మెట్రో ఎలైన్మెంటు మారుతోంది!
మెట్రోరైలు ఎలైన్మెంటును మూడుచోట్ల మార్చేందుకు ఎల్అండ్టీ అంగీకారం తెలిపింది. మెట్రోరైలు పురోగతి, పనులు, ఎలైన్మెంటు తదితర విషయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్తో ఎల్అండ్టీ మెట్రోరైల్ సీఎండీ వీబీ గాడ్గిల్ శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. మొజాంజాహీ మార్కెట్, అసెంబ్లీ ప్రాంతాల్లో అలైన్మెంటు మార్చేందుకు అంగీకరించారు. అసెంబ్లీ ముందునుంచి వెళ్లే మార్గాన్ని వెనకనుంచి తీసుకెళ్లాలని కేసీఆర్ సూచించారు.
అలాగే సుల్తాన్ బజార్ మీదుగా కాకుండా ఉమెన్స్ కాలేజి వెనక నుంచి మూసీ, కాలాపత్తర్ మీదుగా లైన్ వేయాలన్నారు. పాతబస్తీలోని చారిత్రక స్థలాలకు ఇబ్బంది కలగకుండా మెట్రోరైలు మార్గం వేయాలని తెలిపారు. అలైన్మెంటు మార్చడం వల్ల అయ్యే అదనపు ఖర్చును భరించేందుకు తెలంగాణ సర్కారు ముందుకొచ్చింది. అలాగే, మొత్తం మెట్రోరైలు మార్గాన్ని కూడా 72 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్లకు పెంచడానికి కూడా ఎల్అండ్టీ అంగీకరించింది. ఎల్అండ్టీకి ఇచ్చిన భూములను వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈనెల 20వ తేదీన మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.