
సాక్షి, హైదరాబాద్: ఎటువంటి నియామక ప్రక్రియ చేపట్టకుండానే 550 మందిని కళాకారులుగా ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకోవడంపై హైకోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. వారి నియామకాలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయి దా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
కళాకారులుగా 550 మందిని ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా టంగుటూర్‌కు చెందిన జె.రమేశ్, మరో ఇద్దరు పిల్ దాఖలు చేశారు. మంగళవారం దీనిపై విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎలాంటి నియామక ప్రకటన జారీ చేయకుండా, దరఖాస్తులు ఆహ్వానించకుండా నేరుగా 550 మందిని ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకున్నారని పేర్కొన్నారు. 2015లో నియమితులైన వీరికి ఒక్కొక్కరికి రూ.24,514 వేతనంగా చెల్లిస్తున్నారని వివరించారు. కాగా, ప్రభుత్వ న్యాయవాది బీఎస్ ప్రసాద్ బదులిస్తూ వారిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించినట్లు తెలిపారు. దీంతో ఆ 550 మంది ఏ విధులు నిర్వర్తిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది.
Comments
Please login to add a commentAdd a comment