మెట్రో ప్రారంభం కన్ఫర్మ్.. మోదీకి ఇన్విటేషన్!
సాక్షి, హైదరాబాద్: నగరవాసులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మెట్రోరైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. నాగోలు నుంచి మియాపూర్ వరకు 30 కిలోమీటర్ల పరిధిలో నవంబర్ నెల నుంచి మెట్రోరైలు పరుగులు తీయనుంది. ఈ మేరకు నవంబర్ 28న మెట్రో రైలు ప్రారంభానికి విచ్చేయాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం లేఖ రాశారు. ఈ లేఖను ఐటీ, మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ గురువారం ట్వీట్ చేశారు.
మెట్రోరైలును ప్రారంభించాల్సిందిగా 25-5-2017న వ్యక్తిగతంగా ప్రధాని మోదీని ఆహ్వానించిన విషయాన్ని ఈ లేఖలో గుర్తుచేసిన సీఎం కేసీఆర్.. నవంబర్‌లో ఇందుకోసం రావాలని ఈ లేఖలో కోరారు. రూ. 15,000 కోట్ల వ్యయంతో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో అతిపెద్ద ప్రాజెక్టుగా.. హైదరాబాద్ మెట్రోరైలును ప్రతిష్టాత్మకంగా చేపట్టామని లేఖలో పేర్కొన్నారు.
నవంబర్ 28 నుంచి 30వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరిగే గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సదస్సును ప్రారంభించడానికి ఇప్పటికే ప్రధాని ఒప్పుకున్న నేపథ్యంలో ఇదే పర్యటనలో భాగంగా మెట్రోరైలును కూడా ప్రారంభించాలని సీఎం కేసీఆర్ మోదీని కోరారు.
Hon'ble CM's letter to Hon'ble PM Sri @narendramodi Ji to inaugurate 30KM stretch of Hyderabad Metro from Nagole to Miyapur on 28th Nov,2017 pic.twitter.com/jM4uRcRA94
— KTR (@KTRTRS) 7 September 2017