టీ పీసీసీ ర్యాలీ ఉద్రిక్తం
గాంధీభవన్ నుంచి భారీ ర్యాలీగా నేతలు, కార్యకర్తలు
సచివాలయం, ఛాతీ ఆస్పత్రి తరలింపు యోచన విరమించుకోవాలని డిమాండ్
ర్యాలీకి అనుమతి లేదంటూ నిలువరించిన పోలీసులు
ప్రతిఘటించిన కాంగ్రెస్ కార్యకర్తలు.. ఇరువర్గాల తోపులాట
ఘర్షణలో స్వల్పంగా గాయపడిన పొన్నాల లక్ష్మయ్య
ప్రభుత్వ చర్య ప్రజాస్వామ్య విరుద్ధం..: జానారెడ్డి
నేడు రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో ధర్నాలు
సాక్షి, హైదరాబాద్: సచివాలయం మార్పు, ఛాతీ ఆసుపత్రి తరలింపు యోచనను వ్యతిరేకిస్తూ గాంధీభవన్ నుంచి రాజ్‌భవన్‌కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా... కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తీవ్రంగా తోపులాట జరిగింది.. ఈ తోపులాటలో కింద పడిపోయిన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్వల్పంగా గాయపడ్డారు. చివరికి పోలీసులు ఈ ర్యాలీని భగ్నం చేశారు. ఈ ర్యాలీని భగ్నం చేయడాన్ని నిరసిస్తూ సీఎల్పీ నేత జానారెడ్డి గోషా మహల్ పోలీస్ స్టేడియంలో ధర్నా చేయగా... టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ నేతృత్వంలో కార్యకర్తలు రాజ్‌భవన్ ముట్టడికి ప్రయత్నించారు.
టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతో పాటు ఆ పార్టీ మాజీ మంత్రులు, సీనియర్ నేతల నేతృత్వంలో కార్యకర్తలు గాంధీభవన్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు. వారు నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు నిలువరించారు. దీంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వారిని ప్రతిఘటించారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య కొంతసేపు తీవ్రంగా తోపులాట జరిగింది. ‘తెలంగాణ సీఎం కేసీఆర్ డౌన్ డౌన్, తుగ్లక్ పాలన చేస్తున్న కేసీఆర్ డౌన్ డౌన్’ అంటూ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అయితే పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల తోపులాటలో పొన్నాల లక్ష్మయ్యతో పాటు పలువురు కార్యకర్తలు స్వల్పంగా గాయపడ్డారు. పొన్నాల చేయి మెలితిరగడంతో పాటు పలు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయనను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఈ ర్యాలీతో దాదాపు గంట పాటు నాంపల్లి రైల్వేస్టేషన్ దగ్గర రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కాంగ్రెస్ నేతలు డి.శ్రీనివాస్, గీతారెడ్డి, దానం నాగేందర్, శ్రీధర్‌బాబు, అంజన్‌కుమార్ యాదవ్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధు యాష్కీ, సిరిసిల్ల రాజయ్య, మర్రి శశిధర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేడియానికి తరలించారు. పోలీసులు ర్యాలీని భగ్నం చేసి, తమను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ.. గోషామహల్ స్టేడియంలోనే కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ నేతృత్వంలో కార్యకర్తలు రాజ్‌భవన్ ముట్టడికి ప్రయత్నించారు. రాజ్‌భవన్ గేటు దగ్గరకు చేరుకుని, లోపలికి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది, పోలీసులు వారిని నిలువరించడంతో... కొంతసేపు తోపులాట జరిగింది. కాగా... ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఆదివారం ధర్నాలు, ఆందోళనలు చేపడతామని టీపీసీసీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు సూచనలు జారీ చేసింది.
నిర్భంధాలతో ప్రజల పోరాటం ఆగదు..
ప్రజల ఆకాంక్షలను, కోరికలను నెరవేర్చకుండా పోలీసులతో నిర్భంధిస్తే పోరాటాలు ఆగవని సీఎల్పీ నేత కె.జానారెడ్డి పేర్కొన్నారు. పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ స్టేడియానికి తరలించిన కాంగ్రెస్ నేతలను పరామర్శించిన జానారెడ్డి అక్కడే పొన్నాల, డి.శ్రీనివాస్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడితే ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పుతారని ఆయన హెచ్చరించారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న తమ ర్యాలీని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని జానారెడ్డి వ్యాఖ్యానించారు. సచివాలయం, ఛాతీ ఆసుపత్రి తరలింపు యోచనను కేసీఆర్ వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గాంధేయమార్గంలో, ప్రజాస్వామ్య యుతంగా జరుగుతున్న ర్యాలీని అడ్డుకోవడం ద్వారా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను బయటపెట్టుకుందని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు.
సినిమాకు క్లైమాక్స్ చూపిస్తాం..: శ్రీధర్‌బాబు, దానం
అసలు సినిమా చూపిస్తామంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ నేతలు చూపించే సినిమాకు క్లైమాక్స్ తామే చూపిస్తామంటూ మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, దానం నాగేందర్ హెచ్చరించారు. అధికారం ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించిన వారంతా చరిత్రలో కొట్టుకుపోయారని వ్యాఖ్యానించారు. తప్పుడు కేసులు పెడితే ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, తెలంగాణ మంత్రులు అహంకారంతో వ్యవహరించడం మంచిది కాదని ఎమ్మెల్యే డి.కె.అరుణ హెచ్చరించారు. నిరసన తెలియజేయకుండా అడ్డుకుని, అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వం తన భయాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు.