కలల రైలు కదులుతోంది | Narendra Modi to inaugurate Hyderabad Metro Rail today | Sakshi
Sakshi News home page

కలల రైలు కదులుతోంది

Published Tue, Nov 28 2017 2:45 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

Narendra Modi to inaugurate Hyderabad Metro Rail today - Sakshi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కలల రైలు పట్టాలెక్కనుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మంగళవారం మెట్రో రైలు లాంఛనంగా ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని అక్కడ్నుంచి హెలికాప్టర్‌లో నేరుగా మియాపూర్‌ మెట్రో డిపోకు చేరుకుంటారు. అక్కడ ప్రత్యేకంగా మెట్రో పైలాన్, మెట్రో జర్నీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘టి–సవారీ’ మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం మెట్రో రైలు ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి మియాపూర్‌ డిపో నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కూకట్‌పల్లి వరకు మెట్రోలో ప్రయాణిస్తారు. తిరిగి మియాపూర్‌ మెట్రో డిపోకు చేరుకొని అక్కడ్నుంచి హెలికాప్టర్‌లో హైటెక్స్‌లో జరగనున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్‌)లో పాల్గొనేందుకు వెళ్తారు. సుమారు 45 నిమిషాల పాటు ప్రధాని మెట్రో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.

భద్రతా కారణాల రీత్యా మియాపూర్‌ మెట్రో డిపో ఆవరణలో బహిరంగ సభ, మీడియా సమావేశాన్ని రద్దు చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో మియాపూర్‌ మెట్రో డిపో, స్టేషన్‌ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాష్ట్ర పోలీసులతోపాటు ఎస్పీజీ బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. తీరైన పూల మొక్కలు.. అందమైన టైల్స్‌తో ఫుట్‌పాత్‌లను తీర్చిదిద్దారు. కార్పెట్‌ గ్రాస్‌ సహా సుమారు పదెకరాల విస్తీర్ణంలో పచ్చదనంతో వీక్షకులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేశారు. పాదచారులు, వాహనదారులకు ప్రత్యేక మార్గాలతోపాటు బస్‌లు, ఆటోలు, క్యాబ్‌లు నిలిపేందుకు వేరే మార్గాలు ఏర్పాటు చేశారు. తొలివిడతగా మియాపూర్‌ స్టేషన్‌ వద్ద 25 సైకిళ్లతో సైకిల్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు.  

దేశంలోనే అతి పెద్ద మెట్రో
దేశంలో ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, కోచి తదితర మెట్రో నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులున్నాయి. అయితే ఆయా నగరాల్లో తొలి విడతగా 5, 10 కిలోమీటర్లు మాత్రమే రైళ్లు పట్టాలెక్కాయి. దేశరాజధాని ఢిల్లీలో మాత్రం తొలిసారి 18 కి.మీ మార్గంలో రైళ్లను ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నాగోల్‌–అమీర్‌పేట్‌ (17కి.మీ), మియాపూర్‌–అమీర్‌పేట్‌(13 కి.మీ) మొత్తంగా 30 కి.మీ. మార్గంలో మెట్రో రైళ్లను పట్టాలెక్కించనున్నారు. ఈ మార్గాల్లో మొత్తం 24 స్టేషన్లున్నాయి. ఒక్కో మార్గంలో ప్రతి 10–15 నిమిషాలకు ఓ రైలు అందుబాటులో ఉంటుంది. మెట్రో రైలులో ప్రయాణించేందుకు స్మార్ట్‌కార్డు నెబ్యులా, టికెట్, టోకెన్‌లను ప్రవేశపెట్టారు.

ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ
ప్రపంచంలోనే పబ్లిక్‌–ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిన నిర్మిస్తున్న అతిపెద్ద మెట్రో ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. సుమారు రూ.16,830 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రాజెక్టుకు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ఇప్పటివరకు రూ.13 వేల కోట్లు ఖర్చు చేసింది. మిగతా మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దశల వారీగా ఆస్తుల సేకరణ, మెట్రో కారిడార్ల సుందరీకరణ వంటి పనులకు వ్యయం చేశాయి. ఎల్‌అండ్‌టీ సంస్థ చేసిన వ్యయాన్ని రాబోయే 45 ఏళ్లలో పలు ప్రాంతాల్లో ప్రభుత్వం కేటాయించిన 269 ఎకరాల స్థలాల్లో వాణిజ్య స్థలాలు, మాల్స్‌ అభివృద్ధి చేయడం, రవాణా ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మెట్రో ప్రాజెక్టుకు ప్రయాణికుల చార్జీల ద్వారా కేవలం 50 శాతం ఆదాయమే సమకూరుతుంది. మరో 45 శాతం మాల్స్, రియాల్టీ ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా.. మరో 5 శాతం వాణిజ్య ప్రకటనల ద్వారా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. తొలి ఆరేళ్ల పాటు నిర్మాణ సంస్థకు నష్టాల బాట తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు. ఏడో సంవత్సరం నుంచి లాభాల బాట పట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.

టీ–సవారీ ప్రత్యేకత ఇదీ..
ప్రధాని ప్రారంభించనున్న టీ–సవారీ మొబైల్‌ యాప్‌ మెట్రో ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉండనుంది. దీని ద్వారా మెట్రో రైళ్లలో ప్రయాణించే వారు తాము ఎన్ని నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు? మెట్రో స్టేషన్‌ నుంచి సమీప కాలనీలకు బస్సు, ఆటో లేదా క్యాబ్‌లో ఎన్ని నిమిషాల్లో చేరుకోవచ్చు? ఇందుకు అయ్యే వ్యయం ఎంత అన్న వివరాలను తెలుసుకోవచ్చు.

పలు స్టేషన్ల వద్ద అసంపూర్తిగా పనులు
మియాపూర్‌ నుంచి కూకట్‌పల్లి వరకు మెట్రోలో ప్రధాని ప్రయాణిస్తారని ప్రకటించినా పలు స్టేషన్‌ల వద్ద మాత్రం పనులను పూర్తి చేయడంలో అధికారులు విఫలమయ్యారు. జేఎన్‌టీయూహెచ్‌ స్టేషన్‌ వద్ద రోడ్డుకు ఇరువైపులా పనులు నత్తనడకన సాగుతున్నాయి. స్టేషన్‌కు ఇరువైపులా జాతీయ రహదారిని అనుసంధానిస్తూ ఏర్పాటు చేసిన సర్వీస్‌ రోడ్లపై తూతూ మంత్రంగా తారు పోసి మమ అనిపించారు. అలాగే స్టేషన్‌ కింది భాగంలో మెట్లు, లిప్ట్‌ల వద్దకు వచ్చిన ప్రయాణికులు వాహనాల్లో ఎక్కి వెళ్లేందుకు ఫ్లోరింగ్‌పై టైల్స్‌ను ఏర్పాటు చేసే పనులు పూర్తి కాలేదు. రోడ్ల విస్తరణ కోసం తవ్విన మట్టి కుప్పలను కూడా తరలించలేదు. అవన్నీ రోడ్ల పక్కనే కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. మెట్రో స్టేషన్‌లను ఆనుకొని ఉన్న బస్‌స్టాప్‌ల దుస్థితి వర్ణనాతీతంగా ఉంది. వసంతనగర్‌ కాలనీ ప్రహరీగోడను ఆనుకొని ఉన్న బస్‌స్టాప్‌లలో ప్రయాణికులు కూర్చునే కుర్చీలను కూడా తొలగించారు. ఇక్కడి బస్టాప్‌ల ముందు నుంచి సర్వీస్‌ రోడ్లను ఏర్పాటు చేయడంతో మట్టిని తవ్వి బస్టాప్‌లలో పోశారు. బస్‌స్టాప్‌లలో మట్టిని తొలగించకపోవడంతో ప్రయాణికులు రోడ్లపైనే నిలబడి బస్సులెక్కాల్సిన దుస్థితి నెలకొంది.

మెట్రో ప్రాజెక్టు ప్రస్థానమిదీ..
– గ్రేటర్‌లో మెట్రో ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం: 16,830 కోట్లు (ఇందులో రూ.13,693 కోట్లు ఎల్‌అండ్‌టీ, రాష్ట్ర ప్రభుత్వం రూ.2,179 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ.958 కోట్లు వ్యయం చేస్తున్నాయి)
– మొత్తం మెట్రో పిల్లర్లు:2,800
– మెట్రో పనివేళలు: ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటలు (మూడునెలలు), ఆ తర్వాత ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 11 గంటలు
– మెట్రో కారిడార్లు: నాగోల్‌–రాయదుర్గం(28 కి.మీ), ఎల్బీనగర్‌–మియాపూర్‌(29 కి.మీ), జేబీఎస్‌–ఫలక్‌నుమా(15 కి.మీ) మొత్తం మూడు కారిడార్లలో 72 కి.మీ. మార్గంలో ప్రాజెక్టును 2012లో చేపట్టారు. ప్రస్తుతం పాతనగరంలో 6 కి.మీ మినహా 66 కి.మీ. మార్గంలో పనులు తుదిదశకు చేరుకున్నాయి.
– 2018 చివరి నాటికి మూడు కారిడార్లలో 66 కి.మీ. మెట్రో మార్గం పూర్తి కానుంది.
– నేడు ప్రారంభం కానున్న మెట్రో మార్గాలు: నాగోల్‌–అమీర్‌పేట్‌(17 కి.మీ) మియాపూర్‌–అమీర్‌పేట్‌(13 కి.మీ)
– మెట్రో చార్జీలు: కనీసం రూ.10, గరిష్టం రూ.60  
– తొలిదశ మార్గాల్లో ప్రయాణించే రైళ్లు: 20
– మొత్తం మూడు కారిడార్లలో రాకపోకలు సాగించే మెట్రో రైళ్ల సంఖ్య: 57
– ఒక్కో రైలులో బోగీల సంఖ్య: మూడు. ఒక్కో బోగీలో 330 మంది ప్రయాణించే అవకాశం. మొత్తంగా ఒక ట్రిప్పులో 990–1000 మంది ప్రయాణించవచ్చు. ప్రతి రైలులో ఒక బోగీని మహిళలకు కేటాయించే అవకాశం ఉంది.
– మూడు కారిడార్లలో మొత్తం స్టేషన్లు: 64
– పార్కింగ్‌ స్టేషన్లు: 34 స్టేషన్ల వద్దనే పార్కింగ్‌ స్థలాలు అందుబాటులో ఉన్నాయి.

సమయం ఆదా ఇలా..
మియాపూర్‌–అమీర్‌పేట్‌(13 కి.మీ) మార్గంలో ప్రతి 10–15 నిమిషాలకొకటి చొప్పున మొత్తం 10 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ మార్గంలో పది స్టేషన్లున్నాయి. ప్రతి స్టేషన్‌లో 30 సెకన్లపాటు రైలు నిలుపుతారు. మియాపూర్‌లో మెట్రో రైలులో బయలుదేరిన వ్యక్తి అమీర్‌పేట్‌కు 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. అదే బస్‌లో 50 నిమిషాలు, బైక్‌పై 40 నిమిషాల సమయం పడుతుందని అంచనా.

అమీర్‌పేట్‌–నాగోల్‌(17 కి.మీ): ఈ మార్గంలో ప్రతి 10–15 నిమిషాలకొక రైలు చొప్పున నిత్యం 10 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ రూట్లో 14 స్టేషన్లున్నాయి. ప్రయాణికుల డిమాండ్‌ బట్టి ట్రిప్పుల సంఖ్య పెరుగుతుంది. అమీర్‌పేట్‌లో మెట్రోలో బయలుదేరే వ్యక్తి నాగోల్‌కు 25 నిమిషాల్లో చేరుకోవచ్చు. అదే బైక్‌పై అయితే 50 నిమిషాలు, బస్సులో అయితే 75 నిమిషాల సమయం పడుతుంది.

మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్‌ ఇలా: మొత్తం 64 స్టేషన్లలో 34 చోట్ల దశలవారీగా పార్కింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు.
తొలిదశ మెట్రో రూట్లలో పార్కింగ్‌ సదుపాయాలు: మియాపూర్‌ మెట్రో డిపో, నాగోల్‌ మెట్రో డిపో, రసూల్‌పురా, సికింద్రాబాద్‌ పాత జీహెచ్‌ఎంసీ కార్యాలయం, అమీర్‌పేట్‌ ఛాలిస్‌ మకాన్‌.

ప్రధాని పర్యటన మినిట్‌ టు మినిట్‌
సమయం                        కార్యక్రమం
మధ్యాహ్నం 1.10 గం        ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి రాక                
మధ్యాహ్నం 1.45             ఎంఐ హెలికాప్టర్‌–17లో మియాపూర్‌కు పయనం
మధ్యాహ్నం 2.05             మియాపూర్‌ మెట్రో డిపోకు రాక
మధ్యాహ్నం 2.15             మెట్రో పైలాన్‌ ఆవిష్కరణ, ఫోటో ఎగ్జిబిషన్, మెట్రో రైలులో పయనం.
మధ్యాహ్నం 2.50             మియాపూర్‌ నుంచి హైటెక్స్‌కు పయనం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement