి పూర్తిచేసేలా కలెక్టర్లు చర్యలుతీసుకోవాలి.
- గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బందిని, వాలంటీర్ల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. వారికి మంచి శిక్షణ ఇవ్వండి.
- వీరి సేవలను వినియోగించుకోవడంపై ఎస్‌ఓపీని తయారుచేయండి.
- డిజిటల్ అసిస్టెంట్లను, ఇంజనీరింగ్ అసిస్టెంట్లను, వాలంటీర్లను సేవలను వినియోగించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment