ప్రధాని చేతుల మీదుగా ఐటీఎంఎస్‌! | PM Modi to start Hyderabad ITEMS along with Metro | Sakshi
Sakshi News home page

ప్రధాని చేతుల మీదుగా ఐటీఎంఎస్‌!

Published Sat, Sep 9 2017 3:05 AM | Last Updated on Tue, Sep 4 2018 3:39 PM

ప్రధాని చేతుల మీదుగా ఐటీఎంఎస్‌! - Sakshi

ప్రధాని చేతుల మీదుగా ఐటీఎంఎస్‌!

► నవంబర్‌ 28న ‘మెట్రో’తో పాటు ప్రారంభింపజేయాలని యోచన

సాక్షి, హైదరాబాద్‌: ట్రాఫిక్‌ ఉల్లంఘనులను కట్టడి చేయడం.. స్వైర ‘విహారం’చేసే నేరగాళ్లకు చెక్‌ పెట్టడం.. వాహనాల సగటు వేగాన్ని పెంచి, ట్రాఫిక్‌ జామ్‌లు లేకుండా చేయడం.. వంటి లక్ష్యాలతో ఏర్పాటవుతున్న అత్యాధునిక వ్యవస్థ ‘ఇంటెలిజెంట్‌ అండ్‌ ఇంటిగ్రేటెడ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (ఐటీఎంఎస్‌)’అతి త్వరలో అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం చూపే ఈ వ్యవస్థను నవంబర్‌ 28న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు.

ఆ రోజున హైదరాబాద్‌లో ఓ సదస్సుకు హాజరవుతున్న మోదీ చేతుల మీదుగా మెట్రో రైలును ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పనిలో పనిగా ఐటీఎంఎస్‌ను కూడా ప్రారంభింపజేయాలని యోచిస్తున్నారు. ఈ మేరకు పనులను అక్టోబర్‌ 31 నాటికి పూర్తిచేసి, ట్రయల్‌ రన్‌ నిర్వహిం చాలని.. లోటుపాట్లేమైనా ఉంటే అధికారిక ప్రారంభం నాటికి సరిచేయాలని నిర్ణయించారు.

రూ.100 కోట్ల వ్యయంతో..
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరిం చడంతోపాటు ఉల్లంఘనులను నియంత్రించే లక్ష్యంతో రూ.100 కోట్లతో ఐటీఎంఎస్‌ను చేపట్టారు. దీనిని తొలిదశలో నగరంలోని 250 జంక్షన్లలో ఏర్పాటు చేస్తున్నారు. ఇది పూర్త యితే ట్రాఫిక్‌ నిర్వహణ, పరిశీలన మొత్తం కమిషనరేట్‌ కేంద్రంగా పనిచేసే ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (టీ–సీసీసీ) నుంచే జరుగుతుంది. రాత్రివేళల్లోనూ పనిచేసే 16 మెగాపిక్సెల్‌ సామర్థ్యమున్న కెమెరాలను ఈ వ్యవస్థలో ఉపయోగిస్తున్నారు. ఈ స్థాయి పరికరాలు ఉపయోగించడం దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం.

‘ప్లేటు’మారితే పట్టేస్తుంది!
నేరగాళ్లు, ఉల్లంఘనులు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి తమ వాహనాలకు ఇతర వాహనాల నంబర్లను పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఐటీఎంఎస్‌ వ్యవస్థలోని ‘ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రీడింగ్‌ సిస్టం (ఏఎన్‌పీఆర్‌)’అలా ఒకే నంబర్‌తో తిరిగే 2 వేర్వేరు వాహ నాలను గుర్తిస్తుంది. ఆ వాహనం ప్రయాణించే ముందు జంక్షన్లలో ఉన్న క్షేత్రస్థాయి పోలీసులకు సమాచారం అందించి అప్రమత్తం చేస్తుంది.
ట్రాకింగ్‌ కూడా..: ఐటీఎంఎస్‌ వ్యవస్థ ద్వారా నగరవ్యాప్తంగా సంచరించే వాహ నాలను ట్రాక్‌ చేయవచ్చు. సీసీ కెమెరాలు ఆయా ప్రాంతాల్లో సంచరించే ప్రతి వాహ నాన్ని నంబర్‌తో సహా చిత్రీకరించి సర్వర్‌లో నిక్షిప్తం చేస్తాయి. తద్వారా మొత్తం వీడియో దృశ్యాలన్నీ చూడాల్సిన అవసరం లేకుండా... కేవలం నంబర్‌ను నమోదు చేయడం ద్వారా నేరుగా ఆ వాహనం ప్రయాణించిన/తిరిగిన ప్రదేశాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు.

‘ఆగిపోతే’అప్రమత్తం చేస్తుంది..
కీలక, ఇరుకైన ప్రాంతాల్లో వాహ నాలేవైనా మరమ్మతులకు వచ్చి నిలిచి పోతే (బ్రేక్‌డౌన్‌ అయితే).. ఆ వాహ నాలను గుర్తించి అధికారులకు సమాచార మిచ్చేందుకు ఐటీఎంఎస్‌లోని ‘ఇన్సిడెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (ఐఎంఎస్‌)’ తోడ్పడుతుంది. తద్వారా తగిన సహాయం అందించడంతోపాటు ట్రాఫిక్‌ను నియం త్రించే అవకాశం ఉంటుంది.

ఆగాల్సిన పనిలేకుండా..
రద్దీ వేళల్లో ట్రాఫిక్‌ జామ్‌ల కంటే రెడ్‌ సిగ్నల్స్‌తో ఇబ్బంది ఎక్కువ. ప్రతి జంక్షన్‌లోనూ ఆగుతూ వెళ్లాల్సి వస్తుంది. ఈ పరిస్థితిని నివా రించేందుకు అన్ని జంక్షన్లను అనుసం ధానించి.. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను సింక్రనైజ్‌ చేస్తారు. దీనివల్ల ఏదైనా జంక్షన్‌లో రెడ్‌ సిగ్నల్‌తో ఆగిన వాహనాలు.. తర్వాతి జంక్షన్‌లో నేరుగా ముందుకు కదిలేలా సిగ్నల్స్‌ మారుతుంటాయి.

అత్యవసర వాహనాలకు ‘గ్రీన్‌ చానల్‌’..
అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని ఆస్పత్రులకు తరలించే అంబులెన్సులు తరచూ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతుంటాయి. ఇక వీవీఐపీలకు ట్రాఫిక్‌ జామ్‌ సమస్య లేకుండా ట్రాఫిక్‌ను నియంత్రించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో పనికివచ్చే ప్రత్యేక పరికరాలను అందుబాటులోకి తెస్తున్నారు. వీటిని ఆయా అంబులెన్సులు, వీవీఐపీల వాహనాలకు అమర్చుతారు. ఆ వాహనాలు ఏదైనా జంక్షన్‌కు 200 మీటర్ల సమీపంలోకి రాగానే వారి మార్గానికి అనుగుణంగా గ్రీన్‌ సిగ్నల్‌ పడుతుంది.

‘వీఎంఎస్‌’లతో నిరంతరం సందేశాలు
ఏదైనా మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులకు ముందున్న చౌరస్తా, రహదారిలో ట్రాఫిక్‌ స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలిపేలా ‘వేరియబుల్‌ మెసేజ్‌ సైన్‌బోర్డులు (వీఎంఎస్‌)’ను ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్‌ తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ మార్గాలనూ దానిలో సూచిస్తారు. ఇక కీలక ప్రాంతాల్లో ‘ఎమర్జెన్సీ కాల్‌ బాక్స్‌ (ఈసీబీ)’లను ఏర్పాటు చేస్తారు. అత్యవసర సమయాల్లో వాటి ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు, సహాయం కోరవచ్చు.

ఉల్లంఘనులకు చెక్‌
వాహనచోదకుల్లో క్రమశిక్షణ పెంచడంతో పాటు ఉల్లంఘనులను కట్టడి చేయడానికి ఐటీఎంఎస్‌ తోడ్పడుతుంది. ఈ వ్యవస్థలోని కెమెరాలు వాటంతట అవే ఆయా ఉల్లంఘనుల వాహనాలను ఫొటో తీస్తాయి. సర్వర్‌ ఆధారంగా ఈ–చలాన్‌ సైతం ఆటోమేటిగ్గా ఆ వాహనచోదకుడి చిరునామాకు చేరిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement