మల్లన్నసాగర్ వెళ్తున్న కాంగ్రెస్ నేతలు అరెస్ట్
హైదరాబాద్ : మల్లన్నసాగర్కు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకుని... అరెస్ట్ చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. తెలంగాణలో నేడు బ్లాక్డే అని పార్టీ నేతలు కె. జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క అభివర్ణించారు. నిరసన తెలిపే హక్కు కూడా లేదా అంటూ వారు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నేతలను గోషామహల్ స్టేడియంకు తరలించారు. ఆ క్రమంలో గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాలు పర్యటనతోపాటు... ముంపు ప్రాంత ప్రజల ఆందోళనలో పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన వారిని పరామర్శించేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు నేడు ఛలో మల్లన్న సాగర్కు పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం గాంధీ భవన్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. మల్లన్నసాగర్ పర్యటనకు వెళ్తున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు నాయకులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకోవడంతోపాటు తోపులాట జరిగింది. దీంతో స్థానికంగా గందరగోళ వాతావరణం నెలకొంది.
కాంగ్రెస్ నేతలు పిలుపు నేపథ్యంలో మెదక్ జిల్లాలో పోలీసులు 12 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. జిల్లాఅంతటా 144వ సెక్షన్ విధించారు. జిల్లాలోని కాంగ్రెస్ నేతలు మల్లన్నసాగర్ ప్రాంతానికి చేరకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే.అరెస్ట్ అయిన వారిలో గండ్ర వెంకటరమణారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు కూడా ఉన్నారు.