మెట్రో అలైన్మెంటు మార్చాలన్నాం: కేసీఆర్
మెట్రో రైలు అలైన్మెంటును మూడు చోట్ల మార్చాలని సూచించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మెట్రోలైన్ మార్పుపై ఆయన సచివాలయంలో సమీక్షించారు. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు. చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, ముస్లింల ప్రార్థనా మందిరాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా మెట్రోపనులు పూర్తిచేస్తామని కేసీఆర్ చెప్పారు.
బడిచౌడి నుంచి ఉమెన్స్ కాలేజి వెనక నుంచి ఇమ్లిమన్కు చేరే విధంగా మెట్రో రైలును మారుస్తున్నామన్నారు. అసెంబ్లీ, సుల్తాన్ బజార్ వద్ద కూడా మెట్రోలైన్లలో మార్పులు ఉంటాయని తెలిపారు. పాతబస్తీలో ప్రస్తుతం ఉన్న అలైన్మెంటును మార్చి నివాసగృహాలు, దేవాలయాలకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. ఈ సమావేశంలో, పాతబస్తీ అలైన్మెంటు మార్పుపై ప్రతిపాదనలతో కూడిన లేఖను అక్బరుద్దీన్ ఒవైసీ సీఎం కేసీఆర్కు అందించారు.