మెట్రో రైలుకు చేతులు ఊపుతూ స్వాగతం పలుకుతున్న ప్రజలు
సాక్షి, హైదరాబాద్: లాంఛనంగా ప్రారంభమైన మెట్రో రైలు బుధవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్యన నాగోల్–అమీర్‌పేట్ (17 కి.మీ.), మియాపూర్–అమీర్‌పేట్ (13 కి.మీ.) రూట్లో మెట్రో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. తొలిమూడు నెలల పాటు రైళ్ల పనివేళల్లో ఎలాంటి మార్పులుండవని మెట్రో అధికారులు తెలిపారు. ఈ రెండు మార్గాల్లో పదిచొప్పున సుమారు 20 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ప్రతి పదిహేను నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. ఒక్కో రైలుకు మూడు బోగీలుంటాయి. ఒక్కో బోగీలో సుమారు 40 మందికి కూర్చునే అవకాశం ఉంటుంది. అయితే ప్రయాణికుల రద్దీని బట్టి రైళ్ల ట్రిప్పుల సంఖ్య పెరిగే లేదా తగ్గే అవకాశాలున్నాయి. ఈ రెండు మార్గాల్లో నిత్యం సుమారు 3 లక్షల మంది రాకపోకలు సాగిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా మెట్రో జర్నీ చేసేందుకు స్మార్ట్‌కార్డు, టోకెన్, టికెట్‌లు కొనుగోలు చేసి ప్రయాణించాల్సి ఉంటుంది. ఒక స్మార్ట్‌కార్డుతో ఒక్కరే ప్రయాణించాలి. ఒక్కోసారి మీ వెంట పలువురు ప్రయాణికులు ఉన్నప్పుడు టోకెన్ లేదా టికెట్‌లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. స్మార్ట్‌కార్డుల కొనుగోలుకు ఎస్.ఆర్.నగర్, నాగోల్, ప్రకాశ్‌నగర్ స్టేషన్ల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మెట్రో ప్రయాణించే రెండు మార్గాల్లో మొత్తం 24 స్టేషన్లున్నాయి.
చార్జీలివే....
మెట్రో కనీస చార్జీ రూ.10 కాగా.. గరిష్టంగా రూ.60 వరకు ఉంటుంది. నాగోల్–అమీర్‌పేట్ వరకు ప్రయాణిస్తే రూ.45 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక మియాపూర్–అమీర్‌పేట్ మార్గంలో ప్రయాణిస్తే రూ.40 చార్జీ చెల్లించాలి. ఒకేసారి నాగోల్‌లో రూ.60 చెల్లించి టికెట్ కొనుగోలు చేస్తే మియాపూర్ వరకు ప్రయాణిం చవచ్చు. అయితే మధ్యలో అమీర్‌పేట్ ఇంటర్ చేంజ్ స్టేషన్ వద్ద దిగి మరో రైలును ఎక్కాల్సి ఉంటుంది.
మియాపూర్ బైక్‌స్టేషన్‌లో త్వరలో రిజిస్ట్రేషన్లు..
మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద హైదరాబాద్ బైసైకిలింగ్ క్లబ్ ఏర్పాటుచేసిన సైకిల్‌స్టేషన్ వ ద్ద 25 స్మార్ట్ సైకిళ్లను సిద్ధం చేశారు. వీటిని అద్దెకు తీసుకునేందుకు ఒకటి రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు అధికారులు తెలిపారు. పంజాగుట్ట మెట్రో మాల్‌ను డిసెం బర్ తొలివారంలో ప్రారంభిం చనున్నారు.
స్టేషన్ల వద్ద పార్కింగ్ పరేషాన్..
మియాపూర్, నాగోల్ మెట్రో డిపోలతోపాటు సికిం ద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ సమీపంలోని పా త జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మాత్రమే ఇప్పటి వరకు పార్కింగ్ కేంద్రాలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో మిగతా స్టేషన్లకు వ్యక్తిగత బైక్‌లు, కార్లలో తరలివచ్చిన వారికి పార్కింగ్ తిప్పలు తప్పవు.
20–25 నిమిషాల్లో జర్నీ...
నాగోల్ నుంచి మెట్రోలో బయలుదేరిన వ్యక్తి 17 కి.మీ. దూరంలో ఉన్న అమీర్‌పేట్‌కు కేవలం 25 నిమిషాల్లో చేరుకోవచ్చు. అదే బస్సు లేదా కారు లేదా బైక్‌పై అయితే 50 నుంచి 60 నిమిషాలు పడుతుంది. ఈ మార్గంలో మొత్తం 14 స్టేషన్లున్నాయి. ప్రతీ స్టేషన్‌లో రైలు 20 సెకన్లపాటు నిలుపుతారు. పరేడ్‌గ్రౌండ్స్, అమీర్‌పేట్ ఇంటర్ చేంజ్ స్టేషన్లలో 30 సెకన్లపాటు రైలు ఆగుతుంది. ఇక మియాపూర్–అమీర్‌పేట్ మార్గాన్ని 20 నిమిషాల్లో మెట్రో జర్నీలో చేరుకోవచ్చు. ఈ రూట్లో మొత్తం 10 స్టేషన్లున్నాయి. ఈ రూట్లోనూ బస్సు లేదా కార్ లేదా బైక్‌పై ప్రయాణిస్తే 50–60 నిమిషాల సమయం పడుతుంది.
మన మెట్రో ప్రత్యేకతలు..
⇒ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ (ప్రయివేటు పబ్లిక్ పార్టనర్‌షిప్) ప్రాజెక్టు
⇒దేశంలోనే నిర్మితమైన అతి పెద్ద మెట్రో వ్యవస్థ
⇒దేశంలోనే మొట్టమొదటి సారిగా ఒకేసారి అందుబాటులోకి 30 కిలోమీటర్ల నెట్‌వర్క్
⇒ఎయిర్ కండీషన్డ్ సౌకర్యంతో ఆహ్లాదకరమైన, వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణం
⇒అధునాతన కోచ్‌లు
⇒ఐజీబీసీ(ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్) గుర్తింపు
⇒వినియోగదారులకు పూర్తి అనుకూలమైన 24 స్టేషన్లు
⇒దేశంలోనే అతిపెద్ద ఎలివేటెడ్ స్టేషన్‌గా అమీర్‌పేట
⇒ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మెషీన్స్(ఏటీవీఎం).
⇒ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ ద్వారా స్టేషన్‌ల వద్ద క్లిష్టత లేని ప్రవేశం మరియు నిష్క్రమణ
⇒కాలుష్య రహిత, పర్యావరణ అనుకూలమైన ప్రయాణం – కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతో పాటుగా ఇంధన వినియోగం, కాలుష్యం కూడా తగ్గిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment