మియాపూర్ నుంచి కూకట్‌పల్లికి పరుగులు తీస్తున్న మెట్రో రైలు
భాగ్యనగర కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. నగర రవాణా రంగంలో నవశకం ఆరంభ మైంది. మహానగరానికి మెట్రోరైలు కొత్త సింగారాలద్దింది! అత్యాధునిక పరిజ్ఞానంతోపాటు ఎన్నో ప్రత్యే కతలు సంతరించుకున్న హైదరాబాద్ మెట్రో రైలును మంగళవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో కలసి మెట్రోను ప్రారంభించారు. మధ్యాహ్నం 2.13 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో మియాపూర్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్న ప్రధాని అక్కడ్నుంచి ప్రత్యేక వాహనంలో మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. గవర్నర్, సీఎంతో కలసి సరిగ్గా 2.21 గంటలకు మెట్రో పైలాన్, శిలాఫలకాలను రిమోట్ సాయంతో ఆవిష్కరించారు. అనంతరం మొదటి అంతస్తుకు వెళ్లి రిబ్బన్‌ను కట్ చేసి మెట్రో స్టేషన్‌ను ప్రారంభించారు. అక్కడ మెట్రోరైలు ప్రాజెక్టు ప్రత్యేకతలపై భారీ స్క్రీన్‌పై ఏర్పాటు చేసిన లఘుచిత్రాన్ని తిలకించారు. తర్వాత రెండో అంతస్తులోని ప్లాట్‌ఫామ్ వద్దకు వెళ్లి మెట్రో రైలు ఎక్కారు. 2.29 గంటలకు బయల్దేరిన రైలు కూకట్‌పల్లి స్టేషన్ వరకు వెళ్లి మళ్లీ 2.40 గంటలకు మియాపూర్ స్టేషన్‌కు చేరుకుంది. తర్వాత అక్కడ్నుంచి ఎస్కలేటర్ ద్వారా కిందకు వచ్చిన ప్రధాని, గవర్నర్, సీఎం నేరుగా హెలిప్యాడ్ వద్దకు వెళ్లారు. హెలికాప్టర్ల ద్వారా 2.50 గంటలకు ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) జరిగే హెచ్‌ఐసీసీకి బయల్దేరి వెళ్లారు. మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మొత్తంగా 40 నిమిషాలపాటు గడిపారు. ఈ సందర్భంగా మెట్రో రైలు బ్రోచర్, టీ సఫారీ మొబైల్ యాప్‌లను కూడా ప్రారంభించారు. మెట్రో రైలు లోకో పైలట్‌గా మహిళ ఉండటం విశేషం.
– సాక్షి, హైదరాబాద్
ప్రధాని.. సీటు బెల్టు..
మెట్రో రైలు ప్రారంభించిన తర్వాత పక్కనే ఉన్న హెలిప్యాడ్ వద్దకు వెళ్లేందుకు ప్రధాని కారు ఎక్కారు. ఈ సందర్భంగా తక్కువ దూరమే అయినా ప్రధాని సీటు బెల్టు పెట్టుకోవడం గమనార్హం. ఇటీవల ఓ కార్యక్రమంలో చేతులు తుడుచుకున్న నాప్కిన్‌ను బయటపడేయకుండా ప్రధాని తన జేబులో వేసుకున్న దృశ్యం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైన సంగతి తెలిసిందే. మెట్రో ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.
కేటీఆర్ ఎక్కడ?
మెట్రో రైలు ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఉత్సాహంగా కనిపిం చారు. పైలాన్ ఆవిష్కరణ తర్వాత మెట్రో స్టేషన్ ప్రారంభించే సమయంలో ఆయన.. మంత్రి కేటీఆర్ గురించి ప్రత్యేకంగా అడిగారు. రిబ్బన్ కట్ చేయబోతూ కేటీఆర్ ఎక్కడ అంటూ చుట్టూ పరికించారు. వెనుక వైపు ఉన్నారని సీఎం కేసీఆర్ చెప్పడంతో.. ‘సంబంధిత మంత్రి ముందు లేకపోతే ఎలా’ అంటూ తన పక్కకు రమ్మని పిలిచారు. ఆయన వచ్చాకే రిబ్బన్ కత్తిరించారు. రైలు ఎక్కిన తర్వాత మధ్యలో ప్రధాని కూర్చోగా ఆయనకు కుడివైపు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ కూర్చున్నారు. ఎడమ వైపు కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కూర్చున్నారు. ప్రయాణిస్తున్నంతసేపు ప్రధాని.. కేటీఆర్‌తో మాట్లాడుతూ కని పించారు. బయటకు చూస్తూ భవనాలపై నిలబడి తిలకిస్తున్న ప్రజలకు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. వారికి ఎదుటి వరుసలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి, ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు ఎండీ శివానంద్ నింబార్గీ, సీఎస్ ఎస్పీసింగ్ కూర్చున్నారు. ప్రధాని వారినీ కొన్ని విషయాలపై ప్రశ్నించారు.
అరెరె.. తలసాని..
మూడు బోగీలతో మెట్రో రైలు సిద్ధంగా ఉంది. ఓ బోగీలోకి ప్రధాని, సీఎం, గవర్నర్ ఎక్కారు. మరో ద్వారం గుండా మంత్రి కేటీఆర్ ఎక్కారు. ఇంతలో రైల్లోంచి మంత్రి తలసాని కిందకు దిగారు. వెంటనే రైలు బయల్దేరేందుకు సిద్ధమైంది. దీంతో దిగిన మార్గం నుంచే తలుపులు మూసుకునే చివరి క్షణంలో మంత్రి తలసాని హడావుడిగా ఎక్కి ఊపిరి పీల్చుకున్నారు.
విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీ లేదా?
ఆరా తీసిన ప్రధానమంత్రి
మెట్రో రైలును ప్రారంభించి అందులో ప్రయాణించిన సమయంలో ప్రధాని పలు అంశాలపై వాకబు చేసి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం మెట్రో తొలి దశ కొనసాగుతోందని, త్వరలో రెండో దశ ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ చెబుతూ.. దానికి హైదరాబాద్ విమానాశ్రయాన్ని అనుసంధానిస్తామని చెప్పారు. దీంతో ‘మరిప్పుడు ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ లేదా...అనుసంధానించండి అది చాలా అవసరం’ అని మోదీ అన్నారు. గుజరాత్ సబర్మతి నదిని శుద్ధి చేసిన తరహాలోనే హైదరాబాద్ మధ్య నుంచి పారుతున్న మూసీని కూడా శుద్ధి చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. కలుషితమైన నదులను శుద్ధి చేయటం చాలా అవసరమని, ఉన్నవాటిని కలుషితం కాకుండా చూడాలని మోదీ పేర్కొన్నారు. మంచి లక్ష్యంతో సాగుతున్నారంటూ అభినందించారు. గాంధీనగర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం బాండ్లు జారీ చేసినట్టుగా హైదరాబాద్ అభివృద్ధి విషయంలోనూ అదే పంథాను అనుసరిస్తున్నామని, రూ.వేయి కోట్ల విలువైన బాండ్లు జారీ చేస్తున్నట్టు కేటీఆర్ వివరించగా.. మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రధాని స్పందించారు. మెట్రో రైలు కారిడార్‌ను చూసేందుకు లోకో పైలట్ క్యాబిన్ వైపు వస్తే బాగుంటుందని మెట్రో రైలు ప్రతినిధులు పేర్కొనగా.. ‘నేను దేశాన్ని నడుపుతున్నాను. మెట్రో రైలు నడిపే గది వద్దకు వెళ్లి చూడ్డం అవసరమా..’ అని నవ్వుతూ సరదాగా వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment