
రూ. 2,700 కోట్లకు గేమ్స్, యాప్స్ మార్కెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో మొబైల్ గేమ్స్, అప్లికేషన్ల మార్కెట్ 2016 నాటికి రూ.2,700 కోట్లకు చేరుకుంటుందని అవెండస్ క్యాపిటల్ అంచనా వేస్తోంది. పెయిడ్ యాప్స్ ఒక్కటే రూ.2 వేల కోట్లు కైవసం చేసుకుంటుందని తెలిపింది. స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలతోపాటు 3జీ వాడకం బారీగా పెరగడమే ఇందుకు కారణమని అవెండస్ నివేదిక వెల్లడించింది.
స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ ఏడాది 6.7 కోట్లకు, 2016 నాటికి 38.2 కోట్లకు చేరతారని వివరించింది. అలాగే 3జీ యూజర్ల సంఖ్య 2013లో 5.6 కోట్లు, వచ్చే మూడేళ్లలో 26.6 కోట్లు ఉండబోతోందని తెలిపింది. పెయిడ్ యాప్స్ మార్కెట్ పరిమాణం 2012లో దేశంలో రూ.300 కోట్లుగా అంచనా. ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ఫీచర్ ఫోన్లు సైతం గేమ్స్, యాప్స్ వినియోగం పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య ఈ ఏడాది మార్చినాటికి 3.6 కోట్లు మాత్రమే. అయితే ఇంటర్నెట్ సపోర్ట్ చేసే మొబైల్ ఫోన్ల సంఖ్య 43.1 కోట్లుండడం విశేషం.