Goshamahal police station
-
దొరికిన బంగారు గొలుసు.. బాధితురాలికి ఇవ్వాలని ఠాణాకు వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో మృతి
హైదరాబాద్: ఆటోలో దొరికిన బంగారు గొలుసును బాధితురాలికి అప్పగించేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఓ నగల వ్యాపారి గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన షాయినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. సౌత్‌వెస్ట్ జోన్ డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, గోషామహల్ ఏసీపీ కోట్ల వెంకట్‌రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. నల్లకుంటకు చెందిన కోర్టు ఉద్యోగిని మేఘన శుక్రవారం ర్యాపిడో ఆటోలో హైకోర్టుకు వెళ్లింది. కోర్టుకు వెళ్లిన తర్వాత మెడలోని బంగారు గొలుసు కనిపించకపోవడంతో తన భర్తకు ఫోన్ చేసి సమాచారం అందించింది. ఆ తర్వాత కొద్ది సేపటికే అదే ఆటోను బుక్ చేసుకున్న వెండి నగల వ్యాపారి గోవింద్రామ్ సోని (70) బేగంబజార్ నుంచి కోఠీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు.. ఈ క్రమంలో అతడికి ఆటోలో పడి ఉన్న బంగారు గొలుసు కనిపించింది. దీంతో ఆటో డ్రైవర్ నునావత్ తరుణ్‌ను వివరాలు అడగడంతో హైకోర్టు వద్ద ఓ మహిళను వదిలిపెట్టి వస్తున్నానని, సదరు గొలుసు ఆమెదే అయి ఉండవచ్చని చెప్పాడు. దీంతో గోవింద్రామ్ సోనీ నేరుగా అదే ఆటోలో షాయినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి గొలుసును పోలీసులకు అప్పగించాడు. ఇంతలోనే బాధితురాలు మేఘన ఆటో డ్రైవర్‌కు ఫోన్ చేసి గొలుసు విషయమై ఆరా తీసింది. సదరు ఆటో డ్రైవర్‌కు ఆమెకు విషయం చెప్పడంతో భర్తతో కలిసి పీఎస్‌కు వచి్చన బాధితురాలికి పోలీసుల సమక్షంలో గోవింద్రామ్ సోనీ బంగారు గొలుసును అప్పగించాడు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే అతను కుప్పకూలి పోవడంతో అప్రమత్తమైన పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గోవింద్రామ్ సోనీ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సహాయం చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచి్చన గోవింద్రామ్ సోనీ గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమని డీసీపీ విచారం వ్యక్తంచేశారు. -
మంటల వెనక మతలబు ఏంటో!
సాక్షి, సిటీబ్యూరో: గోషామహల్‌లోని పోలీస్ స్టేడియం ఆవరణలో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫలితంగా అక్కడ ఉన్న పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాల్లోని 16 ఫోర్ వీలర్లు, 5 ఆటోలు, 37 టూ వీలర్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. నగరంలో ఏటా బోనాలు, గణేష్ ఉత్సవాలు, మొహర్రం ఊరేగింపు జరిగినట్లే గోషామహల్ పోలీసుస్టేడియంలోని వాహనాలు తరచూ అగ్నికి ఆహుతి కావడం పరిపాటిగా మారింది. ఈ పరంపరలో భాగంగానే శుక్రవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఉదంతాలు చోటు చేసుకున్నా రక్షణ చర్యలు లేకపోవడం వెనుక ఆంతర్యం అంతుచిక్కట్లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న, ఎక్కడెక్కడో లభించిన గుర్తుతెలియని వాహనాలను స్థానిక పోలీసులు ఈ గ్రౌండ్‌కు తరలిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వాహనాలు, వాటి శిథిలాల్లో ఈ ప్రాంతం నిండిపోయి ఉంటుంది. సిబ్బంది చేతివాటంపై అనుమానాలు.. నేరాలకు సంబంధించి పోలీసులు స్వాధీనం చేసుకున్న, వారికి లభ్యమైన గుర్తుతెలియని వాహనాలు గోషామహల్ పోలీసు స్టేడియానికి చేరిన కొన్ని రోజుల్లోనే ‘రూపు కోల్పోతున్నాయి’ అనేది జగమెరిగిన సత్యం. దీనికి సరైన నిర్వహణ లేకపోవడం ఒక కారణమైతే.. బాడీ, స్పేర్ పార్ట్స్ ‘మారిపోవడం’ మరో కారణం. ఈ స్టేడియంలోనే వాహనాల్లో ఉండే స్టీరియోలు, సీట్లు, కీలకమైన ఇంజన్ విడిభాగాలతో పాటు వాటి టైర్లూ కూడా మారిపోతుంటాయనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు ‘ఇంటి దొంగలు’ తమ చేతి వాటం ప్రదర్శించి వాహనాలకు ఈ దుస్థితి పట్టిస్తుంటారనేది బహిరంగ రహస్యం. నేరాల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను బాధితులు కోర్టు ద్వారా పొందాల్సి ఉంటుంది. ఇందులో కొంత జాప్యం ఉంటుంది. వీటి కోసం ఎప్పటికైనా ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉంది. ఇక గుర్తుతెలియని వాహనాల విషయానికి వస్తే వీటికి కోసం వచ్చే వారు అరుదు. వీటిని క్యాష్ చేసుకుంటూ కొందరు సిబ్బంది చేతి వాటం ప్రదర్శిస్తుంటారని తెలిసింది. వాహనం వచ్చిన తొలిరోజుల్లో డీజిల్, పెట్రోల్‌లతో ప్రారంభించి కొన్ని రోజులకు స్పేర్స్ కూడా ‘లేపేస్తుంటారు’ అనే ఆరోపణలు ఉన్నాయి. పాఠాలు నేర్పని అనుభవాలు.. ఈ స్టేడియంలో పడి ఉండే వాహనాలకు అవసరమైన ఎలాంటి రక్షణ చర్యలు ఉండవు. కనీసం ఒక పక్కా షెడ్డు కూడా లేదు. అక్కడున్నవి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ పడి ఉండాల్సిందే. మరోపక్క ఇక్కడ గతంలోనూ పలుసార్లు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ వీటికి చెక్ చెప్పేందుకు ఎలాంటి చర్యలూ తీసుకున్న దాఖలాలు లేవు. స్వాధీనం చేసుకున్న వాహనాల్లో పెట్రోల్, డీజిల్‌తో పాటు అగ్నిని ఆకర్షించే అనేక పదార్ధాలు ఉన్నాయని తెలిసినప్పటికీ కనీసం ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఇసుక బక్కెట్లు కూడా ఆ ప్రాంతంలోని సిబ్బంది వద్ద అందుబాటులో ఉండవు. వెరసీ.. గోషామహల్ కేంద్రంగా జరిగే అగ్ని ప్రమాదాల్లో అనునిత్యం అనేక వాహనాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ప్రమాదమా? వ్యూహాత్మకమా? ఈ కారణాల వల్లే ఇక్కడ ఉండే వాహనాలు చాలా వరకు రూపు కోల్పోతాయి. వీటిని రెగ్యులర్ ఆడిటింగ్ లేకపోవడంతో సాధారణ సమయాల్లో ఈ మార్పు చేర్పులు గుర్తించడం సాధ్యం కాదు. ఈ వాహనాలను నిర్ణీత సమయానికి ఒకసారి వేలం పాట నిర్వహించడం ద్వారా విక్రయిస్తుంటారు. యాక్షన్ వేసే సందర్భంలో మాత్రం అక్కడ జరిగిన తారుమారులకు సంబంధించిన వ్యవహారాలన్నీ బయటకు పొక్కే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో గోషామహల్‌లోని వాహనాలను వేలం పాట నిర్వహించే సమయానికి కాస్త అటు ఇటుగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈసారి మాత్రం దానికి భిన్నంగా జరిగిందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయా సమయాల్లోనే అగ్ని ప్రమాదాలు జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతుంటాయి. అవన్నీ వాస్తవంటా ప్రమాదాలా? లేక చేతి వాటం బయటపడకుండా చేసిన వ్యూహాత్మక చర్యలా అనేది తేల్చడానికంటూ ప్రతి సందర్భంలోని విచారణలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇవి కొలిక్కివచ్చిన దాఖలాలు కనిపించట్లేదు. -
మల్లన్నసాగర్ వెళ్తున్న కాంగ్రెస్ నేతలు అరెస్ట్
హైదరాబాద్ : మల్లన్నసాగర్‌కు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకుని... అరెస్ట్ చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. తెలంగాణలో నేడు బ్లాక్‌డే అని పార్టీ నేతలు కె. జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క అభివర్ణించారు. నిరసన తెలిపే హక్కు కూడా లేదా అంటూ వారు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నేతలను గోషామహల్ స్టేడియంకు తరలించారు. ఆ క్రమంలో గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాలు పర్యటనతోపాటు... ముంపు ప్రాంత ప్రజల ఆందోళనలో పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన వారిని పరామర్శించేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు నేడు ఛలో మల్లన్న సాగర్‌కు పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం గాంధీ భవన్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. మల్లన్నసాగర్ పర్యటనకు వెళ్తున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు నాయకులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకోవడంతోపాటు తోపులాట జరిగింది. దీంతో స్థానికంగా గందరగోళ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నేతలు పిలుపు నేపథ్యంలో మెదక్ జిల్లాలో పోలీసులు 12 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. జిల్లాఅంతటా 144వ సెక్షన్ విధించారు. జిల్లాలోని కాంగ్రెస్ నేతలు మల్లన్నసాగర్ ప్రాంతానికి చేరకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే.అరెస్ట్ అయిన వారిలో గండ్ర వెంకటరమణారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు కూడా ఉన్నారు. -
టీ పీసీసీ ర్యాలీ ఉద్రిక్తం
గాంధీభవన్ నుంచి భారీ ర్యాలీగా నేతలు, కార్యకర్తలు సచివాలయం, ఛాతీ ఆస్పత్రి తరలింపు యోచన విరమించుకోవాలని డిమాండ్ ర్యాలీకి అనుమతి లేదంటూ నిలువరించిన పోలీసులు ప్రతిఘటించిన కాంగ్రెస్ కార్యకర్తలు.. ఇరువర్గాల తోపులాట ఘర్షణలో స్వల్పంగా గాయపడిన పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వ చర్య ప్రజాస్వామ్య విరుద్ధం..: జానారెడ్డి నేడు రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో ధర్నాలు సాక్షి, హైదరాబాద్: సచివాలయం మార్పు, ఛాతీ ఆసుపత్రి తరలింపు యోచనను వ్యతిరేకిస్తూ గాంధీభవన్ నుంచి రాజ్‌భవన్‌కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా... కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తీవ్రంగా తోపులాట జరిగింది.. ఈ తోపులాటలో కింద పడిపోయిన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్వల్పంగా గాయపడ్డారు. చివరికి పోలీసులు ఈ ర్యాలీని భగ్నం చేశారు. ఈ ర్యాలీని భగ్నం చేయడాన్ని నిరసిస్తూ సీఎల్పీ నేత జానారెడ్డి గోషా మహల్ పోలీస్ స్టేడియంలో ధర్నా చేయగా... టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ నేతృత్వంలో కార్యకర్తలు రాజ్‌భవన్ ముట్టడికి ప్రయత్నించారు. టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతో పాటు ఆ పార్టీ మాజీ మంత్రులు, సీనియర్ నేతల నేతృత్వంలో కార్యకర్తలు గాంధీభవన్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు. వారు నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు నిలువరించారు. దీంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వారిని ప్రతిఘటించారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య కొంతసేపు తీవ్రంగా తోపులాట జరిగింది. ‘తెలంగాణ సీఎం కేసీఆర్ డౌన్ డౌన్, తుగ్లక్ పాలన చేస్తున్న కేసీఆర్ డౌన్ డౌన్’ అంటూ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అయితే పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల తోపులాటలో పొన్నాల లక్ష్మయ్యతో పాటు పలువురు కార్యకర్తలు స్వల్పంగా గాయపడ్డారు. పొన్నాల చేయి మెలితిరగడంతో పాటు పలు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయనను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఈ ర్యాలీతో దాదాపు గంట పాటు నాంపల్లి రైల్వేస్టేషన్ దగ్గర రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కాంగ్రెస్ నేతలు డి.శ్రీనివాస్, గీతారెడ్డి, దానం నాగేందర్, శ్రీధర్‌బాబు, అంజన్‌కుమార్ యాదవ్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధు యాష్కీ, సిరిసిల్ల రాజయ్య, మర్రి శశిధర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేడియానికి తరలించారు. పోలీసులు ర్యాలీని భగ్నం చేసి, తమను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ.. గోషామహల్ స్టేడియంలోనే కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ నేతృత్వంలో కార్యకర్తలు రాజ్‌భవన్ ముట్టడికి ప్రయత్నించారు. రాజ్‌భవన్ గేటు దగ్గరకు చేరుకుని, లోపలికి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది, పోలీసులు వారిని నిలువరించడంతో... కొంతసేపు తోపులాట జరిగింది. కాగా... ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఆదివారం ధర్నాలు, ఆందోళనలు చేపడతామని టీపీసీసీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు సూచనలు జారీ చేసింది. నిర్భంధాలతో ప్రజల పోరాటం ఆగదు.. ప్రజల ఆకాంక్షలను, కోరికలను నెరవేర్చకుండా పోలీసులతో నిర్భంధిస్తే పోరాటాలు ఆగవని సీఎల్పీ నేత కె.జానారెడ్డి పేర్కొన్నారు. పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ స్టేడియానికి తరలించిన కాంగ్రెస్ నేతలను పరామర్శించిన జానారెడ్డి అక్కడే పొన్నాల, డి.శ్రీనివాస్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడితే ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పుతారని ఆయన హెచ్చరించారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న తమ ర్యాలీని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని జానారెడ్డి వ్యాఖ్యానించారు. సచివాలయం, ఛాతీ ఆసుపత్రి తరలింపు యోచనను కేసీఆర్ వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గాంధేయమార్గంలో, ప్రజాస్వామ్య యుతంగా జరుగుతున్న ర్యాలీని అడ్డుకోవడం ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను బయటపెట్టుకుందని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. సినిమాకు క్లైమాక్స్ చూపిస్తాం..: శ్రీధర్‌బాబు, దానం అసలు సినిమా చూపిస్తామంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు చూపించే సినిమాకు క్లైమాక్స్ తామే చూపిస్తామంటూ మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, దానం నాగేందర్ హెచ్చరించారు. అధికారం ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించిన వారంతా చరిత్రలో కొట్టుకుపోయారని వ్యాఖ్యానించారు. తప్పుడు కేసులు పెడితే ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, తెలంగాణ మంత్రులు అహంకారంతో వ్యవహరించడం మంచిది కాదని ఎమ్మెల్యే డి.కె.అరుణ హెచ్చరించారు. నిరసన తెలియజేయకుండా అడ్డుకుని, అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వం తన భయాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు.