సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని మున్సిపాలిటీల డీ లిమిటేషన్ అశాస్త్రీయంగా జరిగిందని ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌కుమార్ ఆరోపించారు. మున్సిపాలిటీల పునర్విభజనకు సంబంధించి కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు బుధవారం గాంధీభవన్‌లో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. గత ఐదేళ్ల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పట్టించుకోకుండా మున్సిపాలిటీల పునర్విభజన చేశారని మండిపడ్డారు. 3385 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లలో కూడా అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి వారి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ అధికారులు స్పందించకపోతే వివిధ వేదికల ద్వారా న్యాయం కోసం పోరాడతామని తెలిపారు.
వంశీచంద్ మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశంతోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం వార్డుల విభజన చేసిందని ఆరోపించారు. దీనిపై పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కమిటీ సుదీర్ఘంగా చర్చిందని తెలిపారు. మున్సిపాలిటీల్లోని ప్రజలు వార్డుల పునర్విభజనపై ఏం కోరుకుంటున్నారో ఆ దిశగా పనిచేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత పార్టీకి పూర్వ వైభవం తీసుకోస్తామని ధీమా వ్యక్తం చేశారు. పొన్నం మాట్లాడుతూ.. మున్సిపాలిటీ వార్డులకు సంబంధించిన వినతుల కోసం గుడువును పెంచాలని కోరారు. స్థానిక నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాదమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment