Public services
-
AP: అవినీతిపై బ్రహ్మాస్త్రం 'కాల్ 14400'
సాక్షి, అమరావతి: ప్రభుత్వ సేవల్లో అవినీతికి ఏమాత్రం తావు లేకుండా కఠిన చర్యలు చేపట్టి పారదర్శకంగా వ్యవహరించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సబ్ రిజిస్ట్రార్, ఎమ్మార్వో, ఎండీవో, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాలతో పాటు అవినీతి జరగడానికి అవకాశం ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై మరింత దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. అవినీతిపై ఫిర్యాదులకు సంబంధించి ఏసీబీ నంబర్ 14400తో పోస్టర్లు ఏర్పాటు చేసి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ స్పష్టంగా కనిపించేలా ఈ పోస్టర్‌ను ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ నంబర్ అందరికీ తెలిసేలా ప్రదర్శించాలని సూచించారు. పటిష్ట చర్యల ద్వారానే అవినీతిని రూపుమాపగలుగుతామన్నారు. 14400 నంబర్‌కు వచ్చే ఫోన్ కాల్స్‌ను రిసీవ్ చేసుకోవడంతో పాటు వాటికి సంబంధించి తీసుకున్న చర్యలపై నివేదిక పక్కాగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలందించేందుకు ఎక్కడైనా లంచం మాటెత్తితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘ఏసీబీ 14400’ డౌన్లోడ్ చేసుకుని పలు ఫీచర్లతో నేరుగా యాప్‌లోనూ ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పౌరులకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. రెవెన్యూ, ఎక్సైజ్, మునిసిపల్, గనులు, అటవీ – పర్యావరణం, ఎక్సైజ్ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పన్నుల వసూళ్లలో పారదర్శకత, నాణ్యమైన సేవలకు సంబంధించి సమీక్షించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాబడితో పాటు జవాబుదారీతనం పెరగాలి ఆదాయ ఆర్జనలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థత పెంచాలని కీలక ప్రభుత్వ శాఖలను సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూరే మార్గాలు వివాదాల కారణంగా నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించారు. ఆదాయాన్ని సమకూర్చుకునే క్రమంలో న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదులు, అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ నిరాటంకంగా రాబడి సమకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తప్పుడు బిల్లులు, పన్ను ఎగవేతలకు తావు లేకుండా ఉత్తమ విధానాలను రూపొందించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. అక్రమ మద్యానికి అడ్డుకట్ట అక్రమ మద్యం తయారీ, రవాణాను సమర్ధంగా నిరోధించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. గ్రామాల్లో అక్రమ మద్యం నిరోధంలో మహిళా పోలీసులు కీలకపాత్ర పోషించాలని సూచించారు. దీనిపై గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులకు ఎస్‌వోపీలు రూపొందించాలని ఆదేశించారు. అక్రమ మద్యం తయారీ, విక్రయాల నిరోధానికి సంబంధించి క్రమం తప్పకుండా వారి నుంచి నివేదికలు సేకరించాలని స్పష్టం చేశారు. అక్టోబర్ 2 నాటికి 2 వేల సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు రాష్ట్రవ్యాప్తంగా 51 గ్రామాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే రిజిస్ట్రేషన్లు విజయవంతంగా జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. మరో 650 గ్రామాల్లోని సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. వీటికి అదనంగా 2 వేల గ్రామాల్లోని సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలను వచ్చే అక్టోబరు 2 నాటికి సిద్ధం చేస్తామని వివరించారు.రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ఏయే సేవలు అందుబాటులో ఉంటాయన్నది పోస్టర్ల రూపంలో ప్రదర్శించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు అర్ధమయ్యేలా పోస్టర్ల రూపంలో ప్రదర్శించాలన్నారు. పక్కాగా స్టాక్ వెరిఫికేషన్ అటవీ, పర్యావరణ శాఖపై సమీక్ష సందర్భంగా త్వరలోనే ఎర్ర చందనం వేలం వేస్తామని, గ్లోబల్ టెండర్ కోసం కేంద్రం నుంచి అనుమతులు లభించనున్నాయని అధికారులు తెలిపారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఉన్న స్టాక్‌ను భద్రపరచడంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ప్రతి నెలా స్టాక్ వివరాలు తనిఖీ చేస్తూ పక్కాగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై.. గతంలో ఇచ్చిన మాట ప్రకారం అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.905.57 కోట్లను చెల్లించిందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. అన్ని రకాల వివాదాలను త్వరితగతిన పరిష్కరిస్తూ ముందుకు వెళ్లాలని ఆదేశించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. పన్నుల విభాగంలో డేటా ఎనలిటిక్స్ సెంటర్ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్ శాఖ) కె.నారాయణస్వామి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మ, అటవీ పర్యావరణశాఖ స్పెషల్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ (ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్) స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ జి.సాయి ప్రసాద్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్, ఏపీ జెన్కో ఎండీ బి.శ్రీధర్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, ఏపీ సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
దేశంలోనే ఉత్తమ డీజీపీ గౌతమ్ సవాంగ్
DGP Gautam Sawang Best DGP In India: సాక్షి, అమరావతి: ప్రజలకు సేవలు అందించడంలో ఏపీ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ దేశంలోనే అత్యుత్తమ డీజీపీగా నిలిచారని ది బెటర్ ఇండియా సంస్థ ప్రకటించింది. 2021లో ఉత్తమ సేవలు అందించిన 12 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల జాబితాను ఆ సంస్థ శనివారం విడుదల చేసింది. గడిచిన రెండేళ్లలో కోవిడ్ వల్ల అనేక కఠినమైన సవాళ్లను ఎదుర్కొవాల్సి వచ్చిందని, అటువంటి క్లిష్ట సమయంలోనూ డీజీపీ సవాంగ్ ప్రజలకు విశేష సేవలు అందించారని కితాబిచ్చింది. దిశ యాప్‌లో ఎస్‌వోఎస్ బటన్ (ఆప్షన్) ద్వారా అనేక మంది బాధితులకు సత్వర రక్షణ కల్పించేలా డీజీపీ చొరవ చూపినట్లు పేర్కొంది. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని బాధితుల ఫిర్యాదులు, వేగవంతమైన దర్యాప్తులో ఎంతో సమయాన్ని ఆదా చేశారని సంస్థ వివరించింది. సాంకేతికను ఉపయోగించుకుని 85 శాతం కేసుల పరిష్కారానికి దోహదపడ్డారని, ఎస్‌వోఎస్ బటన్ ఆప్షన్ ద్వారా ఐదు నెలల్లోనే 2,64,000 డౌన్లోడ్లతో రికార్డు సృష్టించారని తెలిపింది. మహిళల కోసం ప్రారంభించిన దిశా మొబైల్ యాప్ కేవలం ఐదు నెలల్లోనే 12.57 లక్షల డౌన్లోడ్లను చేయడంతో అద్భుతాలు సాధించారని ది బెటర్ ఇండియా సంస్థ గౌతమ్ సవాంగ్ సేవలను ప్రశంసించింది. -
బైక్ చాల్లే... క్యాబ్ ఎందుకు?!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బోడ బోడ, హబల్ హబల్, ఓజెక్, ఒకాడా... ఇక్కడైతే రాపిడో!!. పేర్లు వేరైనా.. ప్రాంతాలు వేరైనా వ్యాపార మంత్రం ఒక్కటే. అదే బైక్ షేరింగ్! ఇండోనేషియా, థాయ్‌లాండ్, వియత్నాం, కాంబోడియా వంటి దేశాల్లో ప్రాచుర్యం పొందిన బైక్ షేరింగ్ ఇక్కడా దూసుకుపోతోంది. ఇపుడు బైక్ షేరింగ్ పరిశ్రమ సరికొత్త ఉపాధి, ఆదాయ మార్గాలను సృష్టిస్తోంది. ప్రస్తుతం దేశంలో బైక్ షేరింగ్ మార్కెట్ 10 బిలియన్ డాలర్లకు చేరిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో తొలిసారిగా ద్విచక్ర వాహనాలకు పబ్లిక్ సర్వీస్ ట్యాక్సీగా అనుమతినిచ్చింది గోవా రాష్ట్రమే. ఆ తర్వాత హరియాణా, మిజోరాం, వెస్ట్ బెంగాల్ ఈ కోవలోకి వచ్చాయి. తెలంగాణ, రాజస్తాన్, యూపీల్లోనూ కమర్షియల్ బైక్ ట్యాక్సీలకు అనుమతులున్నాయి. ప్రస్తుతం ఉబర్ మోటో, రాపిడో, ఓలా బైక్ ట్యాక్సీ, డ్రైవజీ, మోబిసీ, బైక్సీ, బౌన్స్, బాక్సీ, రెన్ట్రిప్, వోగో, టాజో, రోడ్పండా, ఆన్బైక్స్, పీఎస్బ్రదర్స్, రాయల్ బ్రదర్స్, వీల్‌స్ట్రీట్ వంటివి ఈ రంగంలో ఉన్నాయి. ఎలా పనిచేస్తాయంటే...? బైక్ యజమాని తన పేరు, చిరునామా, డ్రైవింగ్ లైసెన్సు, బీమా వంటి వివరాలను కంపెనీకి సమర్పించాలి. వాటిని సమీక్షించి.. బైక్‌ను తన షేరింగ్ ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్ చేస్తుంది. మనకు కావాల్సినపుడు బుకింగ్‌ను తీసుకోవచ్చు. బైక్ షేరింగ్‌లో డ్రైవర్‌ను కెప్టెన్‌గా పిలుస్తున్నారు. కస్టమర్ బైక్‌ను బుక్ చేయగానే.. డ్రైవర్ ఎవరు? అతని ప్రొఫైల్? ఎంత సమయంలో వస్తుంది? చార్జీ? వంటి వివరాలన్నీ వస్తాయి. కెప్టెన్ తలకు హెల్మెట్ పెట్టుకొని.. కస్టమర్‌కు కూడా ఒక హెల్మెట్‌ను తెస్తాడు. కస్టమర్‌ను గమ్య స్థానంలో డ్రాప్ చేయగానే అప్పటికప్పుడే కెప్టెన్ బ్యాంక్ ఖాతాలో నగదు జమవుతుంది. రియల్ టైమ్ రైడ్ బుకింగ్, ఆన్లైన్ పేమెంట్స్, బైక్ ట్రాకింగ్, ఎస్ఓఎస్ అలర్ట్ వంటివి బైక్ షేరింగ్‌లో ఉంటాయి. మహిళల కోసం ఎస్ఓఎస్ బటన్ ఉంటుంది. ఈ ఎస్ఓఎస్ బటన్ కంపెనీ కంట్రోల్‌తో అనుసంధానమై ట్రాకింగ్ చేస్తుంటుంది. ఎందుకింత డిమాండ్? ఓలా, ఉబర్ క్యాబ్ సంస్థలు ప్రోత్సాహకాలను రద్దు చేయడంతో చాలా మంది డ్రైవర్లు అన్‌లిస్ట్ అవుతున్నారు. దీంతో వీకెండ్స్‌లో, రద్దీ సమయంలో క్యాబ్స్ దొరకటం లేదు. ఇది బైక్ షేరింగ్ కంపెనీలకు కలిసొస్తుందని ర్యాపిడో కో–ఫౌండర్ అరవింద్ సంకా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో చెప్పారు. నగరాల్లో క్యాబ్‌తో పోల్చితే బైక్‌పై త్వరగా గమ్యానికి చేరుకోవటం, ధర 40–60% తక్కువగా ఉండటంతో డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బైక్‌లతో ఎంట్రీ.. ఇరుకైన రహదారులు, ట్రాఫిక్ జామ్స్, రద్దీ రోడ్లు, ప్రజా రవాణా పూర్తి స్థాయిలో లేకపోవటం వంటి దీర్ఘకాలిక సమస్యలకు బైక్ షేరింగ్ కంపెనీలు పరిష్కారం చూపిస్తున్నాయి. యువత, ఉద్యోగులు, ఐటీ నిపుణులు బైక్ షేరింగ్‌ను వినియోగిస్తున్నారు. యూనివర్సిటీలతో, పెద్ద కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం చేసుకొని కూడా షేరింగ్ సేవలను అందిస్తున్నాయి. పెట్రోల్ ధరలు పెరగటం కూడా బైక్ షేరింగ్ పరిశ్రమ వృద్ధికి కారణమని చెప్పొచ్చు. ర్యాపిడో, మొబిసీ, వోగో, జైప్ వంటి స్టార్టప్స్ ఎలక్ట్రిక్ బైక్స్‌ను వినియోగిస్తున్నాయి. సవాళ్లూ ఉన్నాయ్.. ప్రస్తుతం బైక్ షేరింగ్ కంపెనీలకు స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. దీంతో చాలా కంపెనీలు సేవలను నిలిపేస్తుండగా కొన్ని వ్యాపార విధానాల్ని మార్చుకుంటున్నాయి. డాట్, టువీల్జ్, రిడ్జీ, హెడ్‌లైట్, హెబోబ్, జిగో వంటివి బెంగళూరులో సేవలను నిలిపేశాయి. ఎంట్యాక్సీ, బైక్సీ, యాయా వంటివి పబ్లిక్ షేరింగ్ నుంచి డెలివరీ దిశగా వ్యాపారాన్ని మార్చుకున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో బైక్ షేరింగ్‌కు ప్రత్యేక చట్టాలు లేవు. కమర్షియల్ బైక్ ట్యాక్సీకి లైసెన్స్ లేకపోవటం, మార్గదర్శకాలపై స్పష్టత లేకపోవటంతో చాలా స్టార్టప్స్ కష్టాలు ఎదుర్కొంటున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలు బైక్ షేరింగ్‌ను నిషేధం విధించాయి. రహదారుల పరిస్థితులు, మహిళల భద్రత, ప్రమాదాల రేట్లు ఎక్కువగా ఉండటం వంటివి నిషేధానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో 40 శాతం వృద్ధి.. హైదరాబాద్‌లో ఓలా, ఉబర్, రాపిడో, వోగో, బౌన్స్ వంటి కంపెనీలు సేవలందిస్తున్నాయి. గత ఏడాది కాలంగా నగరంలో బైక్ షేరింగ్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఏడాదిలో 30–40 శాతం పెరిగినట్లు ర్యాపిడో ప్రతినిధి చెప్పారు. బిజీ వేళల్లో క్యాబ్స్ దొరకకపోవటం, ధర ఎక్కువగా ఉండటం ఒక కారణమైతే, మెట్రో రెండో కారణమని చెప్పారు. మెట్రో నుంచి వచ్చి 3–4 కి.మీ. వెళ్లేందుకు బైక్ వాడుతున్నారని చెప్పారాయన. లక్ష మంది డ్రైవర్లతో రోజుకు లక్ష రైడ్స్ జరుపుతున్న రాపిడోకు... హైదరాబాద్‌లో 15వేల మంది డ్రైవర్లు, 20వేల రైడ్స్ ఉన్నట్లు సమాచారం. బైక్ షేరింగ్‌లో మహిళలూ యాక్టివే.. గడిచిన ఏడాదిగా బైక్ షేరింగ్ డ్రైవర్స్‌గా మహిళలు కూడా నమోదవుతున్నారు. ర్యాపిడోలో 25% మహిళా కెప్టెన్లు ఉన్నారు. బైక్ షేరింగ్‌లో డ్రైవర్ అనే చిన్నచూపు ఉండదు. మన బైక్‌ను ఇతరులకు షేర్ చేస్తూ హెల్ప్ అవుతున్నామనే భావన ఉంటుందని ర్యాపిడో తొలి మహిళ రైడర్ గాయత్రి ఆకుండి తెలిపారు. మహిళా కెప్టెన్‌కు మహిళా కస్టమర్‌నే ఇస్తారు. రైడర్ నంబరు, ఫొటో ఏమీ కనిపించదు. ‘‘నేను ఫుల్ టైం డ్రైవర్ని కాదు. ఉదయం 7–10 గంటల వరకు రైడ్స్ తీసుకుంటా. తర్వాత యాప్ ఆఫ్ చేసి వర్క్‌లోకి వెళ్లిపోతా. నెలకు 150–200 రైడ్స్ తీసుకుంటా. నెలకు రూ.2,400–3,000 అదనపు ఆదా యం వస్తుంది. హ్యామ్స్టెక్లో ఫ్యాషన్ టెక్నాలజీలో పీజీ డిప్లొమా చేశా. 2 సినిమాలకు డిజైనర్‌గా పనిచేస్తున్నాను’’ అని గాయత్రి చెప్పారు. -
గాదె కింద పందికొక్కులు..!
పౌర సరఫరాల శాఖలో అవినీతికి అంతేలేకుండా పోయింది. తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా ఎవరికి వారు అందినకాడికి దండుకున్నారు. అక్రమాలను నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూశారు. నాలుగున్నర ఏళ్ల కాలంలో పేదల నోటికాడి ముద్ద తినేశారు. రూ. లక్షలు కాదు. దండుకుంది రూ.కోట్లలోనే. నెలనెలా రూ.20 కోట్ల వరకు సబ్సిడీ దుర్వినియోగం జరిగింది. రికార్డుల్లో అన్నీ లెక్కలు పక్కాగా చూపించినా క్షేత్ర స్థాయిలో బియ్యం దొంగలదే రాజ్యం. వీరు చేసిందంతా వీరభోజ్యం. సబ్సిడీ సరుకుల పంపిణీ పేరుతో పౌర సరఫరాలతో ప్రమేయం ఉన్న వారు తమ జేబులు దండిగా నింపుకున్నారు. అయినా ఇదేమి అన్యామని ప్రశ్నించిన నాథుడే లేరు. ఒంగోలు సిటీ: జిల్లాలో 2,142 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 9,89,306 తెల్లకార్డులు ఉన్నాయి. నాలుగున్నర ఏళ్ల కాలంలో 7.41 లక్షల టన్నుల బియ్యం, 24 వేల టన్నుల చక్కెర, 36 వేల కిలో లీటర్ల కిరోసిన్, ఏడు వేల టన్నుల కందిపప్పు, మూడు వేల టన్నుల సజ్జలు, అయిదు వేల టన్నుల రాగులు పంపిణీ చేశారు. దీనికి గాను ప్రభుత్వం జిల్లాలో రూ.2,569 కోట్లు ఖర్చు చేసింది. నెలనెలా సబ్సిడీలో రూ.కోట్ల కొద్దీ దుర్వినియోగం జరిగింది. చంద్రన్న రంజాన్ కాను కింద 72,927 కార్డుదారులకు ఒక్కొరికి రూ.290 విలువ కలిగిన నాలుగు రకాల సరుకులను పంపిణీ చేశారు. రూ.6.34 కోట్లు ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి కానుకల ద్వారా 9,45,520 కార్డుదారులకు రూ.240 విలువ కలిగిన ఆరు రకాల సరుకులను పంపిణీ చేశారు. దీనికి గాను ప్రభుత్వం రూ.68.07 కోట్లు ఖర్చు పెట్టినట్లుగా చూపించారు. ఇంత పెద్ద వ్యవస్థను సబ్సిడీ దొంగలు పెద్ద పెద్ద మొత్తాల్లోనే దోచేశారు. నామమాత్రంగానే కేసులు.. జిల్లాలో పౌర సరఫరాల ద్వారా పెద్ద ఎత్తున సబ్సిడీ దుర్వినియోగం జరిగింది. సబ్సిడీ మొత్తాన్ని వివిధ స్థాయిల్లోని అధికారులు వాటాలు వేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పౌర సరఫరాల్లో జరుగుతున్న అవినీతి తంతును నిరోధించే వారే కరవయ్యారు. పై స్ధాయి అధికారులకు అన్నీ తెలిసినా మిన్నకుండిపోయారన్న విమర్శలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా దాడులు నామమాత్రంగానే జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లా స్ధాయిలో అధికారులకు ఈ తతంగం అంతా తెలిసినా వారు పరోక్షంలో ప్రోత్సహించారన్న ఆరోపణలు ఉన్నాయి. రూ.10 లక్షల పైన బియ్యం పట్టుబడిన కేసులు కేవలం ఆరు మాత్రమే ఉండడం గమనార్హం. టీడీపీ నేతల సహకారంతోనే, వారి అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజల సొమ్మును భారీగా కాజేశారన్న విమర్శలు ఉన్నాయి. ఇక కొన్నైనా కేసులు నమోదు చేయాలి కాబట్టి అందు కోసంగా 6–ఎ కేసులను మొక్కుబడిగా తెరిచారు. ఏడాదికి సుమారుగా 150కి మించి ఈ కేసులు కూడా లేకపోవడం గమనార్హం. మండల స్ధాయి గోదాముల్లో భారీగా బియ్యం నిల్వల్లో తేడాలు ఉన్నాయి. నిత్యావసర సరుకులు భారీగా తేడాలు ఉన్నాయి.అయినా వీటిపై నిఘా లేదు. ఏళ్ల తరబడి ఈ విభాగంలోనే పనిచేసిన ఒకరిద్దరు అధికారులు ఇటీవలే పదవీవిరమణ చేశారు. ఒకరిద్దరిపై దుర్వినియోగం కేసులున్నా వాటిని టీడీపీ నేతల సిఫార్సుతో మాఫీ చేయించుకోగలిగారు. ఇంత జరుగుతున్నా ఈ అక్రమాన్ని నిరోధించే వారే లేకపోవడం ధారుణం అని ముక్కున వేలేసుకుంటున్నారు. జనం సొమ్ము బొక్కేసిన బియ్యం దొంగలు జిల్లా వ్యాప్తంగా పౌరసరఫరాల్లో సబ్సిడీని భారీగా బొక్కేశారు. వేల టన్నుల బియ్యాన్ని పక్కదారి పట్టించారు. రూ. కోట్ల కొద్ది సబ్సిడి పక్కదారి పట్టింది. ఈ శాఖలో పని చేస్తున్న అధికారి ఒకరికి మిల్లర్లు, కొందరు అక్రమార్కులైన డీలర్లతో సంబంధాలు ఉన్నాయి. పొరబాటున రాత్రి వేళ బియ్యం అక్రమంగా ఎత్తుతున్నారన్న సమాచారాన్ని పౌరులు జిల్లా అధికారులకు ఇస్తే వారి నుంచి దిగువ స్ధాయికి వచ్చే ఆదేశాలను అనుసరించి ఆకస్మికంగా దాడులు చేయడానికన్నా దొంగలకే ముందుగా సమాచారాన్ని ఇవ్వడం. దొంగలను కాపాడడం వంటివి ఇక్కడ సర్వసాధారణమే. ఇలా జిల్లా వ్యాప్తంగా బియ్యం దొంగల కొమ్ము కాశారనే ఆరోపణలను కొందరు అధికారులు మూటగట్టుకున్నారు. కాకినాడ పోర్టుకు వేలాది టన్నుల బియ్యం తరలింది. ఇక్కడి నుంచి బియ్యం పాలిష్ పట్టి నెలనెలా వందలాది క్వింటాళ్ల బియ్యం తిరిగి మార్కెట్లోకి వచ్చింది. నెల నెలా మామూళ్లు.. ప్రజల సొమ్ముకు కాపలా ఉండాల్సిన అధికారులు, సిబ్బంది నెలనెలా ఇచ్చే మామూళ్లకు కక్కుర్తి పడుతున్నారు. ఆహార తనిఖీ అధికారులు నెలనెలా రూ.లక్షల్లో సంపాయిస్తున్నారు. లేదంటే వారు డీలర్లను కేసులు పెడతామని బెదిరించి దండిగా మామూళ్లు సంపాయించారు. జిల్లా అధికారులకు ఈ వ్యవహారాలు తెలిసినా వారు నియంత్రించే పరిస్థితి లేకుండా పోయింది. కిలోకి ఎంత లేదన్నా రూ.25 వరకు అక్రమంగా సంపాయిస్తున్నారు. డీలర్లను ఆకస్మికంగా తనిఖీలు చేయడం, వారిపై కేసులు పెడతామని బెదిరించడం వంటి చర్యలతో బెంబేలెత్తి నెల నెలా మామూళ్లు, నజనారాలను ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు సీఎం,మంత్రుల పర్యటనలు ఉంటే వారికి ప్రొటోకాల్ పేరుతో రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ డీలర్ల ముక్కు పిండి వసూలు చేస్తుండంతో ఇక వారు అక్రమాలకు తెరతీస్తున్నారు. బహిరంగంగానే ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నా ఎక్కడా నియంత్రణ ఉండడం లేదు. రూ. కోట్లలో సబ్సిడీ దుర్వినియోగం నెలనెలా రూ. కోట్ల కొద్ది సబ్సిడీ పక్కదారి పడుతోంది. ఇప్పటి వరకు రూ.2,596 కోట్ల సబ్సిడీని ప్రజలకు అందజేసినట్లుగా లెక్కలు ఉన్నాయి. వీటిలో ఎంతలేదన్నా రూ.వెయ్యి కోట్ల మేర అవినీతి జరిగి ఉంటుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక చంద్రన్న కానుకల్లో 25 శాతం హీనపక్షం అవినీతి చోటు చేసుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఒకటి రెండు సందర్భాల్లో సరుకులు బూజుపట్టి, బెల్లం దెబ్బతిని దిబ్బలో సరులను పారబోసిన పరిస్థితులు ప్రజలకే తారసపడ్డాయి. పౌరసరఫరాల్లో అవినీతి పాతుకు పోయిన నేపథ్యంలో ఈ వ్యవస్థను బాగు చేద్దామనుకున్న లక్ష్మీనరశింహం వంటి అధికారుల వల్ల కాలేదు. ఆయన శక్తి చాలలేదు. ఆయననే బియ్యం దొంగలు పక్కదారి పట్టించారని ఆ రంగంలోని వారే అంటున్నారు. పౌర సరఫరాల్లో నెలనెలా జరుగుతున్న అవినీతి వ్యవహారంపై సరైన విచారణలు లేవు. ఏదైనా విచారణకు అధికారులు ఆదేశిస్తే ఇక టీడీపీ నేతల నుంచి వారిపై వచ్చే ఒత్తిళ్లు అన్నీ ఇన్నీ కావు. దీంతో నిఘా వ్యవస్థ పక్కాగా ఉన్నా వారు నిద్ర నటించడం. వారు కూడా మామూళ్లకు అలవాటు పడే పరిస్థితికి వెళ్లారు. ఇతర శాఖల నుంచి అధికారులు, సిబ్బంది పౌరసరఫరాలకు వస్తున్నారంటే ఇక్కడ అవినీతి బహిరంగం కాబట్టే.. నాలుగు డబ్బులు సంపాయించుకోవచ్చన్న ఆశతో వస్తున్నారు. ఇక్కడ అవినీతిని నిరోధించడం వల్లకాదని అధికార వర్గంలోనే అభిప్రాయాలు నెలకొనడడం గమనార్హం. -
ఇంటి వద్దకే 100 రకాల ప్రభుత్వ సేవలు
న్యూఢిల్లీ : డ్రైవింగ్ లైసెన్స్, కుల ధృవీకరణ పత్రం, జనన ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు వంటి వాటికోసం ఇక ప్రభుత్వ ఆఫీసులు, రెవెన్యూ ఆఫీసుల్లో గంటల తరబడి క్యూలైన్లలో వేచిచూడాల్సినవసరం లేదట. ఇక మీదట ఇలాంటి 100 రకాల ప్రజా సేవలను ఢిల్లీ ప్రభుత్వం ఇంటి వద్దనే అందించేందుకు సిద్ధమైంది. వచ్చే నెల నుంచి ఈ సేవలన్నింటిన్నీ ఇంటి వద్దనే అందించడం ప్రారంభిస్తామని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. అయితే వీటి కోసం అదనంగా 50 రూపాయల ఫీజు చెల్లించాలని ప్రభుత్వం పేర్కొంది. ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో, విజయవంతంగా పూర్తయిన ప్రతి ఒక్క లావాదేవీకి ‘ ఫెసిలిటేషన్ ఫీజు’ కింద సిటిజన్ల నుంచి 50 రూపాయలు ఛార్జ్ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి వర్గం ప్రకటించింది. ప్రభుత్వ సేవల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఎన్నో ఇబ్బందులు పడుతుంటారని, ఈ సమస్యను తీర్చడానికి ఢిల్లీ సర్కారు ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేసే దిశగా ఈ వినూత్న సౌకర్యాన్ని ప్రారంభించబోతుంది. ఈ విధానం వల్ల ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెరుగుతుందని, లంచాల బెడద తప్పుతుందని, ప్రజల సమయం వృథా కాదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు.ఈ పథకాన్ని ప్రైవేటు ఏజెన్సీ ద్వారా నిర్వహించనున్నారు. దీంతో ఏ ఒక్క సిటిజన్ గంటల తరబడీ క్యూ లైన్లలో వేచి చూడాల్సినవసరం లేదన్నారు. ఈ ప్లాన్ కింద మొబైల్ సహాయకస్(ఫెసిలేటర్లు)ను ఏజెన్సీ ద్వారా నియమించుకుంది. దీనికోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్లను కూడా ప్రారంభిస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు చేయాలనుకునే వారు, సంబంధిత కాల్ సెంటర్‌కు కాల్ చేసి, వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఏజెన్సీ, మొబైల్ సహాయకస్కు ఆ పనిని అప్పగించి, దరఖాస్తుదారుల రెసిడెన్స్‌ను సందర్శించాలని ఆదేశిస్తుంది. ఏజెన్సీ ఆదేశాలు మేరకు దరఖాస్తుదారుని ఇంటికి వెళ్లి, అవసరమైన డాక్యుమెంట్లను, వివరాలను కోరతారు. అయితే డ్రైవింగ్ టెస్ట్ కోసం దరఖాస్తుదారుడు ఒక్కసారి ఎంఎల్ఓ ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. దీని కోసం అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నామని గతేడాది నవంబర్లోనే డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చెప్పారు. -
నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఎలా నియమిస్తారు?
సాక్షి, హైదరాబాద్: ఎటువంటి నియామక ప్రక్రియ చేపట్టకుండానే 550 మందిని కళాకారులుగా ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకోవడంపై హైకోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. వారి నియామకాలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయి దా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కళాకారులుగా 550 మందిని ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా టంగుటూర్‌కు చెందిన జె.రమేశ్, మరో ఇద్దరు పిల్ దాఖలు చేశారు. మంగళవారం దీనిపై విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎలాంటి నియామక ప్రకటన జారీ చేయకుండా, దరఖాస్తులు ఆహ్వానించకుండా నేరుగా 550 మందిని ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకున్నారని పేర్కొన్నారు. 2015లో నియమితులైన వీరికి ఒక్కొక్కరికి రూ.24,514 వేతనంగా చెల్లిస్తున్నారని వివరించారు. కాగా, ప్రభుత్వ న్యాయవాది బీఎస్ ప్రసాద్ బదులిస్తూ వారిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించినట్లు తెలిపారు. దీంతో ఆ 550 మంది ఏ విధులు నిర్వర్తిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. -
నేటి నుంచి మెట్రో పరుగులు
సాక్షి, హైదరాబాద్: లాంఛనంగా ప్రారంభమైన మెట్రో రైలు బుధవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్యన నాగోల్–అమీర్‌పేట్ (17 కి.మీ.), మియాపూర్–అమీర్‌పేట్ (13 కి.మీ.) రూట్లో మెట్రో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. తొలిమూడు నెలల పాటు రైళ్ల పనివేళల్లో ఎలాంటి మార్పులుండవని మెట్రో అధికారులు తెలిపారు. ఈ రెండు మార్గాల్లో పదిచొప్పున సుమారు 20 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ప్రతి పదిహేను నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. ఒక్కో రైలుకు మూడు బోగీలుంటాయి. ఒక్కో బోగీలో సుమారు 40 మందికి కూర్చునే అవకాశం ఉంటుంది. అయితే ప్రయాణికుల రద్దీని బట్టి రైళ్ల ట్రిప్పుల సంఖ్య పెరిగే లేదా తగ్గే అవకాశాలున్నాయి. ఈ రెండు మార్గాల్లో నిత్యం సుమారు 3 లక్షల మంది రాకపోకలు సాగిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా మెట్రో జర్నీ చేసేందుకు స్మార్ట్‌కార్డు, టోకెన్, టికెట్లు కొనుగోలు చేసి ప్రయాణించాల్సి ఉంటుంది. ఒక స్మార్ట్కార్డుతో ఒక్కరే ప్రయాణించాలి. ఒక్కోసారి మీ వెంట పలువురు ప్రయాణికులు ఉన్నప్పుడు టోకెన్ లేదా టికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. స్మార్ట్‌కార్డుల కొనుగోలుకు ఎస్.ఆర్.నగర్, నాగోల్, ప్రకాశ్‌నగర్ స్టేషన్ల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మెట్రో ప్రయాణించే రెండు మార్గాల్లో మొత్తం 24 స్టేషన్లున్నాయి. చార్జీలివే.... మెట్రో కనీస చార్జీ రూ.10 కాగా.. గరిష్టంగా రూ.60 వరకు ఉంటుంది. నాగోల్–అమీర్‌పేట్ వరకు ప్రయాణిస్తే రూ.45 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక మియాపూర్–అమీర్‌పేట్ మార్గంలో ప్రయాణిస్తే రూ.40 చార్జీ చెల్లించాలి. ఒకేసారి నాగోల్‌లో రూ.60 చెల్లించి టికెట్ కొనుగోలు చేస్తే మియాపూర్ వరకు ప్రయాణిం చవచ్చు. అయితే మధ్యలో అమీర్‌పేట్ ఇంటర్ చేంజ్ స్టేషన్ వద్ద దిగి మరో రైలును ఎక్కాల్సి ఉంటుంది. మియాపూర్ బైక్స్టేషన్లో త్వరలో రిజిస్ట్రేషన్లు.. మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద హైదరాబాద్ బైసైకిలింగ్ క్లబ్ ఏర్పాటుచేసిన సైకిల్‌స్టేషన్ వ ద్ద 25 స్మార్ట్ సైకిళ్లను సిద్ధం చేశారు. వీటిని అద్దెకు తీసుకునేందుకు ఒకటి రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు అధికారులు తెలిపారు. పంజాగుట్ట మెట్రో మాల్‌ను డిసెం బర్ తొలివారంలో ప్రారంభిం చనున్నారు. స్టేషన్ల వద్ద పార్కింగ్ పరేషాన్.. మియాపూర్, నాగోల్ మెట్రో డిపోలతోపాటు సికిం ద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ సమీపంలోని పా త జీహెచ్ఎంసీ కార్యాలయంలో మాత్రమే ఇప్పటి వరకు పార్కింగ్ కేంద్రాలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో మిగతా స్టేషన్లకు వ్యక్తిగత బైక్‌లు, కార్లలో తరలివచ్చిన వారికి పార్కింగ్ తిప్పలు తప్పవు. 20–25 నిమిషాల్లో జర్నీ... నాగోల్ నుంచి మెట్రోలో బయలుదేరిన వ్యక్తి 17 కి.మీ. దూరంలో ఉన్న అమీర్‌పేట్‌కు కేవలం 25 నిమిషాల్లో చేరుకోవచ్చు. అదే బస్సు లేదా కారు లేదా బైక్‌పై అయితే 50 నుంచి 60 నిమిషాలు పడుతుంది. ఈ మార్గంలో మొత్తం 14 స్టేషన్లున్నాయి. ప్రతీ స్టేషన్లో రైలు 20 సెకన్లపాటు నిలుపుతారు. పరేడ్‌గ్రౌండ్స్, అమీర్‌పేట్ ఇంటర్ చేంజ్ స్టేషన్లలో 30 సెకన్లపాటు రైలు ఆగుతుంది. ఇక మియాపూర్–అమీర్‌పేట్ మార్గాన్ని 20 నిమిషాల్లో మెట్రో జర్నీలో చేరుకోవచ్చు. ఈ రూట్లో మొత్తం 10 స్టేషన్లున్నాయి. ఈ రూట్లోనూ బస్సు లేదా కార్ లేదా బైక్‌పై ప్రయాణిస్తే 50–60 నిమిషాల సమయం పడుతుంది. మన మెట్రో ప్రత్యేకతలు.. ⇒ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ (ప్రయివేటు పబ్లిక్ పార్టనర్షిప్) ప్రాజెక్టు ⇒దేశంలోనే నిర్మితమైన అతి పెద్ద మెట్రో వ్యవస్థ ⇒దేశంలోనే మొట్టమొదటి సారిగా ఒకేసారి అందుబాటులోకి 30 కిలోమీటర్ల నెట్వర్క్ ⇒ఎయిర్ కండీషన్డ్ సౌకర్యంతో ఆహ్లాదకరమైన, వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణం ⇒అధునాతన కోచ్‌లు ⇒ఐజీబీసీ(ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్) గుర్తింపు ⇒వినియోగదారులకు పూర్తి అనుకూలమైన 24 స్టేషన్లు ⇒దేశంలోనే అతిపెద్ద ఎలివేటెడ్ స్టేషన్‌గా అమీర్‌పేట ⇒ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మెషీన్స్(ఏటీవీఎం). ⇒ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ ద్వారా స్టేషన్ల వద్ద క్లిష్టత లేని ప్రవేశం మరియు నిష్క్రమణ ⇒కాలుష్య రహిత, పర్యావరణ అనుకూలమైన ప్రయాణం – కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతో పాటుగా ఇంధన వినియోగం, కాలుష్యం కూడా తగ్గిస్తుంది. -
రామగుండం పోలీసుల సేవాదృక్పదం
-
మొబైల్లో ప్రభుత్వ సేవలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : టెక్నాలజీలో దేశంలో మిగిలిన రాష్ట్రాల కంటే ముందుండే కర్ణాటకలో మరో వినూత్న ప్రాజెక్టు ప్రారంభం కానుంది. మొబైల్ ఫోన్ల ద్వారా పౌరులు ప్రభుత్వ సేవలు పొందడమే ఈ పథకం ప్రధానోద్దేశం. ఈ ప్రాజెక్టును ప్రారంభించడానికి ఎప్పుడో సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరులో ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘యూనిఫైడ్ మొబైల్ గవర్నెన్స్ ప్లాట్‌ఫాం’ అనే ఈ ప్రాజెక్టుపై సిబ్బంది వ్యవహారాలు, పాలనా సంస్కరణల శాఖ దాదాపు ఏడాదిగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మొబైల్ ఫోన్ల ద్వారా అందుతున్న ప్రభుత్వ సేవల కంటే ఈ ప్లాట్‌ఫాం భిన్నమైనది. అవన్నీ ఇంటర్నెట్ ఇంటర్ఫేస్ ఆధారంగా పని చేస్తున్నాయి. కొత్త సిస్టంలో మొబైల్ ఫోన్ అప్లికేషన్ ద్వారా ప్రభుత్వ సేవలను పొందవచ్చు. ఈ నెల 24న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రారంభోత్సవం కలకాలం గుర్తుండిపోయేలా చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదాహరణకు అధికారిక ఆహ్వాన పత్రికల్లో ఆడియో చిప్స్‌ను అమర్చడం ద్వారా అతిథులు వాటిని తెరవగానే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుభాకాంక్షలు తెలిపే సందేశం వినిపిస్తుంది. పుష్, పుల్, పేమెంట్, డేటా కాప్చూర్ అనే నాలుగు మొబైల్-గవర్నెన్స్ సేవలు ఈ ప్లాట్‌ఫాం ద్వారా రాష్ట్ర పౌరులకు అందనున్నాయి. పుష్ సేవల కింద వివిధ ప్రభుత్వ శాఖలు పంపే ఎస్ఎంఎస్లు పౌరులకు అందుతాయి. ఇందులో దరఖాస్తులకు రసీదులు, దరఖాస్తుల స్థితిగతులపై సమాచారం, ట్రాఫిక్ అప్రమత్తత తదితరాలుంటాయి. పుల్ సేవల కింద ప్రభుత్వ సమాచారాన్ని పొందవచ్చు. దీని ద్వారా బస్సు వేళలు, నిర్దుష్ట ప్రదేశాల్లో భూముల మార్గదర్శక విలువలను తెలుసుకోవచ్చు. టెండర్లకు సంబంధించిన సమాచారాన్ని కాంట్రాక్టర్లు పొందవచ్చు. పేమెంట్ సేవల కింద కరెంటు, నీటి బిల్లులు, ఆస్తి పన్ను, ట్రాఫిక్ జరిమానాలను చెల్లించవచ్చు. డేటా కాప్చూర్ సేవలు పాలనాపరమైనవి. గవర్నమెంట్ టు గవర్నమెంట్ అప్లికేషన్ల ద్వారా ఈ సేవలను వినియోగించుకుంటారు. -
మీసేవలో ఫస్ట్
దరఖాస్తులు పరిష్కరించడంలో జిల్లా ముందంజ సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పౌర సేవలు ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘మీసేవ’ సేవల్లో ఆదిలాబాద్ జిల్లా తెలంగాణలోనే మొదటి స్థానంలో నిలిచిం ది. వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల జారీ, ఇతర అన్ని సేవలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులు పరిష్కరించి నిర్ణీత వ్యవధిలో ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంలో ఇతర జిల్లాలతో పోల్చితే ఆదిలాబాద్ జిల్లా ముందంజలో ఉంది. ఆ యా సేవలకు సంబంధించి కాలపరిమితి దాటినా దరఖాస్తులను పరిష్కరించడంలో జాప్యం చేస్తున్న జిల్లాల్లో రంగారెడ్డి మొదటి స్థానంలో ఉండగా, ఆదిలాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ప్రస్తుతానికి తె లంగాణలోని పది జిల్లాల్లో 1.71లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 52,025 దరఖాస్తులు గడువు దాటినా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇలా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కేవలం 4,550 దరఖాస్తులే ఉన్నాయని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. 163 కేంద్రాలు.. 280 సేవలు.. జిల్లా వ్యాప్తంగా 163 మీసేవ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, మున్సిపల్, పౌర సరఫరాల, పోలీసు, ఆర్టీఏ, ఎన్పీడీసీఎల్, విద్య, ఎన్నికల సంఘం, మున్సిపల్, ఆధార్, ఇండస్ట్రీస్, కార్మిక శాఖ, సోషల్ వెల్ఫేర్, కో-ఆపరేటీవ్ వంటి ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సేవలను అందిస్తున్నారు. ఆదాయ, కుల వంటి ధ్రువీకరణ పత్రాలతోపాటు, భూములకు సంబంధించిన సర్టిఫికేట్లు జారీ వంటి సేవలతో పాటు, విద్యుత్, నీటి బిల్లులు, ఆస్తి పన్ను, టెలిఫోన్, ఆర్టీఏ బిల్లుల వసూలు వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మీసేవ ద్వారా 342 రకాల సేవలు అందిస్తుండగా, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సుమారు 280 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. 18.20 లక్షలకు పైగా దరఖాస్తులు.. మీసేవ కేంద్రాల ద్వారా అందించే సేవలను ఏ,బీ కేటగిరీలు గా విభజించారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే జారీ చేసే ధ్రువీకరణ పత్రాలు ఏ కేటగిరీ పరిధిలోకి రాగా, నిర్ణీత కాలపరిమితిలో జారీ చేసే ధ్రువీకరణ పత్రాలు, ఇతర సేవలు బీ-కేటగిరీ పరిధిలోకి వస్తాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వర కు మీసేవ కేంద్రాలకు మొత్తం 18.20 లక్షల దరఖాస్తులు వ చ్చాయి. ఇందులో 7.90 లక్షల దరఖాస్తులు ఏ-కేటగిరీకి సం బంధించినవి రాగా, బీ- కేటగిరీకి సంబంధించి 10.30 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 9.57 లక్షల దరఖాస్తులను అప్రూవల్ చేయగా, 52,612 దరఖాస్తులను తిరస్కరించారు. -
ఇక ఈ-పంచాయతీ
పంచాయతీల్లో పారదర్శక పౌరసేవలు అందనున్నాయి. గ్రామ సచివాలయాలు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోనున్నాయి. ప్రపంచంలోని ఏ మూలనుంచైనా జిల్లాలోని గ్రామాల సమగ్ర సమాచారాన్ని తెలుసుకునే అవకాశం అతిత్వరలో రానుంది. పది రోజుల్లో జిల్లాలో మొదటి విడత కింద ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల్లో ఈ-పంచాయతీ అమలుకానుంది. ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఇక పారదర్శక పౌరసేవలు అందనున్నాయి. ఈ-పంచాయతీ వ్యవస్థకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలో 1028 పంచాయతీలు ఉన్నాయి. రెండు, మూడు పంచాయతీలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. అలా మొత్తం పంచాయతీలను 568 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. వీటిలో బిల్లింగ్, విద్యుత్ సౌకర్యం ఉన్న పంచాయతీలను గుర్తించారు. మొదటి విడతగా 279 క్లస్టర్లలో ఈ-పంచాయతీ వ్యవస్థ అమలు చేసేందుకు కార్వే డేటా మేనేజ్మెంట్ అనే కంపెనీ అన్ని సిద్ధం చేసింది. ప్రతి క్లస్టర్‌కు ఒక కంప్యూటర్ మంజూరు చేశారు. రెండు క్లస్టర్లకు కలిపి ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించారు. ప్రతి మండల అభివృద్ధి కార్యాలయంలో ఒక కంప్యూటర్ను ఏర్పాటు చేశారు. జిల్లాలోని మూడు డివిజన్లకు మూడు కంప్యూటర్లను డీఎల్పీఓల పరిధిలో ఏర్పాటయ్యాయి. జిల్లా పరిషత్తు సీఈఓ పరిధిలో మరో రెండు కంప్యూటర్లు, జిల్లా పంచాయతీ అధికారికి రెండు కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. 143 మంది కంప్యూటర్ ఆపరేటర్లకు ఈ-పంచాయతీపై ఏప్రిల్ 12, 13, 14 తేదీల్లో ఒంగోలు సమీపంలోని ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కళాశాలలో శిక్షణ ఇచ్చినట్లు కార్వే డేటా కంపెనీ జిల్లా కో-ఆర్డినేటర్ పి.బ్రహ్మంరాజు తెలిపారు. కంప్యూటర్ ఆపరేటర్ ఒక క్లస్టర్ పరిధిలో మూడు రోజులు, ఇంకొక క్లస్టర్ పరిధిలో మరో మూడు రోజులు పనిచేస్తారని వివరించారు. క్షేత్ర స్థాయిలో కంప్యూటర్లకు ఆన్లైన్ సమస్యలు వస్తే పరిష్కరించడానికి జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌గా టి.జ్యోతి, ఏడీపీఎంగా ఎస్కే ఫరూక్‌ను కార్వే కంపెనీ నియమించింది. ఈ-పంచాయతీ ద్వారా ఏమి చేస్తారంటే.. ఈ-పంచాయతీ ద్వారా గ్రామ స్థాయిలో ప్రజలకు అన్ని సేవలు అందనున్నాయి. జనన ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. గ్రామ జనాభా వివరాలు తెలుస్తాయి. పురుషులు, స్త్రీలు ఎంతమందో వివరంగా పొందుపరుస్తారు. పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులు, వాటి ఖర్చు వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. గ్రామ సభల వివరాలు, పన్నుల వివరాలు అన్ని పొందుపరుస్తారు. గ్రామానికి సంబంధించిన వివరాలు అన్నీ ఆన్లైన్లో ప్రత్యక్షమవుతాయి. ఎక్కడినుంచైనా ఆన్లైన్ ద్వారా ఆయా పంచాయతీల సమాచారం తెలుసుకోవచ్చు. మొదటి విడత అనంతరం రెండో విడత ప్రక్రియను అమలు చేస్తారని జిల్లా పంచాయతీ అధికారి కె.శ్రీదేవి తెలిపారు. మొత్తం వ్యవహారాన్ని కార్వే కంపెనీ చూస్తోందని పేర్కొన్నారు. ఈ-పంచాయతీ ఏర్పాటు పూర్తయిన తరువాత వీటిపై మా పర్యవేక్షణ ఉంటుందని ఆమె వివరించారు. పదిరోజుల్లో పూర్తి స్థాయిలో ఎంపిక చేసిన పంచాయతీల్లో ఈ-పంచాయతీ అమలుకానుంది. -
'ప్రజా సేవలన్నీ ప్రజల ముందుకే'