చదువు మూరెడు.. నెట్ బారెడు!
* కాలేజీ చదువులకన్నా ఇంటర్నెట్‌కే ప్రాధాన్యం
* చాటింగ్, గేమ్స్‌కు 10 వేల గంటలు..పుస్తక పఠనానికి 5 వేల గంటలే
* తాజా అధ్యయనంలో విస్తుగొలిపే గణాంకాలు
* ఆవహిస్తున్న మానసిక రుగ్మతలు: మానసిక వైద్యులు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసిన ఇంటర్నెట్ విప్లవం అంతులేని ప్రయోజనాలతోపాటు భయంకరమైన దుష్ర్పభావాలనూ మోసుకొస్తోంది. విభిన్న రూపాలు సంతరించుకున్న డిజిటల్ మాధ్యమం ప్రజల జీవితాలను శాసించే స్థాయికి చేరుతోంది. ఇంటర్నెట్ సహా సకల సదుపాయాలున్న స్మార్ట్‌ఫోన్ల ప్రవేశం ప్రజలు ప్రత్యేకించి విద్యార్థులను పూనకంలా ఆవహిస్తోంది. జీవితాలను నిలబెట్టే చదువుకన్నా విద్యార్థులు ఎక్కువ ప్రాధాన్యం ఇంటర్నెట్ ఆధారిత సేవలకు ఇచ్చేలా వారిని ‘నెట్’లోకంలో విహరింపజేస్తోంది. దీంతో విద్యార్థులు వాస్తవ ప్రపంచానికి దూరమవుతున్నారు.
దేశంలో 2000 సంవత్సరంలో 50 లక్షల మంది ఇంటర్నెట్ వినియోగదారులుండగా 2014 నాటికి ఆ సంఖ్య 23.40 కోట్లకు చేరుకుంది. ఒక సర్వే ప్రకారం ఒక విద్యార్థి తన కాలేజీ జీవితంలో సరాసరి 10 వేల గంటలకు తక్కువ కాకుండా కంప్యూటర్లు, మొబైల్స్‌ల్లో వీడియో గేమ్స్, చాటింగ్‌కు సమయం కేటాయిస్తుంటే... పుస్తకాలు చదవడానికి కేవలం 5 వేల గంటలు కూడా కేటాయించడంలేదట. ఈ పరిణామం యువతలో తీవ్రమైన మానసిక రుగ్మతలు కలిగించే ప్రమాదం ఉందని మానసిక వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఎందరో ఇటువంటి వ్యాధులతో సతమతం అవుతున్నారని చెబుతున్నారు.
శారీరక శ్రమకు దూరం...
విద్యార్థులు శారీరక శ్రమ లేకుండా స్మార్ట్‌ఫోన్లలో వినోదానికే పరిమితం అవుతుండటంతో మానసిక అలసటకు గురవుతున్నారు. దీంతో జీవితం రోజురోజుకూ సోమరితనంగా మారుతోంది. దీని ప్రభావం వారి మానసిక స్థితిపై పడుతోంది. పిల్లల జీవితాలు కంప్యూటర్లు, వీడియో గేమ్స్, డిజిటల్ మ్యూజిక్ ప్లేయర్స్, సెల్‌ఫోన్లు వాటి ద్వారా మెసేజ్‌లు, ఫొటోలు, చాటింగ్‌లకే పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది. దీనివల్ల వారి వాస్తవ జీవితం ప్రమాదంలో పడుతోంది. దేశంలోని పట్టణ జనాభాలో 60% మంది ఇంటర్నెట్ లేకుండా జీవితాన్ని గడపడంలేదని, అందులో సగం మంది రోజుకు 4 గంటల వరకు ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారని, 19% మంది వారానికి తమ కుటుంబంతో గడిపే కాలం కంటే ఎక్కువ భాగం ఇంటర్నెట్‌కే అతుక్కుపోతున్నారని తాజా గణాంకాలు చెబుతుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
హింసాత్మక ధోరణులు...
స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఉచితంగా వీడియోగేమ్స్, 3డీ గేమ్స్ వంటివి డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం రావడంతో పిల్లలు వాటికి బానిసలు అవుతున్నారు. హింసాత్మక ధోరణిలో ఉంటున్న వీడియో గేమ్స్ కారణంగా యువతీ యువకుల్లో దూకుడు భావనలు, దూకుడు మనస్తత్వం, హింసాత్మక ఆలోచనలు పెరిగిపోతున్నాయి. రోజుకు 2 నుంచి 7 గంటలపాటు వీడియో గేమ్స్ ఆడేవారిలో ఒక రకమైన మానసిక రుగ్మతలు ఏర్పడుతున్నాయి. సామాజిక వెబ్‌సైట్లు మానసిక రుగ్మతలకు వేదికలుగా మారుతున్నాయి. అసూయ, ఆశ, నిరాశ, ఆత్మన్యూనత వంటివి తెలియకుండానే ప్రభావం చూపుతున్నాయి. అయితే యువతను ఇటువంటి వాటికి దూరంగా ఉంచేలా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని మానసిక వైద్యులు చెబుతున్నారు.
మానసిక రుగ్మతలు...
దేశంలో 6 వేల మంది ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ వినియోగదారులపై ఒక సర్వే చేయగా 80% మంది ఇంటర్నెట్, మొబైల్స్ కారణంగా నిద్రలేమి, సరైన వేళకు భోజనం చేయకపోవడం, ఉద్యోగం, వ్యాపార వ్యవహారాల్లో సమయపాలన పాటించకపోవడం తదితర అంశాల్లో విఫలం అవుతున్నారని తేలింది. దీనివల్ల మానసిక రుగ్మతలతోపాటు అసిడిటీ, స్థూలకా యం వంటి అనారోగ్యాలకు గురవుతున్నారు. 13% మంది విద్య, వృత్తి సామర్థ్యాల్లో వెనుకబడుతున్నారు. 2% మంది ప్రతికూల పరిస్థితుల్లోకి (పిచ్చివారుగా) మారుతున్నారు. కొందరు తాగుడుకు బానిసలవుతున్నారు. 25% మంది వరకు యువతీ యువకులు పూర్తిగా ఇంటర్నెట్‌కు బానిసలైపోయారు. మానసిక ఒత్తిడికి, రుగ్మతలకు గురవుతున్నారు. శారీరకంగా జబ్బులకు గురవుతున్నారు.