గాదె కింద పందికొక్కులు..! | Corruption in Ration Rice Supply Prakasam | Sakshi
Sakshi News home page

గాదె కింద పందికొక్కులు..!

Published Tue, Mar 12 2019 12:26 PM | Last Updated on Tue, Mar 12 2019 12:26 PM

Corruption in Ration Rice Supply Prakasam - Sakshi

పౌర సరఫరాల శాఖలో అవినీతికి అంతేలేకుండా పోయింది. తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా ఎవరికి వారు అందినకాడికి దండుకున్నారు. అక్రమాలను నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూశారు. నాలుగున్నర ఏళ్ల కాలంలో పేదల నోటికాడి ముద్ద తినేశారు. రూ. లక్షలు కాదు. దండుకుంది రూ.కోట్లలోనే. నెలనెలా రూ.20 కోట్ల వరకు సబ్సిడీ దుర్వినియోగం జరిగింది. రికార్డుల్లో అన్నీ లెక్కలు పక్కాగా చూపించినా క్షేత్ర స్థాయిలో బియ్యం దొంగలదే రాజ్యం. వీరు చేసిందంతా వీరభోజ్యం. సబ్సిడీ సరుకుల పంపిణీ పేరుతో పౌర సరఫరాలతో ప్రమేయం ఉన్న వారు తమ జేబులు దండిగా నింపుకున్నారు. అయినా ఇదేమి అన్యామని ప్రశ్నించిన నాథుడే లేరు.

ఒంగోలు సిటీ:  జిల్లాలో 2,142 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 9,89,306 తెల్లకార్డులు ఉన్నాయి. నాలుగున్నర ఏళ్ల కాలంలో 7.41 లక్షల టన్నుల బియ్యం, 24 వేల టన్నుల చక్కెర, 36 వేల కిలో లీటర్ల కిరోసిన్, ఏడు వేల టన్నుల కందిపప్పు, మూడు వేల టన్నుల సజ్జలు, అయిదు వేల టన్నుల రాగులు పంపిణీ చేశారు. దీనికి గాను ప్రభుత్వం జిల్లాలో రూ.2,569 కోట్లు ఖర్చు చేసింది. నెలనెలా సబ్సిడీలో రూ.కోట్ల కొద్దీ దుర్వినియోగం జరిగింది. చంద్రన్న రంజాన్‌ కాను కింద 72,927 కార్డుదారులకు ఒక్కొరికి రూ.290 విలువ కలిగిన నాలుగు రకాల సరుకులను పంపిణీ చేశారు. రూ.6.34 కోట్లు ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి కానుకల ద్వారా 9,45,520 కార్డుదారులకు రూ.240 విలువ కలిగిన ఆరు రకాల సరుకులను పంపిణీ చేశారు. దీనికి గాను ప్రభుత్వం రూ.68.07 కోట్లు ఖర్చు పెట్టినట్లుగా చూపించారు. ఇంత పెద్ద వ్యవస్థను సబ్సిడీ దొంగలు పెద్ద పెద్ద మొత్తాల్లోనే దోచేశారు.

నామమాత్రంగానే కేసులు..
జిల్లాలో పౌర సరఫరాల ద్వారా పెద్ద ఎత్తున సబ్సిడీ దుర్వినియోగం జరిగింది. సబ్సిడీ మొత్తాన్ని వివిధ స్థాయిల్లోని అధికారులు వాటాలు వేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పౌర సరఫరాల్లో జరుగుతున్న అవినీతి తంతును నిరోధించే వారే కరవయ్యారు. పై స్ధాయి అధికారులకు అన్నీ తెలిసినా మిన్నకుండిపోయారన్న విమర్శలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా దాడులు నామమాత్రంగానే జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లా స్ధాయిలో అధికారులకు  ఈ తతంగం అంతా తెలిసినా వారు పరోక్షంలో ప్రోత్సహించారన్న ఆరోపణలు ఉన్నాయి. రూ.10 లక్షల పైన బియ్యం పట్టుబడిన కేసులు కేవలం ఆరు మాత్రమే ఉండడం గమనార్హం. టీడీపీ నేతల సహకారంతోనే, వారి అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజల సొమ్మును భారీగా కాజేశారన్న విమర్శలు ఉన్నాయి. ఇక కొన్నైనా కేసులు నమోదు చేయాలి కాబట్టి అందు కోసంగా 6–ఎ కేసులను మొక్కుబడిగా తెరిచారు. ఏడాదికి సుమారుగా 150కి మించి ఈ కేసులు కూడా లేకపోవడం గమనార్హం. మండల స్ధాయి గోదాముల్లో భారీగా బియ్యం నిల్వల్లో తేడాలు ఉన్నాయి. నిత్యావసర సరుకులు భారీగా తేడాలు ఉన్నాయి.అయినా వీటిపై నిఘా లేదు. ఏళ్ల తరబడి ఈ విభాగంలోనే పనిచేసిన ఒకరిద్దరు అధికారులు ఇటీవలే పదవీవిరమణ చేశారు. ఒకరిద్దరిపై దుర్వినియోగం కేసులున్నా వాటిని టీడీపీ నేతల సిఫార్సుతో మాఫీ చేయించుకోగలిగారు. ఇంత జరుగుతున్నా ఈ అక్రమాన్ని నిరోధించే వారే లేకపోవడం ధారుణం అని ముక్కున వేలేసుకుంటున్నారు.

జనం సొమ్ము బొక్కేసిన బియ్యం  దొంగలు
జిల్లా వ్యాప్తంగా పౌరసరఫరాల్లో సబ్సిడీని భారీగా బొక్కేశారు. వేల టన్నుల బియ్యాన్ని పక్కదారి పట్టించారు. రూ. కోట్ల కొద్ది సబ్సిడి పక్కదారి పట్టింది. ఈ శాఖలో పని చేస్తున్న అధికారి ఒకరికి మిల్లర్లు, కొందరు అక్రమార్కులైన డీలర్లతో సంబంధాలు ఉన్నాయి. పొరబాటున రాత్రి వేళ బియ్యం అక్రమంగా ఎత్తుతున్నారన్న సమాచారాన్ని పౌరులు జిల్లా అధికారులకు ఇస్తే వారి నుంచి దిగువ స్ధాయికి వచ్చే ఆదేశాలను అనుసరించి ఆకస్మికంగా దాడులు చేయడానికన్నా దొంగలకే ముందుగా సమాచారాన్ని ఇవ్వడం. దొంగలను  కాపాడడం వంటివి ఇక్కడ సర్వసాధారణమే. ఇలా జిల్లా వ్యాప్తంగా బియ్యం దొంగల కొమ్ము కాశారనే ఆరోపణలను కొందరు అధికారులు మూటగట్టుకున్నారు. కాకినాడ పోర్టుకు వేలాది టన్నుల బియ్యం తరలింది. ఇక్కడి నుంచి బియ్యం పాలిష్‌ పట్టి నెలనెలా వందలాది క్వింటాళ్ల బియ్యం తిరిగి మార్కెట్‌లోకి  వచ్చింది.

నెల నెలా మామూళ్లు..
ప్రజల సొమ్ముకు కాపలా ఉండాల్సిన అధికారులు, సిబ్బంది నెలనెలా ఇచ్చే మామూళ్లకు కక్కుర్తి పడుతున్నారు. ఆహార తనిఖీ అధికారులు నెలనెలా రూ.లక్షల్లో సంపాయిస్తున్నారు. లేదంటే వారు డీలర్లను కేసులు పెడతామని బెదిరించి దండిగా మామూళ్లు సంపాయించారు. జిల్లా అధికారులకు ఈ వ్యవహారాలు తెలిసినా వారు నియంత్రించే పరిస్థితి లేకుండా పోయింది. కిలోకి ఎంత లేదన్నా రూ.25 వరకు అక్రమంగా సంపాయిస్తున్నారు. డీలర్లను ఆకస్మికంగా తనిఖీలు చేయడం, వారిపై కేసులు పెడతామని బెదిరించడం వంటి చర్యలతో బెంబేలెత్తి నెల నెలా మామూళ్లు, నజనారాలను ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు సీఎం,మంత్రుల పర్యటనలు ఉంటే వారికి ప్రొటోకాల్‌ పేరుతో రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ డీలర్ల ముక్కు పిండి వసూలు చేస్తుండంతో ఇక వారు అక్రమాలకు తెరతీస్తున్నారు. బహిరంగంగానే ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నా ఎక్కడా నియంత్రణ ఉండడం లేదు.

రూ. కోట్లలో సబ్సిడీ దుర్వినియోగం
నెలనెలా రూ. కోట్ల కొద్ది సబ్సిడీ పక్కదారి పడుతోంది. ఇప్పటి వరకు రూ.2,596 కోట్ల సబ్సిడీని ప్రజలకు అందజేసినట్లుగా లెక్కలు ఉన్నాయి. వీటిలో ఎంతలేదన్నా రూ.వెయ్యి కోట్ల మేర అవినీతి జరిగి ఉంటుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక చంద్రన్న కానుకల్లో 25 శాతం హీనపక్షం అవినీతి చోటు చేసుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఒకటి రెండు సందర్భాల్లో సరుకులు బూజుపట్టి, బెల్లం దెబ్బతిని దిబ్బలో సరులను పారబోసిన పరిస్థితులు ప్రజలకే తారసపడ్డాయి. పౌరసరఫరాల్లో అవినీతి పాతుకు పోయిన నేపథ్యంలో ఈ వ్యవస్థను బాగు చేద్దామనుకున్న లక్ష్మీనరశింహం వంటి అధికారుల వల్ల కాలేదు. ఆయన శక్తి చాలలేదు. ఆయననే బియ్యం దొంగలు పక్కదారి పట్టించారని ఆ రంగంలోని వారే అంటున్నారు. పౌర సరఫరాల్లో నెలనెలా జరుగుతున్న అవినీతి వ్యవహారంపై సరైన విచారణలు లేవు. ఏదైనా విచారణకు అధికారులు ఆదేశిస్తే ఇక టీడీపీ నేతల నుంచి వారిపై వచ్చే ఒత్తిళ్లు అన్నీ ఇన్నీ కావు. దీంతో నిఘా వ్యవస్థ పక్కాగా ఉన్నా వారు నిద్ర నటించడం. వారు కూడా మామూళ్లకు అలవాటు పడే పరిస్థితికి వెళ్లారు. ఇతర శాఖల నుంచి అధికారులు, సిబ్బంది పౌరసరఫరాలకు వస్తున్నారంటే ఇక్కడ అవినీతి బహిరంగం కాబట్టే.. నాలుగు డబ్బులు సంపాయించుకోవచ్చన్న ఆశతో వస్తున్నారు. ఇక్కడ అవినీతిని నిరోధించడం వల్లకాదని అధికార వర్గంలోనే అభిప్రాయాలు నెలకొనడడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement