సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 63 నగర పంచాయతీలు, 5 మున్సిపాలిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. గ్రామ పంచాయతీల తీర్మానం లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణతో పనిలేకుండా.. నేరుగా చట్ట సవరణ ద్వారా పురపాలికలను ఏర్పాటు చేసేదిశగా కసరత్తు చేస్తోంది. కొత్త, పాత పురపాలక సంస్థల్లో 350 గ్రామ పంచాయతీలు, ఆవాసాలను విలీనం చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం, రాష్ట్ర మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జీహెచ్‌ఎంసీ చట్టాలను సవరిస్తూ ముసాయిదా బిల్లులు సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే ఈ బిల్లులకు ఆమోదం పొందాలని భావిస్తోంది.
141కి చేరనున్న పురపాలికలు
ప్రభుత్వం నిర్ణయించిన విధంగా 68 కొత్త పురపాలికలు ఏర్పాటైతే.. రాష్ట్రంలో మొత్తం పురపాలికల సంఖ్య 141కి పెరగనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో పట్టణ ప్రాంత జనాభా 1,24,90,739 కాగా.. కొత్త పురపాలికలతో ఈ సంఖ్య 1,46,47,857కు పెరగనుంది. శాతాల వారీగా చూస్తే.. రాష్ట్ర జనాభాలో పట్టణ జనాభా 41 శాతం నుంచి 45 శాతానికి పెరగనుంది.
ఇప్పుడున్న చట్టాలకే సవరణలు!
కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పేర్లతో పాటు ఇప్పటికే ఉన్న మున్సిపాలిటీల్లో విలీనం చేసే గ్రామ పంచాయతీల పేర్లను చేర్చుతూ రాష్ట్ర మున్సిపల్ చట్టాన్ని సవరించనున్నారు. అటు జీహెచ్‌ఎంసీ, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనమయ్యే గ్రామాల పేర్లను ఆయా చట్టాల్లో చేర్చుతూ సవరణలు చేయనున్నారు. సంబంధిత గ్రామ పంచాయతీల ప్రస్తుత పాలక మండళ్ల పదవీకాలం
ముగిసిన వెంటనే.. వాటికి మున్సిపాలిటీ/నగర పంచాయతీ హోదా అమల్లోకి రానుంది.
తీర్మానం, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే..
ప్రస్తుతం అమల్లో ఉన్న పంచాయతీరాజ్, పురపాలక చట్టాల ప్రకారం.. గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీ హోదా కల్పించడం, లేదా ప్రస్తుతమున్న మున్సిపాలిటీలో విలీనం చేయడానికి ముందు ఆయా స్థానిక సంస్థల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మున్సిపాలిటీగా ఏర్పాటు/మున్సిపాలిటీలో విలీనం చేసే అంశంపై సంబంధిత గ్రామ ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరించాలి. ఆ అభ్యంతరాలను పరిష్కరించి రాతపూర్వకంగా సమాధానాలు ఇవ్వాలి. అనంతరం గ్రామసభ నిర్వహించి మున్సిపాలిటీగా ఏర్పాటు/మున్సిపాలిటీలో విలీనాన్ని ఆమోదించాలి.
అప్పుడు సంబంధిత గ్రామానికి పంచాయతీ హోదాను ఉపసంహరిస్తూ.. పంచాయతీరాజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అదే సమయంలో ఆ గ్రామాని మున్సిపాలిటీ హోదా/మున్సిపాలిటీలో విలీనం చేస్తూ పురపాలక శాఖ జీవో జారీ చేస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనలను సరిగ్గా అమలు చేయకుండానే కొత్త పురపాలికల ఏర్పాటుకు ముందుకు వెళ్లడం, దానిపై ప్రజలు హైకోర్టును ఆశ్రయిస్తుండడంతో కొత్త పురపాలికల ఏర్పాటు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ప్రక్రియలేమీ లేకుండా నేరుగా పురపాలికల ఏర్పాటు కోసం ప్రభుత్వం చట్టాల సవరణకు నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment