
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రజల్లో ఉండి వారిపక్షాన పనిచేసే నాయకులకే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తుంది. పార్టీ నేతలెవరూ హైదరాబాద్‌లో ఉండొద్దు. అలాగని టికెట్ల కోసం ఢిల్లీకి రావొద్దు. స్వతంత్రంగా క్షేత్రస్థాయి నుంచి తీసుకున్న అభిప్రాయం మేరకే టికెట్లు ఇస్తాం’’అని పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌కు డబ్బు, పోలీస్ బలం ఉందిగానీ జనబలం లేదని.. కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా పనిచేస్తే విజయం సాధించగలమని సూచించారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండబోదని, వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య గట్టిపోరు జరుగుతుందని మరోసారి స్పష్టం చేశారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నంగాం ధీభవన్‌లో జరిగిన రాష్ట్ర పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో నేతలకు రాహుల్ దిశానిర్దేశం చేశారు. వరంగల్ డిక్లరేషన్ గురించి విస్తృతంగా చర్చ జరిగేలా ప్రచారం చేయాలని సూచించారు. సమావేశంలో రాహుల్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే పోరాటం
‘‘నిన్న నా ప్రసంగంలో తెలంగాణ స్వప్నం గురించి చెప్పాను. తెలంగాణ ఏర్పాటైనప్పుడు ఈ రాష్ట్రానికి ఒక ఆకాంక్ష ఉంది. కానీ కేసీఆర్ ఆ స్వప్నానికి భంగం కలిగించారు. తెలంగాణను మోసం చేసిన వారితో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పొత్తు ఉండదని ఇప్పటికే స్పష్టం చేశాను. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోరాటం ఉండబోతోంది. కేసీఆర్ తెలంగాణను దోచుకున్నాడు. ఆయనకు డబ్బులకు కొదవలేదు. ప్రభుత్వం ఉంది, పోలీసులున్నారు, అన్ని వ్యవస్థలున్నాయి. కానీ ప్రజలు వారి వెంటలేరు. మనం ప్రజలతో కలిసి మనం ఇచ్చిన రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చుకోవాలి. నియంతృత్వ ప్రభుత్వం కాదు. రైతుల, పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. విద్య, వైద్యం, ఉపాధి రంగాలపై ఫోకస్ పెట్టాలి.
పనిచేస్తేనే ప్రతిఫలం..
పార్టీ టికెట్లు మెరిట్ ప్రతిపాదకనే ఇస్తాం. ఎవరూ భ్రాంతిలో ఉండకండి. తర్వాత నన్ను తప్పుపట్టొద్దు. ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే ప్రజల మధ్య ఉంటారో.. రైతులు, కార్మికులు, చిరు వ్యాపారులు, యువత పక్షాన పోరాటం చేస్తారో వారికే పార్టీ టికెట్ ఇస్తుంది. ఇది మన కుటుంబం. ఎవరి పట్లా వివక్ష ఉండదు. పనిచేస్తేనే ప్రతిఫలం ఉంటుంది. ఎంత సీనియర్ అయినా, ఎంత చరిత్ర ఉన్న నాయకుడైనా సరే పనిచేయకపోతే మాత్రం టికెట్లు రావు. స్వతంత్ర సమాచారం, క్షేత్రస్థాయి సమాచారం తీసుకుని టికెట్లు కేటాయిస్తాం. హైదరాబాద్‌లో ఉంటే టికెట్లు రావు. ఢిల్లీ మాత్రం అసలు రావద్దు. ఢిల్లీ వస్తే బ్యాక్‌ఫైర్ అవుతుంది. హైదరాబాద్‌లో బిర్యానీ బాగుంటుందని, మంచి చాయ్ ఉంటుందని తెలుసు. కానీ వాటిని వదిలిపెట్టి మీ నియోజకవర్గాలకు, గ్రామాలకు వెళ్లండి. మీరు ప్రజల మధ్యలో ఉంటేనే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.
డిక్లరేషన్‌ను జనంలోకి తీసుకెళ్లండి
వరంగల్ డిక్లరేషన్ చరిత్రలో నిలిచిపోతుంది. ఇది కేవలం డిక్లరేషన్ కాదు. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రైతుల మధ్య ఒక విశ్వాసపత్రం. దీనికి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ. తెలంగాణలోని ప్రతి వ్యక్తి, ప్రతి రైతుకు వరంగల్ డిక్లరేషన్‌ను చేరవేయాలి. ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. వచ్చే నెలలో మీ నియోజకవర్గంలో, మీ ప్రాంతంలో డిక్లరేషన్ గురించి పూర్తిస్థాయిలో ప్రచారం చేయాలి.
అందరి అభిప్రాయాలను గౌరవిస్తాం
మనది ఆర్‌ఎస్‌ఎస్ కుటుంబం కాదు. అక్కడ ఒక వ్యక్తే అన్నీ నిర్ణయిస్తాడు. మనది అలాంటి సంస్థ కాదు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలు వినాలని, గౌరవించాలని నేను అనుకుంటున్నాను. కానీ మీడియాలో మాత్రం కాదు. ఒక కుటుంబంలాగా నాలుగు గోడల మధ్య మాట్లాడుకుందాం. పార్టీ అంతర్గత వ్యవస్థకు మీ ఫిర్యాదులు ఎన్నిసార్లయినా చెప్పండి. కానీ మీడియాలో చెప్పడం వల్ల మనకు నష్టం జరుగుతోంది. దీన్ని ఉపేక్షించేది లేదు. వరంగల్ సభ విజయవంతమైంది. కాంగ్రెస్ నేతలంతా తమ శక్తి మేర పనిచేస్తే ఎలా ఉంటుందో నిన్న చూశాం.
యువతకు తలుపులు తెరవండి
రాష్ట్రంలో చాలా మంది యువకులు, నాయకులు కాంగ్రెస్ విధానాలు, సిద్ధాంతాలను గౌరవిస్తారు. వారందరి కోసం పార్టీ తలుపులు తెరిచి ఉంచాలి. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మాతో కలిసి పనిచేయాలని, టీఆర్‌ఎస్, కేసీఆర్‌లకు వ్యతిరేకంగా పోరాడాలని యువతను కోరుతున్నా. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఎలాంటి నష్టం జరిగిందో, ఎలా దోచుకున్నారో అందరికీ తెలుసు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఆస్పత్రులు రాలేదు. కానీ ఒక కుటుంబాని మాత్రం అన్నీ వచ్చాయి. అందుకే టీఆర్‌ఎస్‌ను తెలంగాణ నుంచి తరిమేయడం యువత బాధ్యత. తెలంగాణ యువత కాంగ్రెస్‌లోకి వచ్చి రాష్ట్రంలో మార్పుకోసం కృషి చేయాలని కోరుతున్నా. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు నేను అండగా ఉంటా. నేను ఎక్కడికి రావాలో, ఎప్పుడు రావాలో చెప్తే.. వచ్చి ప్రజల కోసం పనిచేస్తా..’’అని రాహుల్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ కూడా మాట్లాడారు. ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, పొదెం వీరయ్య, సీతక్క, పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అకస్మాత్తుగా అమరవీరుల స్మారక చిహ్నం వద్దకు..
సాయంత్రం 4 గంటల సమయంలో గాంధీభవన్ నుంచి బయలుదేరిన రాహుల్‌గాంధీ.. నేరుగా ట్యాంక్‌బండ్ వద్దకు వెళ్లి అమరవీరుల స్మారక చిహ్నం ప్రాంతాన్ని సందర్శించారు. అమరవీరుల స్మారకం నిర్మాణంలోనూ అవినీతి జరుగుతోందని, దీన్ని నిరూపిస్తానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ స్మారక చిహ్నం నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తర్వాత రాహుల్ నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని.. ఢిల్లీకి బయలుదేరారు. రేవంత్, మాణిక్యం ఠాగూర్ తదితరులు ఎయిర్‌పోర్టులో రాహుల్‌కు వీడ్కోలు పలికారు.
టీవీ చానళ్ల యజమానులతో సమావేశం
శనివారం ఉదయం తాజ్‌కృష్ణ హోటల్‌లో టీవీ చానళ్ల యజమానులు బీఆర్ నాయుడు (టీవీ5), వేమూరి రాధాకృష్ణ (ఏబీఎన్), చలసాని వెంకటేశ్వర్‌రావు (సీవీఆర్), టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌తో రాహుల్ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించారు.
తెలంగాణ ఉద్యమకారులతో సమాలోచనలు
మీడియా యాజమాన్యాలతో సమావేశం అనంతరం తెలంగాణ ఉద్యమకారులు గద్దర్, చెరుకు సుధాకర్, కంచె ఐలయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, పురుషోత్తం తదితరులతో రాహుల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ.. ఉపా చట్టాన్ని రద్దు చేయాలని, అది చాలా ప్రమాదకరమని రాహుల్‌ను కోరారు. తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి సిద్ధమని, ఉద్యమకారులు, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెరుకు సుధాకర్ చెప్పారు. ప్రస్తుత విద్యావిధానంలో మార్పులు తెచ్చే దిశగా కృషి చేయాలని కంచె ఐలయ్య కోరారు.
మాజీ సీఎం సంజీవయ్యకు నివాళి
శనివారం మధ్యాహ్నం సంజీవయ్య పార్కులో మాజీ సీఎం దామోదరం సంజీవయ్య వర్ధంతి కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. టీపీసీసీ నేతలతో కలిసి నివాళులు అర్పించారు.
తెలంగాణ కలలను కేసీఆర్ నాశనం చేశారు
రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ ఆకాంక్షను, తెలంగాణ ప్రజల కలలను సీఎం కేసీఆర్ ఒంటిచేత్తో నాశనం చేశారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్మే తెలంగాణ యువత పార్టీలోకి రావాలి. టీఆర్‌ఎస్‌ను ఓడించి ఉజ్వల తెలంగాణ ఏర్పాటులో భాగస్వాములు కావాలి.
– గాంధీభవన్‌లో తన సమావేశం వీడియోను జతచేస్తూ రాహుల్ ట్వీట్
KCR has single-handedly destroyed the dream the people of Telangana and Sonia ji had when statehood was granted.
— Rahul Gandhi (@RahulGandhi) May 7, 2022
I welcome the youth, who believe in the ideology of the Congress, to join us in our mission to defeat TRS and build a glorious Telangana. pic.twitter.com/9Fd2sKgYU1
Comments
Please login to add a commentAdd a comment