
మొబైల్‌లో ప్రభుత్వ సేవలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : టెక్నాలజీలో దేశంలో మిగిలిన రాష్ట్రాల కంటే ముందుండే కర్ణాటకలో మరో వినూత్న ప్రాజెక్టు ప్రారంభం కానుంది. మొబైల్ ఫోన్ల ద్వారా పౌరులు ప్రభుత్వ సేవలు పొందడమే ఈ పథకం ప్రధానోద్దేశం. ఈ ప్రాజెక్టును ప్రారంభించడానికి ఎప్పుడో సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరులో ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
‘యూనిఫైడ్ మొబైల్ గవర్నెన్స్ ప్లాట్‌ఫాం’ అనే ఈ ప్రాజెక్టుపై సిబ్బంది వ్యవహారాలు, పాలనా సంస్కరణల శాఖ దాదాపు ఏడాదిగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మొబైల్ ఫోన్ల ద్వారా అందుతున్న ప్రభుత్వ సేవల కంటే ఈ ప్లాట్‌ఫాం భిన్నమైనది. అవన్నీ ఇంటర్‌నెట్ ఇంటర్‌ఫేస్ ఆధారంగా పని చేస్తున్నాయి. కొత్త సిస్టంలో మొబైల్ ఫోన్ అప్లికేషన్ ద్వారా ప్రభుత్వ సేవలను పొందవచ్చు. ఈ నెల 24న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ ప్రారంభోత్సవం కలకాలం గుర్తుండిపోయేలా చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదాహరణకు అధికారిక ఆహ్వాన పత్రికల్లో ఆడియో చిప్స్‌ను అమర్చడం ద్వారా అతిథులు వాటిని తెరవగానే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుభాకాంక్షలు తెలిపే సందేశం వినిపిస్తుంది. పుష్, పుల్, పేమెంట్, డేటా కాప్చూర్ అనే నాలుగు మొబైల్-గవర్నెన్స్ సేవలు ఈ ప్లాట్‌ఫాం ద్వారా రాష్ట్ర పౌరులకు అందనున్నాయి. పుష్ సేవల కింద వివిధ ప్రభుత్వ శాఖలు పంపే ఎస్‌ఎంఎస్‌లు పౌరులకు అందుతాయి.
ఇందులో దరఖాస్తులకు రసీదులు, దరఖాస్తుల స్థితిగతులపై సమాచారం, ట్రాఫిక్ అప్రమత్తత తదితరాలుంటాయి. పుల్ సేవల కింద ప్రభుత్వ సమాచారాన్ని పొందవచ్చు. దీని ద్వారా బస్సు వేళలు, నిర్దుష్ట ప్రదేశాల్లో భూముల మార్గదర్శక విలువలను తెలుసుకోవచ్చు. టెండర్లకు సంబంధించిన సమాచారాన్ని కాంట్రాక్టర్లు పొందవచ్చు. పేమెంట్ సేవల కింద కరెంటు, నీటి బిల్లులు, ఆస్తి పన్ను, ట్రాఫిక్ జరిమానాలను చెల్లించవచ్చు. డేటా కాప్చూర్ సేవలు పాలనాపరమైనవి. గవర్నమెంట్ టు గవర్నమెంట్ అప్లికేషన్ల ద్వారా ఈ సేవలను వినియోగించుకుంటారు.