AP: అవినీతిపై బ్రహ్మాస్త్రం 'కాల్‌ 14400' | CM Jagan Mandate Strict Measures prevent irregularities in govt services | Sakshi
Sakshi News home page

AP: అవినీతిపై బ్రహ్మాస్త్రం 'కాల్‌ 14400'

Published Tue, Jul 26 2022 3:18 AM | Last Updated on Tue, Jul 26 2022 7:54 AM

CM Jagan Mandate Strict Measures prevent irregularities in govt services - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ సేవల్లో అవినీతికి ఏమాత్రం తావు లేకుండా కఠిన చర్యలు చేపట్టి పారదర్శకంగా వ్యవహరించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. సబ్‌ రిజిస్ట్రార్, ఎమ్మార్వో, ఎండీవో, ఆర్డీవో, కలెక్టర్‌ కార్యాలయాలతో పాటు అవినీతి జరగడానికి అవకాశం ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై మరింత దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. అవినీతిపై ఫిర్యాదులకు సంబంధించి ఏసీబీ నంబర్‌ 14400తో పోస్టర్‌లు ఏర్పాటు చేసి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు.

ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ స్పష్టంగా కనిపించేలా ఈ పోస్టర్‌ను ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ నంబర్‌ అందరికీ తెలిసేలా ప్రదర్శించాలని సూచించారు. పటిష్ట చర్యల ద్వారానే అవినీతిని రూపుమాపగలుగుతామన్నారు. 14400 నంబర్‌కు వచ్చే ఫోన్‌ కాల్స్‌ను రిసీవ్‌ చేసుకోవడంతో పాటు వాటికి సంబంధించి తీసుకున్న చర్యలపై నివేదిక పక్కాగా ఉండాలని ఆదేశించారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలందించేందుకు ఎక్కడైనా లంచం మాటెత్తితే గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ‘ఏసీబీ 14400’ డౌన్‌లోడ్‌ చేసుకుని పలు ఫీచర్లతో నేరుగా యాప్‌లోనూ ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పౌరులకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. రెవెన్యూ, ఎక్సైజ్, మునిసిపల్, గనులు, అటవీ – పర్యావరణం, ఎక్సైజ్‌ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పన్నుల వసూళ్లలో పారదర్శకత, నాణ్యమైన సేవలకు సంబంధించి సమీక్షించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ..
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

రాబడితో పాటు జవాబుదారీతనం పెరగాలి
ఆదాయ ఆర్జనలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థత పెంచాలని కీలక ప్రభుత్వ శాఖలను సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూరే మార్గాలు వివాదాల కారణంగా నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించారు. ఆదాయాన్ని సమకూర్చుకునే క్రమంలో న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదులు, అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ నిరాటంకంగా రాబడి సమకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తప్పుడు బిల్లులు, పన్ను ఎగవేతలకు తావు లేకుండా ఉత్తమ విధానాలను రూపొందించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. 

అక్రమ మద్యానికి అడ్డుకట్ట
అక్రమ మద్యం తయారీ, రవాణాను సమర్ధంగా నిరోధించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. గ్రామాల్లో అక్రమ మద్యం నిరోధంలో మహిళా పోలీసులు కీలకపాత్ర పోషించాలని సూచించారు. దీనిపై గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులకు ఎస్‌వోపీలు రూపొందించాలని ఆదేశించారు. అక్రమ మద్యం తయారీ, విక్రయాల నిరోధానికి సంబంధించి క్రమం తప్పకుండా వారి నుంచి నివేదికలు సేకరించాలని స్పష్టం చేశారు. 

అక్టోబర్‌ 2 నాటికి 2 వేల సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు
రాష్ట్రవ్యాప్తంగా 51 గ్రామాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే రిజిస్ట్రేషన్లు విజయవంతంగా జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. మరో 650 గ్రామాల్లోని సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. వీటికి అదనంగా 2 వేల గ్రామాల్లోని సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలను వచ్చే అక్టోబరు 2 నాటికి సిద్ధం చేస్తామని వివరించారు.రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ఏయే సేవలు అందుబాటులో ఉంటాయన్నది పోస్టర్ల రూపంలో ప్రదర్శించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు అర్ధమయ్యేలా పోస్టర్ల రూపంలో ప్రదర్శించాలన్నారు.

పక్కాగా స్టాక్‌ వెరిఫికేషన్‌ 
అటవీ, పర్యావరణ శాఖపై సమీక్ష సందర్భంగా త్వరలోనే ఎర్ర చందనం వేలం  వేస్తామని, గ్లోబల్‌ టెండర్‌ కోసం కేంద్రం నుంచి అనుమతులు లభించనున్నాయని అధికారులు తెలిపారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఉన్న స్టాక్‌ను భద్రపరచడంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు. ప్రతి నెలా స్టాక్‌ వివరాలు తనిఖీ చేస్తూ పక్కాగా నమోదు చేయాలని స్పష్టం చేశారు.
 
అగ్రిగోల్డ్‌ ఆస్తులపై..
గతంలో ఇచ్చిన మాట ప్రకారం అగ్రిగోల్డ్‌ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.905.57 కోట్లను చెల్లించిందని ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. అన్ని రకాల వివాదాలను త్వరితగతిన పరిష్కరిస్తూ ముందుకు వెళ్లాలని ఆదేశించారు.  సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. పన్నుల విభాగంలో డేటా ఎనలిటిక్స్‌ సెంటర్‌ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్‌ శాఖ) కె.నారాయణస్వామి, అటవీ, పర్యావరణ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ సమీర్‌ శర్మ, అటవీ పర్యావరణశాఖ స్పెషల్‌ సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ (ఎక్సైజ్, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌) స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, చీఫ్‌ కమిషనర్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ జి.సాయి ప్రసాద్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్, ఏపీ జెన్‌కో ఎండీ బి.శ్రీధర్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్, ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement